2017లో దాఖలైన పిల్‌లో విచారణ ముగించిన హైకోర్టు ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సర్టిఫికెట్లు, పాఠశాలలో చేరే ముందు సమర్పించే దరఖాస్తులో కుల, మత రహిత కాలమ్ ఉండాల్సిందేనని సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది. కులం, మతం వద్దనే హక్కు ప్రజలకు ఉందని అభిప్రాయపడింది. కుల, మత విభాగాలను దరఖాస్తులో నింపనంత మాత్రాన అవి తిరస్కరణకు గురికావని పాఠశాల విద్యాశాఖ సమర్పించిన కౌంటర్ అఫిడవిట్‌ను పరిశీలనలోకి తీసుకుంటున్నామని స్పష్టం చేసింది. 2010, 2021లోనూ రిట్ పిటిషన్లు దాఖలు చేసి కోర్టును ఆశ్రయించిన పిటిషనర్లు ఇప్పటికే ఉపశమన ఆదేశాలు పొందారని పేర్కొంది.
బాధిత వ్యక్తులు అవసరమైతే తదుపరి నష్టపరిహారాన్ని కోరే హక్కు కలిగి ఉంటారని వ్యాఖ్యానించింది. పాఠశాల విద్యాశాఖ స్పష్టమైన వైఖరితో తదుపరి చర్యలు అనవసరమని పేర్కొంటూ పిల్‌లో విచారణ ముగిస్తున్నామని చెప్పింది. జనన ధ్రువపత్రం నుంచి మరణ ధ్రువపత్రం వరకు అన్నింటిలో ‘కులం, మతం లేదు’ అనే స్టేటస్ కోరుకునే వారిని గుర్తించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం నుంచి స్పందన లేదంటూ డీవీ రామకృష్ణారావు, ఎస్ క్లారెన్స్ కృపాళిని తదితరులు 2017లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఇలాంటి పిటిషన్లు గతంలో దాఖలయ్యాయని, కులం, మతాన్ని పేర్కొనడం, వదులుకోవడంపై స్వేచ్ఛ ఉందని పాఠశాల విద్య డైరెక్టర్ అండ్ కమిషనర్ తరఫున దాఖలు చేసిన కౌంటర్‌లో పేర్కొన్నారని చెప్పింది. మతం, కులం వివరాలు పేర్కొననంత మాత్రాన పిల్లలకు పాఠశాలల్లో ప్రవేశం నిరాకరించబడదని స్పష్టం చేసింది. దీంతో విచారణ ముగిస్తున్నట్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment