ఆన్‌లైన్‌లో వినతులు సమర్పించిన 52,235 మంది ఉద్యోగులు
అత్యధికంగా పాఠశాల విద్యాశాఖ పరిధిలో 20 వేల వినతులు
పరిష్కారం కోసం 18న మంత్రివర్గ ఉపసంఘం భేటీ
ఇందుకు శాఖల వారీగా వివరాల సేకరణకు ఉపక్రమించిన జీఏడీ
నిర్ణీత ఫార్మాట్‌ను రూపొందించి శాఖలకు పంపిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం జారీ చేసిన జీవో 317కు అనుగుణంగా చేపట్టిన ఉద్యోగ కేటాయింపులపై అభ్యంతరాలు వెల్లువెత్తాయి. జీవో 317 ద్వారా నష్టపోయిన, ఇబ్బందులకు గురైన వారికి న్యాయం చేస్తామని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చాక ఆయా ఉద్యోగుల నుంచి ఆన్‌లైన్‌లో వినతులను స్వీకరించింది.
ఈ క్రమంలో 33 ప్రభుత్వ శాఖల నుంచి ప్రభుత్వానికి ఏకంగా 52,235 మంది ఉద్యోగులు వినతులు సమర్పించడం గమనార్హం. దీన్నిబట్టి రాష్ట్రంలో నూతన జోనల్ విధానంలో భాగంగా జరిపిన కేటాయింపుల్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో స్థానచలనం కలిగిన ఉద్యోగుల్లో దాదాపు 80 శాతం మంది ఉద్యోగులు నష్టపోయామని అంటున్నారు.
వీరికి న్యాయం చేస్తామన్న హామీ మేరకు ప్రభుత్వం.. ముగ్గురు మంత్రులతో కూడిన కేబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేసింది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో సభ్యులుగా ఐటీ మంత్రి డి.శ్రీధర్‌బాబు, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. ఈ కమిటీ ఇప్పటికే పలుమార్లు భేటీ అయ్యి క్షేత్రస్థాయి నుంచి వినతులు స్వీకరించింది. ఈ కమిటీ ఈ నెల 18న మరోమారు సమావేశం కానుంది. అనంతరం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.
విద్యాశాఖ నుంచి అత్యధిక వినతులు
జీఓ 317 కేటాయింపులతో అన్యాయం జరిగిందంటూ వచ్చిన వినతుల్లో అత్యధికులు విద్యాశాఖ నుంచే ఉన్నారు. పాఠశాల విద్యాశాఖ నుంచి 20,209 దరఖాస్తులు రాగా.. 11,417 దరఖాస్తులతో హోంశాఖ ఆ తర్వాతి స్థానంలో ఉంది. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నుంచి 4,833 దరఖాస్తులు, రెవెన్యూ శాఖ నుంచి 2,676 దరఖాస్తులు, పంచాయతీరాజ్ నుంచి 2,390 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. సాంఘిక సంక్షేమ శాఖ నుంచి 1,797, అటవీ, పర్యావరణ శాఖ నుంచి 1,235, గిరిజన సంక్షేమ శాఖ నుంచి 1,140 వినతులు వచ్చాయి.
పది శాఖల నుంచి వందలోపు, మిగతా శాఖల నుంచి వచ్చిన దరఖాస్తులన్నీ వెయ్యిలోపు ఉన్నాయి. మొత్తం వినతుల్లో జిల్లా స్థాయి కేడర్‌లో 36,982 మంది ఉద్యోగులు ఉండగా, జోనల్ స్థాయిలో 12 వేల మంది ఉద్యోగులు, మల్టీ జోనల్ స్థాయిలో 3,253 మంది ఉన్నారు. ఈ దరఖాస్తులను శాఖల వారీగా పరిశీలించిన అధికారులు సాధ్యాసాధ్యాలపై ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం.
18న కేబినెట్ సబ్ కమిటీ ముందుకు...
శాఖల వారీగా జీఓ 317 వినతుల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉప సంఘం ఈనెల 18న సచివాలయంలోని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి చాంబర్‌లో భేటీ కానుంది. ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు పాల్గొనాలని ప్రభుత్వ సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) ఆదేశించింది.
ఈనెల 16 నాటికి శాఖల వారీగా వచ్చిన వినతుల సంఖ్య, ఇందులో పరిష్కరించినవి, పరిష్కరించనివి, తిరిస్కరించినవి, కోర్టు పరిధిలో పెండింగ్‌లో ఉన్నవి, శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నవి, కోర్టు తీర్పు వెలువడినవి, శాఖలో కేడర్ స్ట్రెంగ్త్, కేటగిరీ వారీగా కేడర్ తదితర పూర్తిస్థాయి సమాచారాన్ని నిర్ణీత ఫార్మాట్‌లో సమర్పించాలని జీఏడీ ఆదేశించింది. ఈమేరకు జీఏడీ రూపొందించిన ఫార్మాట్‌తో కూడిన నోట్‌ను సాధారణ పరిపాల విభాగం కార్యదర్శి ఎం.రఘునందన్‌రావు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment