Pratham Education Trust
-
కోచింగ్‌కు కుమ్మరిస్తున్నారు!!
సాక్షి, అమరావతి: పిల్లలకు పాఠశాలల చదువులతోపాటు ప్రైవేటు ట్యూషన్లూ ఇటీవలి కాలంలో భారీగా పెరుగుతున్నాయి. కరోనాకు ముందు కొంత శాతం మంది పిల్లలకే పరిమితంగా ఉన్న ఈ ట్యూషన్లను ఇప్పుడు 70 శాతం మంది ఆశ్రయిస్తున్నారు. అంతకంతకూ పెరుగుతున్న పోటీ వాతావరణం, పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక టీవీలు, ఫోన్లు, ట్యాబ్‌లకు అతుక్కుపోవడం, ఇంట్లో పిల్లల అల్లరిని భరించలేకపోవడం, తమ పిల్లలు మిగిలినవారికంటే ముందుండాలనే తల్లిదండ్రుల తాపత్రయం వంటి కారణాలతో ప్రైవేటు ట్యూషన్లకు గతంలో కంటే ఇప్పుడు ఆదరణ పెరిగింది. ఉపాధ్యాయులు సైతం తమకు స్కూల్లో వస్తున్న జీతం కంటే ట్యూషన్ల ద్వారానే ఎక్కువ సంపాదిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. దంపతులు ఇద్దరూ టీచర్లే అయితే ఇక చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఎల్కేజీ పిల్లల నుంచి ఇంటర్ వరకు ప్రైవేటు ట్యూషన్లను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా మ్యాథ్స్, ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వంటి సబ్జెక్టులను చెప్పగలిగేవారికి మంచి డిమాండ్ ఉంది. భారీగా ఖర్చు చేస్తున్న తల్లిదండ్రులు.. ప్రస్తుతం భార్యాభర్తల్లో చాలామంది ఇద్దరూ ఉద్యోగాలు లేదా ఏదో ఒక పనిచేసేవారే. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులకు తమ పిల్లల చదువులను పట్టించుకోగల తీరిక, సమయం ఉండటం లేదు. ఉన్నా పిల్లల సందేహాలకు సమాధానాలు ఇవ్వగల పరిజ్ఞానం కరువవుతోంది. దీంతో పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక వారిని ప్రైవేటు ట్యూషన్లకు పంపుతున్నారు. ఇందుకు నెలకు భారీ మొత్తమే అవుతున్నా తల్లిదండ్రులు వెనుకడుగు వేయడం లేదు. ప్రథమ్ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ఏన్యువల్ సర్వే రిపోర్టు ఆన్ ఎడ్యుకేషన్ (అసర్)–2021 నివేదిక ప్రకారం.. తల్లిదండ్రులు పాఠశాలల చదువులపైనే కాకుండా ప్రైవేటు ట్యూషన్లపైన కూడా ఎక్కువ ఖర్చు చేస్తుండటం గమనార్హం. కరోనా తెచ్చిన మార్పు.. కరోనా సమయంలో స్కూళ్లు మూతపడి పిల్లలు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో వారి చదువు సరిగా సాగలేదు. ఆన్లైన్ క్లాసులు కూడా అంతంతమాత్రంగానే సాగాయి. దీంతో పిల్లల అభ్యసనం కొంతమేర దెబ్బతింది. దీన్ని అధిగమించేందుకు తల్లిదండ్రులు ప్రైవేటు ట్యూషన్లను ఆశ్రయిస్తున్నారు. 25 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రథమ్ సంస్థ చేసిన సర్వే ప్రకారం.. 40 శాతం మంది పాఠశాల విద్యార్థులు ట్యూషన్‌కి వెళ్తుండగా ఇప్పుడా సంఖ్య మరింత పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. 2020 32.5 శాతం, 2018లో 28.6 శాతం ఉండగా ఇప్పుడది రెట్టింపు అయ్యిందని ప్రథమ్ సర్వే పేర్కొంది. పాఠశాలలూ కారణమే.. కాగా ట్యూషన్లు పెరిగిపోవడానికి పాఠశాలల్లో కొందరు టీచర్లు సరిగా బోధించలేకపోవడం కూడా కారణమేనంటున్నారు. పాఠశాలల్లో కొందరు ఉపాధ్యాయులు బోధనపై కన్నా ఇతర వ్యాపకాలపై దృష్టి పెడుతుండడంతో పిల్లలకు సరైన బోధన అందడం లేదంటున్నారు. ఈ పరిస్థితి నుంచి తమ పిల్లలను గట్టెక్కించేందుకు తల్లిదండ్రులు ట్యూషన్లకు పంపుతున్నారని సర్వే నివేదికలు పేర్కొంటున్నాయి. రిజిస్టర్డ్ ట్యుటోరియల్ సంస్థలు వేళ్ల మీద మాత్రమే ఉండగా అనేక వేల ట్యూషన్ సంస్థలు ప్రతి వీధిలో దర్శనమిస్తున్నాయి. ట్యూషన్ కోసం తన వద్దకు వచ్చే విద్యార్థుల్లో 30 నుంచి 40 శాతం పెరుగుదల ఉందని విజయవాడలో ట్యుటోరియల్ తరగతులు నిర్వహిస్తున్న నిపుణుడొకరు వివరించారు. 1–12 తరగతులకు విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్థిక స్థితిని బట్టి నెలకు 2 వేల నుంచి 5 వేల వరకు ఫీజుగా తీçసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తమ పిల్లలకు మంచిగా చెప్పాలే కానీ అధికమొత్తం ఇచ్చేందుకు కూడా తల్లిదండ్రులు ముందుకు వస్తున్నారన్నారు. హోమ్ ట్యూషన్లకూ పెరిగిన డిమాండ్.. ఇటీవల కాలంలో ప్రత్యేకంగా పిల్లలకు తల్లిదండ్రులు తమ ఇంటిలోనే హోమ్ ట్యూషన్లు చెప్పిస్తున్నారు. ఇందుకు టీచర్లు భారీగా డిమాండ్ చేస్తున్నా తల్లిదండ్రులు వెనక్కి తగ్గడం లేదు. ముఖ్యంగా ఆడపిల్లలను ట్యూషన్లకు పంపడం ఇష్టం లేనివారు తమ ఇళ్లవద్దే హోమ్ ట్యూషన్లు చెప్పిస్తున్నారు. -
Rukmini Banerji: స్మార్ట్ మామ్ ఈ రుక్మిణి.. ఏం చేస్తారంటే!
పిల్లలు స్కూలుకు వెళ్లి చదువుకుంటున్నారు. కానీ ఏడాది ఏడాదికి తరగతులు మాత్రమే మారుతున్నాయి. వారు నేర్చుకున్నది ఏమీ కనిపించడం లేదు. స్కూళ్లలో చదువుతోన్న యాభైశాతం మంది పిల్లలు కనీసం పదాలు కూడా సరిగా రాయలేకపోతున్నారు. చిన్నపాటి వాక్యాలను కూడా చదవలేకపోతున్నారు. ఇక గణితం అయితే అంతే సంగతులు. ఈ స్థితిని ‘లెర్నింగ్ ప్రావర్టీ’గా పరిగణించాల్సిన అవసరం ఉంది. దీని మీద దృష్టి కేంద్రీకరించకపోతే రేపటితరం భవిష్యత్ అంధకారమవుతుంది అని అర్థవంతంగా చెప్పారు డాక్టర్ రుక్మిణీ బెనర్జి. దీంతో వందకుౖ పెగా దేశాల విద్యావేత్తలు పోటీపడిన బహుమతిని అవలీలగా అందుకున్నారు రుక్మిణీ బెనర్జీ. పాఠశాల విద్యలో అభ్యసన ప్రక్రియను మెరుగు పరచడానికి ఆమె సూచించిన అంశాలకు గాను ఎడ్యుకేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ‘యిదన్’ బహుమతి అందుకున్నారు. ఈ బహుమతి కోసం 130 దేశాలకు చెందిన విద్యావేత్తలు పోటీపడగా బెనర్జీని బహుమతి వరించడం విశేషం. ఆర్థికవేత్త నుంచి విద్యావేత్తగా... బిహార్‌కు చెందిన డాక్టర్ రుక్మిణీ బెనర్జీ న్యూఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజీ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో అర్థశాస్త్రాన్ని చదివి, ఆక్స్ఫర్డ్ యూనివర్శిటి స్కాలర్‌గా చేరారు. తరువాత చికాగో యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేశారు. ఉన్నత విద్య పూర్తయ్యాక అమెరికాలోనే స్థిరపడిన బెనర్జి 1996లో ఇండియా వచ్చారు. అప్పుడు ముంబై కేంద్రంగా పనిచేస్తోన్న ఎన్జీవో ‘ప్రథమ్’లో చేరారు. అప్పటి నుంచి విద్యావ్యవస్థ అభివృద్ధే లక్ష్యంగా కృషిచేస్తున్నారు. వివిధ రకాల కార్యక్రమాల ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్కూలు పిల్లల అభ్యసనను మెరుగుపరుస్తున్నారు. ఈ క్రమంలోనే బెనర్జీ నేతృత్వంలోని బృందం ‘యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్టు’(ఏఎస్ ఈఆర్)ను విడుదల చేసింది. 2005–15 వరకు ఇంటింటికి తిరిగి సర్వే చేసి విడుదల చేసిన నివేదిక అది. వందరోజులకు పైగా గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి ఆరు లక్షలమంది పిల్లల అక్షరాస్యత నాణ్యతపై సర్వే నిర్వహించారు. ఈ క్రమంలో అనేక స్కూళ్లను సందర్శించి ఎక్కువమంది పిల్లలు ప్రాథమిక అంశాలను కూడా చదవలేకపోవడం, చిన్నపాటి గుణింతాలు కూడా చేయలేకపోవడం గుర్తించి, అంతేగాక ‘టీచింగ్ ఎట్ ద రైట్ లెవల్’ (టీఏఆర్‌ఎల్) కార్యక్రమం ద్వారా విద్యార్థుల అభ్యసనను మెరుగు పరచవచ్చని సూచించారు. అంతేగాక టీఏఆర్ఎల్ను కొన్ని ప్రాంతాల్లో అమలు చేసి మంచి ఫలితాలను చూపించారు. ఈ కార్యక్రమానికి రుక్మిణి చేసిన కృషికి గుర్తింపుగా ఆమెను యిదన్ ప్రైజ్ వరించింది. ఏఎస్ఈఆర్.. ఏఎస్ఈఆర్తోపాటు .. పిల్లల కోసం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో దినపత్రికల్లో ఆరి్టకల్స్ రాయడం, పిల్లలకు సులువుగా అర్థమయ్యే విధంగా కథల పుస్తకాలను బెనర్జీ రాస్తున్నారు. ఏఎస్ఈఆర్ నివేదిక రూపొందించే బృందాన్ని ముందుండి నడిపించారు. ఈ నివేదికను విడుదల చేసిన తరువాత బెనర్జి ప్రథమ్‌కు సీఈవో అయ్యారు. విద్యావ్యవస్థ అభివృద్ధిని గుర్తించిన బిహార్ ప్రభుత్వం 2008లో ‘మౌలానా అబుల్ కలామ్ శిక్షా పురస్కార్’తో సత్కరించింది. రాష్ట్రంలో ఈ అవార్డును అందుకున్న తొలి వ్యక్తి బెనర్జీనే. తాజాగా 2021 సంవత్సరానికి గాను విద్యాభివృద్ధికి కృషిచేస్తోన్న వారికిచ్చే ‘యిదన్’ బహుమతిని అందుకున్నారు. స్మార్ట్ మామ్ విద్యద్వారా మెరుగైన ప్రపంచాన్ని అందించేవారిని సత్కరించేందుకు గాను 2016లో చార్లెస్ చెన్ యిదన్ ‘ద యిదన్ అవార్డు’ను ఏర్పాటు చేశారు. ఈ బహుమతి పొందిన వారికి స్వర్ణ పతకంతోపాటు, 3.9 మిలియన్ డాలర్లు( మన రూపాయల్లో దాదాపు 29 కోట్లు) దీనిలో సగం మొత్తా్తన్ని విద్యాభివృద్దికి