మే 20 నుంచి టెట్‌ | Statewide Teacher Eligibility Test On May 20th | Sakshi
Sakshi News home page

మే 20 నుంచి టెట్‌

Published Fri, Mar 15 2024 5:48 AM | Last Updated on Fri, Mar 15 2024 5:27 PM

Statewide Teacher Eligibility Test On May 20th - Sakshi

డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ గడువు పెంపు

జూలై 17 నుంచి 31 వరకూ డీఎస్సీ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)ను మే 20 నుంచి జూన్‌ 3 వరకూ నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్య కమిషనర్‌ దేవసేన గురువారం ప్రకటించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్, సమాచార బులెటిన్‌ను ఈ నెల 20న స్కూల్‌ ఎడ్యుకేషన్‌ వెబ్‌సైట్‌లో వెల్లడిస్తామని తెలిపారు. కంప్యూటర్‌ బేస్డ్‌గా జరిగే ఈ పరీక్షకు ఈ నెల 27 నుంచి ఏప్రిల్‌ 10 వరకు దరఖాస్తులు పంపుకోవచ్చని తెలిపారు.

రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ను గత నెల 29న విడుదల చేసిన సంగతి తెలిసిందే. డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే మొదలు కాగా, ఈ గడువు ఏప్రిల్‌ 3తో ముగుస్తుంది. టెట్‌లో అర్హత సాధిస్తే తప్ప డీఎస్సీ రాసేందుకు అర్హత ఉండదు. దీనివల్ల టెట్‌ అర్హత లేని బీఈడీ, డీఎడ్‌ అభ్యర్థులు డీఎస్సీ రాసే వీలు ఉండదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని టెట్‌ను డీఎస్సీకి ముందే నిర్వహించాలని, ఇందులో అర్హత సాధించిన వారికి డీఎస్సీ రాసేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో డీఎస్సీ దరఖాస్తు తేదీలను కూడా పొడిగించారు. జూన్‌ 6 వరకూ డీఎస్సీ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు దేవసేన తెలిపారు. డీఎస్సీ పరీక్షను ఆన్‌లైన్‌ మోడ్‌లో జూలై 17 నుంచి 31 వరకు నిర్వహిస్తు న్నట్టు కమిషనరేట్‌ పేర్కొంది. ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలో పని చేస్తున్న ఉపాధ్యాయులకూ ఇదే టెట్‌లో పాల్గొనేందుకు చాన్స్‌ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలు వెల్లడవ్వాల్సి ఉంది. టీచర్ల పదోన్నతులకు టెట్‌ తప్పనిసరి చేయడంతో 80 వేల మంది ఉపాధ్యాయులు టెట్‌ రాయాల్సి ఉంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement