జిల్లాలు మార్చి సెంటర్ల కేటాయింపు
పేపర్–1ఏ, 1బీకి రెండు జిల్లాల్లో సెంటర్లు
దరఖాస్తులో సెంటర్ ‘ఎడిట్’ చేసినా మారని వైనం
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం టెట్ అభ్యర్థుల వడపోతకు దిగింది. టెట్ పరీక్షలు రాయకుండా ఆది నుంచే వడపోత చేపట్టింది. అందుకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ టెట్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సెంటర్లను మార్చేసింది. బీఈడీ, డీఈడీల అర్హతలు ఉన్నవారికి, డీఈడీ, స్పెషల్ ఎడ్యుకేషన్ అర్హతలు గల అభ్యర్థులు ఒకే రోజు పరీక్ష రాయాల్సి ఉన్నా.. రెండు పేపర్లకు వేర్వేరు జిల్లాల్లో సెంటర్లు ఇచ్చి ఒక పేపర్ రాసే అవకాశాన్ని లేకుండా చేసి వారికి అగ్ని పరీక్ష పెట్టింది.
ఫిబ్రవరిలో గత ప్రభుత్వం టెట్ పరీక్ష పూర్తి చేయగా.. కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులకు కూడా అవకాశం కల్పించాలని చెప్పి కూటమి ప్రభుత్వం టెట్–2024 (జూలై) పేరుతో మరోసారి నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి రాష్ట్రవ్యాప్తంగా 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) విభాగంలో పేపర్–1(ఏ)కి 1,82,609 మంది, ఎస్‌జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ పేపర్–1(బీ)కి 2,662 మంది, స్కూల్ అసిస్టెంట్ పేపర్–2(ఏ) లాంగ్వేజెస్‌కు 64,036 మంది, మ్యాథ్స్ అండ్ సైన్స్ విభాగంలో 1,04,788 మంది దరఖాస్తు చేసుకోగా, సోషల్ స్టడీస్‌లో 70,767 మంది దరఖాస్తు చేసుకున్నారు.
స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పేపర్–2(బి)కి 2438 దరఖాస్తులు అందాయి. వీరిలో చాలా మంది రెండు పేపర్లకు అర్హత గలవారు ఉన్నారు. అయితే, పాఠశాల విద్యాశాఖ ఈ నెల 21 నుంచి జారీ చేసిన హాల్ టికెట్లు చూసి అభ్యర్థులు కంగుతిన్నారు. రెండు పేపర్లకు ఒకే జిల్లా, ఒకే సెంటర్‌ను ఆప్షన్‌గా ఇస్తే ఒక్కో పేపర్‌కు సెంటర్‌తో పాటు జిల్లాలను కూడా మార్చేశారు. మరికొందరికి రాష్ట్రాన్నే మార్చేసి బెంగళూరులో సెంటర్ కేటాయించడం విద్యాశాఖ మాయాజాలానికి నిదర్శనం.
జిల్లాలు దాటి సెంటర్ల కేటాయింపు
ఏపీ టెట్ పరీక్షలు అక్టోబర్ 3 నుంచి 21వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఎంపిక చేసిన ఇంజినీరింగ్ కాలేజీలు, ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఉన్న సెంటర్లలోనే ఈ పరీక్షలు నిర్వహిస్తారు. టెట్ హాల్‌టికెట్లను పాఠశాల విద్యాశాఖ ఈ నెల 21న సాయంత్రం నుంచి ఆన్‌లైన్‌లో ఉంచింది.
అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న రెండు పరీక్షల హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకుని చూస్తే రెండు పరీక్షలకు వేర్వేరు సెంటర్లు ఉండడం చూసి హతాశులయ్యారు. ఏలూరు జిల్లాకు చెందిన ముగ్గురు అభ్యర్థులు పేపర్–1, పేపర్–1బీ జిల్లా కేంద్రాంలోనే రాయాల్సి ఉన్నా.. ఇద్దరికి ఉదయం ఏలూరులోను మధ్యాహ్నం పేపర్–1బి కాకినాడలోను సెంటర్ ఇచ్చారు.