వినియోగించాలి. ‘‘యిదన్ ప్రైజ్ విద్యాభివృద్ధికి మరింత కృషిచేసే అవకాశం కల్పించింది. గత 15 ఏళ్లుగా పిల్లల అక్షరాస్యతపై పనిచేస్తున్నాం. మొహల్లా లెర్నింగ్ క్యాంపెయిన్‌లో భాగంగా వలంటీర్లతో ‘టీచింగ్ ఎట్ ది రైట్ లెవల్’ను అందిస్తున్నాము. ‘స్మార్ట్ మామ్’ పేరిట విద్యార్థుల తల్లులకు ఎస్ఎమ్ఎస్, వాట్సాప్ మెస్సేజ్‌ల ద్వారా చిన్నపాటి యాక్టివిటీలను అప్పజెప్పి వారి ద్వారా పిల్లల అభ్యసనను మెరుగుపరుస్తున్నాం. దీనికి మంచి స్పందన లభిస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పదివేల కమ్యూనిటీల్లో 30 నుంచి 35 వేలమంది తల్లులు పాల్గొంటున్న ఈ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తాము’’ అని రుక్మిణీ బెనర్జీ వివరించారు. చదవండి: కూచునే హక్కు మీకు ఉంది... -
ఆన్లైన్ విద్యకు మార్కులు
దేశంలో విద్యావ్యవస్థ స్థితిగతులపై ఏటా స్వచ్ఛంద సంస్థ ప్రథమ్ విడుదల చేసే వార్షిక విద్యాస్థాయి నివేదిక(అసర్)లు దాదాపు నిరాశానిస్పృహలే మిగులుస్తాయి. నాలుగోతరగతి పిల్లలు ఒకటో తరగతి లెక్కలు కూడా చేయలేకపోతున్నారని... అయిదో తరగతి పిల్లలు మూడో తరగతి పుస్తకాన్ని కూడా తప్పులు లేకుండా చదవలేకపోతున్నారని అది గతంలో చాలాసార్లు చెప్పింది. మన దేశంలో పదేళ్లక్రితం ఆర్భాటంగా మొదలైన విద్యాహక్కు చట్టం ఆచరణలో ఎంత ఘోరంగా విఫలమైందో చెప్పడానికి ఆ సర్వేలు సజీవ సాక్ష్యంగా నిలుస్తాయి. ఆ చట్టం వల్ల కేవలం విద్యార్థుల నమోదు పెరిగింది తప్ప, హాజరు శాతం అందుకు దీటుగా వుండటం లేదని ఆ నివేదికలు తరచు చెబుతుంటాయి. అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నమైన పరిస్థితుల్లో అసర్ నివేదిక విడు దలైంది. కరోనా వైరస్ మహమ్మారి విరుచుకుపడిన పర్యవసానంగా విధించిన లాక్‌డౌన్‌తో విద్యాసంస్థలన్నీ మూతబడ్డాయి. విద్యాసంస్థలు తెరవడానికి ప్రభుత్వాలు సాహసించడం లేదు. దానికి బదులు ఆన్లైన్ పాఠాలవైపు మొగ్గుచూపడం మొదలైంది. తాజా నివేదిక ఈ ఆన్లైన్ బోధన ఎలావుందన్న అంశంపై ప్రధానంగా దృష్టిసారించింది. అది తీసుకొచ్చిన కొత్తరకం అసమానత లేమిటన్నదీ వెల్లడించింది. ఇక పల్లెసీమల్లో ప్రైవేటు పాఠశాలలనుంచి ప్రభుత్వ పాఠశాలలవైపు వలసపోయే ధోరణి గత రెండేళ్ల మాదిరే ఈసారి కూడా పెరిగిందని ఆ నివేదిక చెబుతోంది. ఇందుకు కారణం ఆ పిల్లల తల్లిదండ్రుల ఆదాయాలు పడిపోవడం వల్లనేనని అసర్ నివేదిక అభిప్రాయం. అయితే కేవలం ఇదొకటే కారణమని చెప్పలేం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, పంజాబ్ వంటి రాష్ట్రాలు విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. తెలం గాణలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు ఏటా సాధిస్తున్న విజయాలు ఎన్నదగినవి. ఆ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న 268 గురుకుల పాఠశాలల పిల్లలు ప్రతిష్టాత్మకమైన ఐఐటీ, నిట్, ఢిల్లీ యూనివర్సిటీ, అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ వంటి చోట్ల ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశం సంపాదించగలుగుతున్నారు. కేవలం చదువుల్లోనే కాదు... ఇతరత్రా అంశాల్లో కూడా ముందంజలో వుంటున్నారు. అటు ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిననాటినుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. సకల సౌకర్యాలతో పాఠశాలల్ని అద్భుతంగా తీర్చిదిద్దు తున్నారు. పిల్లలకు పాఠ్యపుస్తకాలు మొదలుకొని యూనిఫాం వరకూ అన్నిటినీ అందజేస్తున్నారు. ప్రభుత్వాలు ఇలా ప్రత్యేక శ్రద్ధ పెట్టి బడుల్ని బాగు జేస్తుంటే ప్రైవేటు విద్యాసంస్థలవైపు సహజం గానే ఎవరూ వెళ్లరు. ఈసారి కొత్తగా అమల్లోకొచ్చిన ఆన్లైన్ విద్యావిధానానికి పిల్లలు అలవాటు పడ్డారని అసర్ నివేదిక చెబుతోంది. రెండేళ్లక్రితం పరిస్థితితో పోలిస్తే ఇప్పుడు పిల్లలున్న కుటుంబాల్లో స్మార్ట్ ఫోన్ల వాడకం బాగా పెరిగిందని వివరిస్తోంది. హాజరుపట్టీల్లో నమోదైన పిల్లల్లో 61.8 శాతంమందికి స్మార్ట్ఫోన్లున్నాయని, రెండేళ్లక్రితం కేవలం 36.5 శాతం పిల్లల ఇళ్లలో మాత్రమే అవి వుండేవని నివేదిక వెల్లడించింది. లాక్డౌన్ అనంతర పరిస్థితుల్లో ఉపాధి కోల్పోయినా అదనంగా ఇంతమంది స్మార్ట్ఫోన్లు కొనడం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే తమ పిల్లలు ఎలాగైనా చదువుల్లో ఉన్నతంగా వుండాలన్న లక్ష్యంతో అప్పో సప్పో చేసి ఆ ఫోన్లు కొనేవారు తప్పనిసరిగా వుంటారు. స్మార్ట్ ఫోన్ వున్నంతమాత్రాన అంతా సవ్యంగా వుందనుకోలేం. ఒకరే సంతానం వున్న ఇంట్లో ఫర్వా లేదుగానీ... ఒకరికి మించి పిల్లలున్నచోట సమస్యే. వేర్వేరు తరగతుల పిల్లలకు ఒకే సమయంలో బోధన సాగుతున్నప్పుడు తమ పిల్లల్లో ఆ ఫోన్ ఎవరికి ఇవ్వాలన్నది తల్లిదండ్రులు తేల్చుకోలేరు. ఇలాంటి సందర్భాల్లో చాలాసార్లు ఆడపిల్లలకే అన్యాయం జరుగుతుందని చెప్ప నవసరం లేదు. అయితే ఆన్లైన్ విద్య వల్ల కుటుంబాల్లో పిల్లలపట్ల శ్రద్ధ కనబరిచే ధోరణి పెరి గిందని అసర్ నివేదిక అంటోంది. తల్లిదండ్రులు, తోడబుట్టినవారి సాయం పిల్లలకు అందుతోం దని గణాంకాలు వెల్లడించాయి. తల్లిదండ్రులు అయిదో తరగతి వరకూ చదువుకున్నవారైతే తమ పిల్లలకు ఏదో రూపంలో తోడ్పాటు అందిస్తున్నారని నివేదిక తేల్చింది. 54.8 శాతంమంది పిల్లలకు ఇలా సాయం అందుతోందని అది వివరించింది. తమకు తెలియని సందర్భాల్లో ఇరుగు పొరుగునో, టీచర్నో ఆశ్రయించి తమ పిల్లలకు మెరుగ్గా అర్థమయ్యేందుకు వారు తోడ్పడుతున్నారట. ఈసారి బడులు మూతబడ్డాయి కనుక ప్రథమ్ సంస్థ ఫోన్ల ద్వారానే తల్లిదండ్రుల్ని, ఉపా ధ్యాయుల్ని ప్రశ్నలడిగి సమాచారం రాబట్టింది. నేరుగా వారితో మాటామంతీ జరిపితే మరింత లోతైన సమాచారం వెల్లడవుతుంది. అతి సామాన్య కుటుంబాల్లో కూడా పిల్లల చదువులపై నేరుగా తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టే ధోరణి పెరగడం మంచిదే. ఇది ఆన్లైన్ విద్యావిధానం తీసుకొచ్చిన సుగుణం. అయితే బడివిద్యకు ఆన్లైన్ విద్య ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు. తరగతి గదిలో పిల్లలు కేవలం పుస్తకాల్లో వుండే జ్ఞానాన్ని మాత్రమే కాక, అనుభవజ్ఞానాన్ని కూడా సంపాదిస్తారు. పిల్లలకూ, టీచర్లకూ మధ్య... పిల్లలమధ్య జరిగే సంభాషణలు వారికి వికాసానికి తోడ్పడతాయి. అయితే బడులు తెరుచుకున్న దేశాల్లో అనుభవాలు చూస్తే భయం కలుగుతుంది. స్వేచ్ఛగా, ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన పిల్లలు తెలియని ఒక ఉద్రిక్త వాతావరణంలో దూరం దూరంగా... భయంభయంగా తరగతి గదుల్లో కూర్చుంటున్నారు. ఇక ఆటపాటల మాట చెప్పన వసరమే లేదు. ఈ సమస్యనుంచి సాధ్యమైనంత త్వరగా ప్రపంచం గట్టెక్కగలిగితే మళ్లీ బడులు మునుపట్లా కళకళలాడతాయి. ఈలోగా బడుల్లో మౌలిక సదుపాయాలు మొదలుకొని విద్యాబోధన వరకూ అన్ని లోపాలను ప్రభుత్వాలు చక్కదిద్దాలి. -
గంగమ్మను తీసుకువచ్చారు!
విద్య అనేది వివేకాన్ని మాత్రమే కాదు... పోరాడే చైతన్యాన్ని ఇస్తుంది. మన దేశంలోని అనేక మారుమూల గ్రామాలలాగే ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ జిల్లాలోని నయాగవ్ కూడా ఒకటి. మిగిలిన సమస్యల మాట ఎలా ఉన్నా ఆ గ్రామానికి తాగునీటి సమస్య అనేది అతి పెద్ద సమస్య. తాగునీటి కోసం మహిళలు ఎన్నో కిలోమీటర్ల దూరం ప్రయాణించేవారు. ‘నీటి సమస్య’ అనేది కేవలం ఆడవాళ్ల సమస్య మాత్రమే అన్నట్లుగా ఉండేవాళ్లు పురుషులు. ఇక అమ్మాయిలను బడికి పంపించడం అనేది అరుదైన విషయం.‘‘మీ అమ్మాయి స్కూలుకు వెళుతుందా?’’ అని కొత్తవాళ్లు ఎవరైనా అడిగితే...‘‘స్కూల్ కా?’’ అనే ప్రశ్నలాంటి సమాధానం ఒకటి వినిపించేది.‘స్కూల్ కా?’ అని ఆశ్చర్యపోవడంలో ఎన్నో అర్థాలు దాగున్నాయి.‘ఆడపిల్లలకు స్కూలుతో పనేమిటి?’ అనేది అందులో ఒకటి. ఒకవేళ అమ్మాయిలు స్కూలు గడప తొక్కినా, మధ్యలోనే చదువును ఆపించడం అనేది సాధారణంగా మారింది. అయితే ‘ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్’ ‘సెకండ్ ఛాన్స్’ వల్ల ఈ పరిస్థితిలో గణనీయంగా మార్పు వచ్చింది. బడికి వెళ్లని పిల్లలను స్కూల్లో చేర్పించడంతో పాటు చదువును మధ్యలోనే ఆపేíసిన పిల్లలను ‘సెకండ్ ఛాన్స్ ప్రోగ్రాం’లో భాగంగా తిరిగి స్కూల్లో చేర్పించే పనికి ‘ప్రథమ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్’ స్వీకారం చుట్టింది. దీంతో చాలామంది అమ్మాయిలు పదవతరగతి విజయవంతంగా పూర్తి చేశారు. కొందరు పై చదువులకు వెళ్లారు. కొందరు వృత్తివిద్యా కోర్సులలోకి వెళ్లారు.కొందరు పై చదువులకు వెళ్లి, పార్ట్‌టైం ఉద్యోగాలు చేస్తూ కుటుంబానికి సహాయంగా నిలిచారు. ఫౌండేషన్ తరపున నిర్వహించిన ‘లైఫ్ స్కిల్స్’ కోర్సు పిల్లలలో ఎంతో మార్పు తీసుకువచ్చింది. సమస్యల పరిష్కారం, నిర్ణయాలలో సరిౖయెన ఎంపిక, విమర్శనాత్మకంగా, సృజనాత్మకంగా ఆలోచించడం... మొదలైన వాటితో పాటు నిజజీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ఉపయోగపడింది. ‘లైఫ్ స్కిల్స్’ పాఠాలు గది గోడలకే పరిమితం కాలేదు. మద్యపానం, గృహహింస, కచ్చా రోడ్లు, పబ్లిక్ టాయిలెట్లు లేకపోవడం... మొదలైన వాటితో పాటు నిజజీవితంలో ఎన్నో సమస్యల పరిష్కారానికి ముందుకు వచ్చాయి. దీనికి పెద్ద ఉదాహరణే... ఈ ముగ్గురు అమ్మాయిలు... 1.అహల్య కుమారి. 2.అంజనీ కుమారి. 3.రజనీ కుమారి.ఈ అమ్మాయిలు మొదట తమ గ్రామంలోని తాగునీటి సమస్యపై దృష్టిసారించారు. ఈ సమస్యపై దృష్టి సారించిన వాళ్లలో వీరే ప్రథములు కాదు... అంతకు ముందు చాలామందే దృష్టి సారించారు. అయితే మాత్రం ఏమిటి? ఎలాంటి ఫలితం ఒనగూడలేదు. ఈ ముగ్గురు అమ్మాయిలు మాత్రం ‘ఎలాగైనా సరే, తాగునీటి సమస్యను పరిష్కరించాలి’ అనే దృఢనిశ్చయంతో ముందుకు కదిలారు. ఒకటికి పదిసార్లు గ్రామసర్పంచ్‌ను కలిసి సమస్య గురించి మాట్లాడారు. గ్రామంలో ఎలాగైనా సరే బోర్వెల్ వేయాలని విన్నవించుకున్నారు. ‘ఆడపిల్లలు ఇల్లు విడిచి బయటికి రావడం ఏమిటి! సమస్యలు అంటూ ఇలా పెద్ద వాళ్ల ఇంటి చుట్టూ తిరగడం ఏమిటి?’ అని గ్రామంలో చాలామంది సన్నాయి నొక్కులు నొక్కారు. చివరికి అహల్య, అంజనీ, రజనీ సోదరులు కూడా... ‘‘మీకు అవసరం లేని పనిలో తలదూర్చుతూ టైం వేస్ట్ చేస్తున్నారు’’ అని విసుక్కున్నారు. విసుగు... కోపం... ఎగతాళి... సూటిపోటి మాటలు... ఇలాంటివేమీ పట్టించుకోలేదు అహల్య, అంజనీ, రజనీ. ‘సమస్య ఉన్న చోట పోరాటం ఉండాలి’ అనే దృక్పథంతో ముందుకు కదిలారు. ఎట్టకేలకు గ్రామంలో బోర్వెల్ వేయించడానికి సర్పంచ్ ఒప్పుకున్నాడు. నెలన్నర రోజులలోనే గ్రామానికి బోర్వెల్ వచ్చింది. ‘‘ఇప్పుడు మా ఊళ్లో తాగు నీటికోసం ఎవరూ వేరే గ్రామాన్ని వెదుక్కుంటూ గంటల తరబడి నడవనక్కర్లేదు’’ అని సంతోషపడి పోతున్నారు అహల్య, అంజనీ, రజనీలు. పిల్లలను బడిలో చేర్పించడం, బడి మధ్యలోనే మానేసిన పిల్లలను తిరిగి బడిలో చేర్పించే పనిలో ఇప్పుడిప్పుడే క్రియాశీలకం అవుతున్నారు అహల్య, అంజనీ, రజనీ.కాస్త ఆలస్యంగానైనా సరే ఈ ముగ్గురిని అభినందనలతో ముంచెత్తారు గ్రామస్తులు. ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక అడుగుతోనే మొదలవుతుంది. గ్రామంలో బోర్వెల్ వేయించడం అలాంటి అడుగే కావచ్చు. ఇంకా చాలా ప్రయాణమే ఉంది. ఆ ప్రయాణం చేయడానికి ఈ ముగ్గురులాంటి అమ్మాయిలు గ్రామంలో మరింత మంది సిద్ధమవుతున్నారు.