పిల్లలు స్కూలుకు వెళ్లి చదువుకుంటున్నారు. కానీ ఏడాది ఏడాదికి తరగతులు మాత్రమే మారుతున్నాయి. వారు నేర్చుకున్నది ఏమీ కనిపించడం లేదు. స్కూళ్లలో చదువుతోన్న యాభైశాతం మంది పిల్లలు కనీసం పదాలు కూడా సరిగా రాయలేకపోతున్నారు. చిన్నపాటి వాక్యాలను కూడా చదవలేకపోతున్నారు. ఇక గణితం అయితే అంతే సంగతులు.
ఈ స్థితిని ‘లెర్నింగ్ ప్రావర్టీ’గా పరిగణించాల్సిన అవసరం ఉంది. దీని మీద దృష్టి కేంద్రీకరించకపోతే రేపటితరం భవిష్యత్ అంధకారమవుతుంది అని అర్థవంతంగా చెప్పారు డాక్టర్ రుక్మిణీ బెనర్జి. దీంతో వందకుౖ పెగా దేశాల విద్యావేత్తలు పోటీపడిన బహుమతిని అవలీలగా అందుకున్నారు రుక్మిణీ బెనర్జీ.
పాఠశాల విద్యలో అభ్యసన ప్రక్రియను మెరుగు పరచడానికి ఆమె సూచించిన అంశాలకు గాను ఎడ్యుకేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ‘యిదన్’ బహుమతి అందుకున్నారు. ఈ బహుమతి కోసం 130 దేశాలకు చెందిన విద్యావేత్తలు పోటీపడగా బెనర్జీని బహుమతి వరించడం విశేషం.
ఆర్థికవేత్త నుంచి విద్యావేత్తగా...
బిహార్‌కు చెందిన డాక్టర్ రుక్మిణీ బెనర్జీ న్యూఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజీ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో అర్థశాస్త్రాన్ని చదివి, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటి స్కాలర్‌గా చేరారు. తరువాత చికాగో యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఉన్నత విద్య పూర్తయ్యాక అమెరికాలోనే స్థిరపడిన బెనర్జి 1996లో ఇండియా వచ్చారు.
అప్పుడు ముంబై కేంద్రంగా పనిచేస్తోన్న ఎన్జీవో ‘ప్రథమ్’లో చేరారు. అప్పటి నుంచి విద్యావ్యవస్థ అభివృద్ధే లక్ష్యంగా కృషిచేస్తున్నారు. వివిధ రకాల కార్యక్రమాల ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్కూలు పిల్లల అభ్యసనను మెరుగుపరుస్తున్నారు. ఈ క్రమంలోనే బెనర్జీ నేతృత్వంలోని బృందం ‘యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్టు’(ఏఎస్ ఈఆర్)ను విడుదల చేసింది.
2005–15 వరకు ఇంటింటికి తిరిగి సర్వే చేసి విడుదల చేసిన నివేదిక అది. వందరోజులకు పైగా గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి ఆరు లక్షలమంది పిల్లల అక్షరాస్యత నాణ్యతపై సర్వే నిర్వహించారు. ఈ క్రమంలో అనేక స్కూళ్లను సందర్శించి ఎక్కువమంది పిల్లలు ప్రాథమిక అంశాలను కూడా చదవలేకపోవడం, చిన్నపాటి గుణింతాలు కూడా చేయలేకపోవడం గుర్తించి, అంతేగాక ‘టీచింగ్ ఎట్ ద రైట్ లెవల్’ (టీఏఆర్‌ఎల్) కార్యక్రమం ద్వారా విద్యార్థుల అభ్యసనను మెరుగు పరచవచ్చని సూచించారు. అంతేగాక టీఏఆర్‌ఎల్‌ను కొన్ని ప్రాంతాల్లో అమలు చేసి మంచి ఫలితాలను చూపించారు. ఈ కార్యక్రమానికి రుక్మిణి చేసిన కృషికి గుర్తింపుగా ఆమెను యిదన్ ప్రైజ్ వరించింది.
ఏఎస్‌ఈఆర్..
ఏఎస్‌ఈఆర్‌తోపాటు .. పిల్లల కోసం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో దినపత్రికల్లో ఆరి్టకల్స్ రాయడం, పిల్లలకు సులువుగా అర్థమయ్యే విధంగా కథల పుస్తకాలను బెనర్జీ రాస్తున్నారు. ఏఎస్‌ఈఆర్ నివేదిక రూపొందించే బృందాన్ని ముందుండి నడిపించారు. ఈ నివేదికను విడుదల చేసిన తరువాత బెనర్జి ప్రథమ్‌కు సీఈవో అయ్యారు. విద్యావ్యవస్థ అభివృద్ధిని గుర్తించిన బిహార్ ప్రభుత్వం 2008లో ‘మౌలానా అబుల్ కలామ్ శిక్షా పురస్కార్’తో సత్కరించింది. రాష్ట్రంలో ఈ అవార్డును అందుకున్న తొలి వ్యక్తి బెనర్జీనే. తాజాగా 2021 సంవత్సరానికి గాను విద్యాభివృద్ధికి కృషిచేస్తోన్న వారికిచ్చే ‘యిదన్’ బహుమతిని అందుకున్నారు.
స్మార్ట్ మామ్
విద్యద్వారా మెరుగైన ప్రపంచాన్ని అందించేవారిని సత్కరించేందుకు గాను 2016లో చార్లెస్ చెన్ యిదన్ ‘ద యిదన్ అవార్డు’ను ఏర్పాటు చేశారు. ఈ బహుమతి పొందిన వారికి స్వర్ణ పతకంతోపాటు, 3.9 మిలియన్ డాలర్లు( మన రూపాయల్లో దాదాపు 29 కోట్లు) దీనిలో సగం మొత్తా్తన్ని విద్యాభివృద్దికి వినియోగించాలి. ‘‘యిదన్ ప్రైజ్ విద్యాభివృద్ధికి మరింత కృషిచేసే అవకాశం కల్పించింది. గత 15 ఏళ్లుగా పిల్లల అక్షరాస్యతపై పనిచేస్తున్నాం. మొహల్లా లెర్నింగ్ క్యాంపెయిన్‌లో భాగంగా వలంటీర్లతో ‘టీచింగ్ ఎట్ ది రైట్ లెవల్’ను అందిస్తున్నాము.
‘స్మార్ట్ మామ్’ పేరిట విద్యార్థుల తల్లులకు ఎస్‌ఎమ్‌ఎస్, వాట్సాప్ మెస్సేజ్‌ల ద్వారా చిన్నపాటి యాక్టివిటీలను అప్పజెప్పి వారి ద్వారా పిల్లల అభ్యసనను మెరుగుపరుస్తున్నాం. దీనికి మంచి స్పందన లభిస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పదివేల కమ్యూనిటీల్లో 30 నుంచి 35 వేలమంది తల్లులు పాల్గొంటున్న ఈ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తాము’’ అని రుక్మిణీ బెనర్జీ వివరించారు.
చదవండి: కూచునే హక్కు మీకు ఉంది...
Comments
Please login to add a commentAdd a comment