గంగమ్మను తీసుకువచ్చారు!
విద్య అనేది వివేకాన్ని మాత్రమే కాదు... పోరాడే చైతన్యాన్ని ఇస్తుంది. మన దేశంలోని అనేక మారుమూల గ్రామాలలాగే ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలోని నయాగవ్ కూడా ఒకటి. మిగిలిన సమస్యల మాట ఎలా ఉన్నా ఆ గ్రామానికి తాగునీటి సమస్య అనేది అతి పెద్ద సమస్య. తాగునీటి కోసం మహిళలు ఎన్నో కిలోమీటర్ల దూరం ప్రయాణించేవారు. ‘నీటి సమస్య’ అనేది కేవలం ఆడవాళ్ల సమస్య మాత్రమే అన్నట్లుగా ఉండేవాళ్లు పురుషులు.
ఇక అమ్మాయిలను బడికి పంపించడం అనేది అరుదైన విషయం.‘‘మీ అమ్మాయి స్కూలుకు వెళుతుందా?’’ అని కొత్తవాళ్లు ఎవరైనా అడిగితే...‘‘స్కూల్ కా?’’ అనే ప్రశ్నలాంటి సమాధానం ఒకటి వినిపించేది.‘స్కూల్ కా?’ అని ఆశ్చర్యపోవడంలో ఎన్నో అర్థాలు దాగున్నాయి.‘ఆడపిల్లలకు స్కూలుతో పనేమిటి?’ అనేది అందులో ఒకటి.
ఒకవేళ అమ్మాయిలు స్కూలు గడప తొక్కినా, మధ్యలోనే చదువును ఆపించడం అనేది సాధారణంగా మారింది. అయితే ‘ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్’ ‘సెకండ్ ఛాన్స్’ వల్ల ఈ పరిస్థితిలో గణనీయంగా మార్పు వచ్చింది. బడికి వెళ్లని పిల్లలను స్కూల్లో చేర్పించడంతో పాటు చదువును మధ్యలోనే ఆపేíసిన పిల్లలను ‘సెకండ్ ఛాన్స్ ప్రోగ్రాం’లో భాగంగా తిరిగి స్కూల్లో చేర్పించే పనికి ‘ప్రథమ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్’ స్వీకారం చుట్టింది. దీంతో చాలామంది అమ్మాయిలు పదవతరగతి విజయవంతంగా పూర్తి చేశారు.
కొందరు పై చదువులకు వెళ్లారు. కొందరు వృత్తివిద్యా కోర్సులలోకి వెళ్లారు.కొందరు పై చదువులకు వెళ్లి, పార్ట్‌టైం ఉద్యోగాలు చేస్తూ కుటుంబానికి సహాయంగా నిలిచారు. ఫౌండేషన్ తరపున నిర్వహించిన ‘లైఫ్ స్కిల్స్’ కోర్సు పిల్లలలో ఎంతో మార్పు తీసుకువచ్చింది. సమస్యల పరిష్కారం, నిర్ణయాలలో సరిౖయెన ఎంపిక, విమర్శనాత్మకంగా, సృజనాత్మకంగా ఆలోచించడం... మొదలైన వాటితో పాటు నిజజీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ఉపయోగపడింది.
‘లైఫ్ స్కిల్స్’ పాఠాలు గది గోడలకే పరిమితం కాలేదు. మద్యపానం, గృహహింస, కచ్చా రోడ్లు, పబ్లిక్ టాయిలెట్‌లు లేకపోవడం... మొదలైన వాటితో పాటు నిజజీవితంలో ఎన్నో సమస్యల పరిష్కారానికి ముందుకు వచ్చాయి. దీనికి పెద్ద ఉదాహరణే... ఈ ముగ్గురు అమ్మాయిలు... 1.అహల్య కుమారి. 2.అంజనీ కుమారి. 3.రజనీ కుమారి.ఈ అమ్మాయిలు మొదట తమ గ్రామంలోని తాగునీటి సమస్యపై దృష్టిసారించారు. ఈ సమస్యపై దృష్టి సారించిన వాళ్లలో వీరే ప్రథములు కాదు... అంతకు ముందు చాలామందే దృష్టి సారించారు. అయితే మాత్రం ఏమిటి? ఎలాంటి ఫలితం ఒనగూడలేదు.
ఈ ముగ్గురు అమ్మాయిలు మాత్రం ‘ఎలాగైనా సరే, తాగునీటి సమస్యను పరిష్కరించాలి’ అనే దృఢనిశ్చయంతో ముందుకు కదిలారు. ఒకటికి పదిసార్లు గ్రామసర్పంచ్‌ను కలిసి సమస్య గురించి మాట్లాడారు. గ్రామంలో ఎలాగైనా సరే బోర్‌వెల్ వేయాలని విన్నవించుకున్నారు. ‘ఆడపిల్లలు ఇల్లు విడిచి బయటికి రావడం ఏమిటి! సమస్యలు అంటూ ఇలా పెద్ద వాళ్ల ఇంటి చుట్టూ తిరగడం ఏమిటి?’ అని గ్రామంలో చాలామంది సన్నాయి నొక్కులు నొక్కారు. చివరికి అహల్య, అంజనీ, రజనీ సోదరులు కూడా... ‘‘మీకు అవసరం లేని పనిలో తలదూర్చుతూ టైం వేస్ట్ చేస్తున్నారు’’ అని విసుక్కున్నారు. విసుగు... కోపం... ఎగతాళి... సూటిపోటి మాటలు... ఇలాంటివేమీ పట్టించుకోలేదు అహల్య, అంజనీ, రజనీ.
‘సమస్య ఉన్న చోట పోరాటం ఉండాలి’ అనే దృక్పథంతో ముందుకు కదిలారు. ఎట్టకేలకు గ్రామంలో బోర్‌వెల్ వేయించడానికి సర్పంచ్ ఒప్పుకున్నాడు. నెలన్నర రోజులలోనే గ్రామానికి బోర్‌వెల్ వచ్చింది. ‘‘ఇప్పుడు మా ఊళ్లో తాగు నీటికోసం ఎవరూ వేరే గ్రామాన్ని వెదుక్కుంటూ గంటల తరబడి నడవనక్కర్లేదు’’ అని సంతోషపడి పోతున్నారు అహల్య, అంజనీ, రజనీలు. పిల్లలను బడిలో చేర్పించడం, బడి మధ్యలోనే మానేసిన పిల్లలను తిరిగి బడిలో చేర్పించే పనిలో ఇప్పుడిప్పుడే క్రియాశీలకం అవుతున్నారు అహల్య, అంజనీ, రజనీ.కాస్త ఆలస్యంగానైనా సరే ఈ ముగ్గురిని అభినందనలతో ముంచెత్తారు గ్రామస్తులు. ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక అడుగుతోనే మొదలవుతుంది. గ్రామంలో బోర్‌వెల్ వేయించడం అలాంటి అడుగే కావచ్చు. ఇంకా చాలా ప్రయాణమే ఉంది. ఆ ప్రయాణం చేయడానికి ఈ ముగ్గురులాంటి అమ్మాయిలు గ్రామంలో మరింత మంది సిద్ధమవుతున్నారు.