
మాట్లాడుతున్న విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్, ఇంటర్ విద్య కమిషనర్ శేషగిరిరావు తదితరులు
ఒంగోలు మెట్రో: ఆధునిక సౌకర్యాల నడుమ పిల్లలు చదువుకోవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మనబడి నాడు–నేడు కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ అన్నారు. మనబడి నాడు–నేడు రెండో విడతకు సంబంధించిన అవగాహన సదస్సు మంగళవారం ఒంగోలులో జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధనవంతుల పిల్లలతో సమానంగా పేదల పిల్లలు కూడా ఆధునిక సౌకర్యాలు, తరగతి గదుల్లో విద్యనభ్యసించాలనే ఆశయంతో సీఎం జగన్ ఈ పథకానికి రూపకల్పన చేశారని చెప్పారు. గతంలో విద్యార్థినులు కాలకృత్యాలు తీర్చుకోవాలంటే.. సాయంత్రం ఇంటికి వెళ్లే వరకు వేచి ఉండాల్సిన దయనీయ పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు. అలాంటి కష్టాలకు ప్రభుత్వం చరమగీతం పాడిందన్నారు.
ఇంటర్ విద్య కమిషనర్ ఎంవీ శేషగిరిరావు మాట్లాడుతూ.. నిర్ణీత గడువైన ఆరు నెలల్లోగా పనులు నాణ్యంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పథకం ఆచరణ గురించి ప్రత్యేక సలహాదారు ఆకునూరి మురళి వివరించారు. సమావేశంలో కలెక్టర్ దినేష్‌కుమార్, సమగ్ర శిక్ష చీఫ్ ఇంజినీర్ కె.శ్రీనివాసరావు, నాడు నేడు నోడల్ అధికారి సుశీల, ఇంటర్ విద్య ఆర్జేడీ సుబ్బారావు, అధికారులు ఎస్‌వీ సుబ్బారావు, కె.ఆంజనేయులు, సైమన్ విక్టర్, ప్రసాదరావు, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.