మరొకరికి రెండో పేపర్‌ను విజయవాడలో సెంటర్ ఇచ్చారు. గత నెలలో విద్యాశాఖ ‘దరఖాస్తు ఎడిట్’ అవకాశం ఇవ్వడంతో మీడియం ‘తెలుగు’ అని మార్చినా హాల్‌టికెట్‌లో మాత్రం ‘ఇంగ్లిష్’ అనే ఇచ్చారు. తెలుగు మీడియంలో చదువుకున్న వారు ఇప్పుడు ఇంగ్లిష్‌లో పేపర్ ఎలా రాయగలమని ఆందోళన చెందుతున్నారు.
నిరుద్యోగుల పట్ల ఇంత నిర్లక్ష్యమా
ఏపీ టెట్ నిర్వహణలో నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. పరీక్ష సెంటర్లు ప్రతి జిల్లాలో అందుబాటులో ఉన్నా వందల కిలోమీటర్ల దూరంలోని మరో జిల్లాలో కేటాయించారు. అలాగే పేపర్–1ఏ ఒక జిల్లాలోను, పేపర్–1బీ మరో జిల్లాలో సెంటర్లు కేటాయించడంలో అంతర్యం ఏమిటి.
ప్రభుత్వం తక్షణమే స్పందించి ఏ జిల్లా అభ్యర్థులకు ఆ జిల్లాలోనే సెంటర్లు ఇచ్చేలా మార్పులు చేయాలి. తెలుగు మీడియం అభ్యర్థులకు ఇంగ్లిష్ మీడియం అని హాల్ టికెట్‌లో ఇవ్వడంతో అనేకమంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అలాంటి వారికి మరోసారి ‘ఎడిట్’ అవకాశం కల్పించి న్యాయం చేయాలి.
– ఎ.రామచంద్ర, ఏపీ నిరుద్యోగ ఐక్య సమితి
– ప్రకాశం జిల్లాకు చెందిన పెద్దిశెట్టి వెంకట మహేష్‌బాబు ఎస్‌జీటీకి పేపర్–1ఏ రాయాల్సి ఉంది. ఈ అభ్యర్థికి కేంద్రం ఒంగోలులో కాకుండా 110 కి.మీ. దూరంలోని గుంటూరు జిల్లాలో సెంటర్ ఇచ్చారు.
– తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సీహెచ్.దినేష్ అనే అభ్యర్థికి విజయవాడలో సెంటర్ కేటాయించారు.
– అనంతపురం జిల్లాకు చెందిన దాసప్పగారి సింధూజ స్కూల్ అసిస్టెంట్ పేపర్–2ఏ (మ్యాథమెటిక్స్, సైన్స్) పేపర్ రాసేందుకు తెలుగు మీడియం ఆప్సన్ ఇచ్చారు. కానీ.. హాల్ టికెట్‌లో మాత్రం ఇంగ్లిష్ మీడియం అని ఇచ్చారు.
– ఏలూరు జిల్లాకు చెందిన కె.భువనేశ్వరి ఎస్‌జీటీ, స్పెషల్ ఎడ్యుకేషన్ రెండింటికీ దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబర్ 6న రెండు పేపర్లు రాయాలి. రెండు పరీక్షలకు ఏలూరు సెంటర్ ఇస్తే.. ఉదయం జరిగే పరీక్ష ఏలూరులోను, మధ్యాహ్నం పరీక్ష ఏలూరుకు సుమారు 155 కి.మీ. దూరంలోని కాకినాడలోను సెంటర్ కేటాయించారు. ఇదే జిల్లాకు చెందిన పి.జయలక్ష్మికి కూడా ఏలూరు, కాకినాడ సెంటర్లను ఒకేరోజు రెండు పరీక్షలకు కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment