
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీటెట్)–2024 నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం టెట్ హాల్‌టికెట్లను https://aptet.apchss.in వెబ్సైట్లో ఉంచింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షకు 2,67,559 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారందరికీ పరీక్ష సెంటర్లను సైతం కేటాయించి, ఆయా వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచింది.
కాగా బీఈడీ చేసిన అభ్యర్థులు ఎస్‌జీటీ పోస్టులకు అనర్హులని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ తీర్పు నేపథ్యంలో ఎస్‌జీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న బీఈడీ అభ్యర్థుల ఫీజును తిరిగి చెల్లించేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంది. ఆయా అభ్యర్థుల ఆధార్ కార్డుతో అనుసంధానమై ఉన్న బ్యాంకు అకౌంట్‌కు ఫీజులు మొత్తాన్ని తిరిగి జమ చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ ప్రకటించింది.
నిర్వహణ ఇలా..
పేపర్ 1ఏ : ఈనెల 27 నుంచి మార్చి 1 వరకు
పేపర్ 2ఏ : మార్చి 2, 3, 4, 6 తేదీలు
పేపర్ 1బి : మార్చి 5 (ఉదయం)
పేపర్ 2బి : మార్చి 5 (మధ్యాహ్నం)
120 కేంద్రాల్లో ఏపీటెట్
ఈనెల 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 120 కేంద్రాల్లో ఏపీ టెట్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న పరీక్షా కేంద్రాన్ని మాత్రమే కేటాయించినట్టు కమిషనరేట్ తెలిపింది. సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థుల్లో 76.5 శాతం మందికి వారు ఎంపిక చేసుకున్న మొదటి ప్రాధాన్యత కేంద్రాన్నే కేటాయించారు.
పరీక్ష కేంద్రాలపై అభ్యర్థులకు సందేహాలుంటే ఆయా జిల్లా విద్యాశాఖాధికారులను సంప్రదించాలని కమిషనర్ సూచించారు. దీంతోపాటు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉండేలా కమిషనరేట్‌లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్లు 95056 19127, 97056 55349, 81219 47387, 81250 46997లో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment