
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ (సాల్ట్) ప్రాజెక్టు అమలు పురోగతి సంతృప్తికరంగా సాగుతోందని ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చక్కగా అమలు చేస్తోందని కితాబిచ్చింది. పాఠశాల విద్యలో ఏపీ సర్కార్ చేపట్టిన సంస్కరణల నేపథ్యంలో మరింత మెరుగైన ఫలితాలను సాధించడానికి ప్రపంచ బ్యాంకు 250 మిలియన్ డాలర్లు ఆర్థికసాయం అందిస్తున్న విషయం తెలి సిందే. ఈ నేపథ్యంలో.. ప్రాజెక్టు అమలు ఫలితాల పై ఆ బ్యాంకు అధ్యయనం చేసి నివేదికను వెల్లడించింది.
ముఖ్యంగా రాష్ట్రంలో 15 వేలకు పైగా పాఠశాలల్లో అభ్యాస వాతావరణాన్ని మెరుగుపరిచిందని, తద్వారా కీలకమైన ముందస్తు ఫలితాన్ని రాష్ట్రం సాధించిందని.. ఏపీ సర్కార్ ఈ ప్రాజెక్టును ప్రశంసనీయ స్థాయిలో అమలుచేస్తోందని ఆ నివేదిక పేర్కొంది. ఇక కరోనా కారణంగా రాష్ట్రంతో పాటు జాతీయంగా కూడా స్థూల ఆర్థికంపై ప్రతి కూల ప్రభావం కొనసాగుతోందని, అయితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని ప్రపంచ బ్యాంకు నివేదికలో స్పష్టం చేసింది. అలాగే, ట్రెజరీ ద్వారా సకాలంలో నిధులు విడుదలవుతున్నాయని.. అమలుచేసే నోడల్ ఏజెన్సీలకు రాష్ట్ర ఖజానా నుంచి నిధులు అందుతున్నాయని పేర్కొంది.
ప్రాజెక్టు అమలులో ఊహించిన కీలక ఆవిష్కరణలు, కార్యకలాపాలను క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయని, సాంకేతిక సహాయ ఏజెన్సీల ఏర్పాటులో ప్రభుత్వం నిమగ్నమైందని వివరించింది. కార్యకలాపాల ప్రణాళిక, డెలివరీలో నోడల్ విద్యా సంస్థలకు మద్దతివ్వడానికి అవసరమైన చర్యలు, పనులను నిశితంగా పర్యవేక్షించేం దుకు సాంకేతిక మద్దతును అందించడానికి టాస్క్ టీమ్‌నూ ఏర్పాటు చేసిందని ఆ నివేదిక పేర్కొంది.
కరోనాలోనూ పటిష్టంగా ఏర్పాట్లు
గత రెండేళ్లుగా కోవిడ్ మహమ్మారి కారణంగా ఏపీ సహా దేశవ్యాప్తంగా దాదాపు ఏడాదిపాటు విద్యా సంస్థలు మూతపడినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం మాత్రం పటిష్టంగా ఏర్పాట్లుచేసిందని బ్యాంకు పేర్కొంది. పాఠశాలల మూసివేత, పునఃప్రారంభ నిర్వహణకు సంబంధించిన ప్రక్రియల్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వ్యాప్తిచెందకుండా మార్గదర్శకాలు రూపొందించి అమలుచేసినట్లు ప్రపంచ బ్యాంకు ఏపీ సర్కార్‌ను ప్రశంసించింది.
కోవిడ్ సమయంలో ఆన్‌లైన్, టెలివిజన్, రేడియో, సోషల్ మీడియాను బలోపేతం చేశారని. తక్కువ ఆదాయ కుటుంబాల విద్యార్థులకు రిమోట్ లెర్నింగ్‌ను బలోపేతం చేసి అందుబాటులోకి తెచ్చిందని బ్యాంకు కొనియాడింది.
ప్రపంచ బ్యాంకు ప్రస్తావించిన ప్రధానాంశాలివే..
► విద్యా సంస్థల నిర్వహణ, సామర్థ్యాన్ని పెంచి తద్వారా ఆశించిన ఫలితాలను సాధించడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక మద్దతు ఏజెన్సీలను ఏర్పాటు చేసింది.
► స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్‌ఈఆర్‌టీ) మద్దతుతో వృత్తిపరంగా టీచర్ల అభివృద్ధి, అభ్యాస కార్యకలాపాలను అంచనా వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విభాగాన్నీ ఏర్పాటు చేసింది.
► ప్రాజెక్టు ఫలితాల సాధనకు థర్డ్‌పార్టీ ఏజెన్సీని, ప్రాజెక్టు నిర్వహణ, పర్యవేక్షణకు ప్రోగ్రామ్ కన్సల్టెన్సీ ఏజెన్సీని కూడా ఏర్పాటు చేసింది.
► అలాగే, ప్రోగ్రాం డెవలప్‌మెంట్ ఆబ్జెక్టివ్ (పీడీఓ) సాధన దిశగా మొత్తం ప్రాజెక్టు పురోగతి సంతృప్తికరంగా కొనసాగుతోంది.
► ప్రాథమిక విద్యలో అభ్యాస ఫలితాలతో పాటు బోధనా విధానాల్లో నాణ్యత పెంచడం, పాఠశాలల నిర్వహణను మరింత మెరుగుపరచడమే ప్రాజెక్టు ప్రధానాశయం, లక్ష్యం. ఇందులో భాగంగా.. ప్రాథమిక దశలోనే ప్రాజెక్టు అమలు సంతృప్తికరంగా సాగుతోంది.
► పాఠశాలల నిర్వహణ, పనితీరుపై నిరంతరం సమాచారం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తల్లిదండ్రుల కమిటీలను మరింత పటిష్టం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment