సాక్షి అమరావతి : రైతుకూలి బిడ్డ అమ్మాజాన్, లారీ డ్రైవర్ కుమార్తె రాజేశ్వరి, సెక్యూరిటీ గార్డు కూతురు జ్యోత్స్న, కౌలురైతు కొడుకు అంజన సాయి, రోజుకూలీ బిడ్డ గాయత్రి, ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ కుమార్తె శివలింగమ్మ, టీచర్ కూతురు మనశ్విని, రైతుబిడ్డ యోగీశ్వర్, మెకానిక్ కూతురు రిషితారెడ్డి, ఆటోడ్రైవర్ కుమార్తె చంద్రలేఖ.. వీరి కుటుంబాలకు పని ఉంటేనే రోజు గడిచేది.. లేకపోతే పస్తులే. ఇలాంటి వారి గురించి చెప్పుకోవడానికి ఏముంటుంది? అని అనిపించడం సహజం.
పైగా.. ఈ కోవకు చెందినవారు రాష్ట్రంలో లక్షల్లో ఉంటారు.. పత్రికలో రాసేటంతగా విషయం ఏముంటుంది అని కూడా అనుకోవచ్చు.. కానీ, చదువులో రాణించి ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకోవడమే వీరు సాధించిన గొప్ప విజయం.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని ఉత్తమ మార్కులు సాధించిన 150 మందిని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. వారికి ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, మారిన బడుల తీరుపై పరీక్ష నిర్వహించగా మొత్తం 30 మంది ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. వీరికి కేజీబీవీ (కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ) కార్యదర్శి మధుసూదనరావు, యూఎన్‌ఓ స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్‌కుమార్ నేతృత్వంలో నలుగురు సభ్యుల బృందం మౌఖిక పరీక్షలు నిర్వహించి పై 10 మందిని విజేతలుగా ఎంపిక చేసింది.
ఇప్పుడు వీరంతా సెప్టెంబర్ 15 నుంచి 27 వరకు ప్రభుత్వ ఖర్చుతో ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించడంతో పాటు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో మాట్లాడతారు. రాష్ట్రంలో ప్రభుత్వం అమలుచేస్తున్న విద్యా సంస్కరణలపైన, పాఠశాలల అభివృద్ధిపైన మాట్లాడేందుకు సరైన ప్రతినిధులు విద్యార్థులేనని.. ఎంపికైన వారంతా పేద కుటుంబాల పిల్లలేనని పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, కమిషనర్ సురేష్‌కుమార్ తెలిపారు.
ఈ పర్యటనలో వీరు అమెరికా అధ్యక్ష భవనాన్ని సైతం సందర్శిస్తారన్నారు. విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వమే ఐక్యరాజ్య సమితికి పంపిస్తోందని, వీరికి అవసరమైన పాస్‌పోర్టు, వీసా వంటి అన్ని ఏర్పాట్లుచేసినట్లు వారు వివరించారు. ఇక ఈ విద్యార్థుల విజయగాథ ఏమిటంటే..
గిరిజన బాలికకు అద్భుత అవకాశం..
కురుపాం మండలం కొండబారిడి గిరిజన గ్రామానికి చెందిన సామల మనశ్విని తల్లి కృష్ణవేణి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. మనశ్విని ప్రస్తుతం గుమ్మలక్ష్మీపురం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతోంది. గిరిజన కుగ్రామంలో పుట్టి పెరిగిన మనశ్విని అమెరికా వెళ్లనున్న పది మంది విద్యార్థుల్లో ఒక్కరిగా నిలిచింది. ఇటీవల జరిగిన ముఖ్యమంత్రి సభలో తన ప్రసంగం ద్వారా ఆకట్టుకుంది.
రైతు బిడ్డకు గొప్ప వరం
కర్నూలు జిల్లా కౌతాళం మండలం పొదలకుంట గ్రామానికి చెందిన మించాలవారి సోమనాథ్, గంగమ్మ ల నాలుగో సంతానం శివలింగమ్మ ఆదోని కేజీబీవీలో పదో తరగతి 541 మార్కులతో పాసైంది. బాలిక తండ్రి సోమనాథ్ కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేయడంతో పాటు ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. శివలింగమ్మ అమెరికా వరకు వెళ్లే అవకాశం రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు సోమనాథ్ ఎక్కడలేని ఆనందం వ్యక్తంచేశారు.
ఐరాస సదస్సుకు రైతుబిడ్డ..
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురం గ్రామానికి చెందిన వంజవాకం నాగరాజు, విజయ దంపతుల రెండో కుమారుడు యోగీశ్వర్. తండ్రి ఉన్న ఎకరం పొలంలో వ్యవసాయం చేసుకునే రైతు. ఇద్దరి సంతానంలో పాప విద్యశ్రీ ఇంటర్ చదువుతుండగా, కుమారుడు యోగీశ్వర్ 10వ తరగతిలో 586 మార్కులు సాధించి జిల్లాలో రెండోస్థానం సాధించాడు. అమ్మఒడి, జగనన్న గోరుముద్ద తమబిడ్డల చదువుకు ఎంతో సహకరించాయని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
కేక.. చంద్ర లేఖ..
అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం ఎటపాక గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన మోతుకూరి రామారావు, మణి దంపతుల రెండో కుమార్తె చంద్రలేఖ. రాష్ట్ర విభజనతో కుటంబంతో భద్రాచలం నుంచి ఎటపాకకు వచ్చిన రామారావు చంద్రలేఖను స్థానిక కేజీబీవీలో చదివించారు. ఇటీవల పదో తరగతిలో 523 మార్కులు సాధించి కేజీబీవీ జిల్లా టాపర్‌గా నిలిచి ప్రభుత్వం అందించిన జగనన్న ఆణిముత్యాలు సత్కారం కింద రూ.50 వేల నగదు బహుమతి అందుకుంది. ఈ విజయమే ఆమెను ఐక్యరాజ్య సమితికి వెళ్లేలా బాటవేసింది.
తల్లి కష్టంతో తల్లడిల్లి..
పూట గడవడం కూడా కష్టమైన ఇంట్లో పుట్టిన షేక్ అమ్మాజాన్ ఏడేళ్ల క్రితం తండ్రిని కోల్పోయింది. రైతుకూలీ అయిన తల్లి కష్టంచూసి చదువుల్లో రాణించాలనుకుంది. ఐదో తరగతిలోనే వైఎస్సా ర్‌జిల్లా వేంపల్లిలోని ఏపీ రెసిడెన్షియల్ స్కూల్‌లో సీటు తెచ్చుకుంది. ఇటీవల టెన్త్‌లో 581 మార్కు లు సాధించి రాష్ట్రస్థాయిలో జగనన్న ఆణిముత్యా లు సత్కారం కింద రూ.లక్ష నగదు బహుమతి అందుకుంది. ఇప్పుడు ఐరాస గడప తొక్కుతోంది. ప్రస్తుతం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో చేరింది.
ప్రతిభ చాటిన సెక్యూరిటీ గార్డు బిడ్డ
కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం రమణక్కపేటకు చెందిన దడాల సింహాచలం ప్రైవేటు సెక్యూరిటీ గార్డు. ఈయన భార్య గృహిణి. వీరి రెండో కుమార్తె జ్యోత్స్న టెన్త్‌లో 589 మార్కులు సాధించింది. దీంతో పాటు జగనన్న ఆణిముత్యాలు రాష్ట్రస్థాయి ప్రతిభా పురస్కారాన్ని సైతం అందుకుంది. ఇప్పుడు కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయం ఐఐటీ అకాడమీలో ఇంటర్ చదువుతూ అమెరికా అవకాశాన్ని అందిపుచ్చుకుంది.
కౌలురైతు కొడుకు ఘనత..
పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం వల్లూరుపల్లికి చెందిన జి.గణేష్ అంజనసాయి ఏలూరు జిల్లా అప్పలరాజుగూడెం గురుకుల పాఠ శాలలో చదువుకున్నాడు. టెన్త్‌లో 581 మార్కులు సాధించి నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీటు సాధించాడు. తండ్రి గోపి కౌలురైతు కాగా, తల్లి లక్ష్మి గృహిణి. కుటుంబానికి చదువు భారం కాకూడదని గురుకుల పాఠశాలలో సీటు తెచ్చుకున్నాడు.
590 మార్కులతో అదరహో..
తండ్రి కూలీ, తల్లి గృహిణి. తండ్రికి పని దొరికితేనే పూటగడిచే పరిస్థితి. తన భవిష్యత్‌ను చదువుల ద్వారా తీర్చిదిద్దుకుని, కుటుంబాన్ని బాగా చూసుకోవాలని బలంగా అనుకుంది పసుపులేటి గాయత్రి. ఏలూరు జిల్లా పెదపాడు మండలంలోని వట్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టెన్త్ చదివి ఏకంగా 590 మార్కులు సాధించి జిల్లాలోనే టాపర్‌గా నిలిచింది. అమెరికా బృందానికి ఎంపికైంది.
మెరిసిన మెకానిక్ కుమార్తె..
విజయనగరం శివారు జమ్మునారాయణపురంలో నివాసముండే అల్లం రామకృష్ణారెడ్డి, ఉదయలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ప్రైవేటు సంస్థలో మెకానిక్‌గా పనిచేసే రామకృష్ణారెడ్డి రెండో కుమార్తె రిషితారెడ్డి స్థానిక మున్సిపల్ హైస్కూల్లో టెన్త్ చదివి 587 మార్కులు సాధించి, నూజివీడు ట్రిపుల్ ఐటీలో చేరింది. ఇప్పుడు అమెరికా వెళ్లే అరుదైన అవకాశం దక్కించుకుంది.
నంద్యాల నుంచి అమెరికాకు..
నంద్యాల పట్టణం బొమ్మలసత్రం ప్రాంతానికి చెందిన విద్యార్థిని సి.రాజేశ్వరి తండ్రి దస్తగిరి లారీడ్రైవర్, భార్య రామలక్ష్మమ్మ ఇంటివద్ద బట్టలు ఇస్త్రీ చేస్తుంటారు. వీరి పెద్ద కుమార్తె రాజేశ్వరి నంద్యాలలోని ఏపీ మోడల్ స్కూల్‌లో టెన్త్ చదివి 583 మార్కులు సాధించి నియోజకవర్గంలో టాపర్‌గా నిలిచింది. పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించడంతో ఐరాసకు వెళ్లే అరుదైన అవకాశం కైవసం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment