మోగనున్న బడిగంట.. నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం | Schools Will Resume From Today After Summer Holidays In 2024, More Details Inside | Sakshi
Sakshi News home page

AP Schools ReOpen: మోగనున్న బడిగంట.. నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం

Published Thu, Jun 13 2024 5:42 AM | Last Updated on Thu, Jun 13 2024 9:33 AM

Schools will resume from today

నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం

రాష్ట్రంలో మొత్తం 62 వేలకుపైగా పాఠశాలలు   

45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న ప్రవేశాలు

ఈ నెల 20 తర్వాతే పుస్తకాలు, స్టూడెంట్‌ కిట్ల పంపిణీ!  

వారంలో విద్యా కేలండర్‌పై స్పష్టత

సాక్షి, అమరావతి: వేసవి సెలవుల అనంతరం రాష్ట్రం­లోని పాఠశాలలు గురువారం తెరుచుకోనున్నాయి. దీంతో 2024–25 విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. రాష్ట్రంలో మొత్తం 62,023 పాఠశాలలు ఉండగా.. వీటిలో ప్రభుత్వ యాజమా­న్యంలో 44,954 పాఠశాలలు, ప్రైవేటు యాజమాన్యంలో 15,784, ఎయిడెడ్‌లో మరో 1,225 పాఠశాలలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదీనంలో మరో 60 పాఠశాలలు ఉన్నాయి. 

కేంద్ర పాఠశాలలు మినహా మిగిలినవి నేడు (గురువారం) ప్రారంభమవుతాయి. ఇక కేంద్రీయ విద్యాలయాలు ఈ నెల 21న, నవోదయ విద్యాలయాలు 30న ప్రారంభం కానున్నాయి. వాస్తవానికి బుధవారమే బడులు తెరుచుకోవాల్సి ఉండగా.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో పాఠశాలల పునఃప్రారంభం షెడ్యూల్‌ను అధికారులు గురువారానికి మార్చారు. బడులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 

టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పీఎం–పోషణ్‌ గోరుముద్ద (మధ్యాహ్న భోజనం)ను సైతం అదే రోజు విద్యార్థులకు అందించాలన్నారు. ప్రస్తుతానికి గతేడాది వరకు అనుసరించిన విధానంలోనే విద్యా­ర్థుల­కు భోజనం అందించనున్నారు. కొత్త విద్యా­శాఖ మంత్రి బాధ్యతలు తీసుకున్నాక తదుపరి చర్య­లు చేపట్టాలని అధికారులు యోచిస్తున్నారు. కాగా, ఇప్పటికే ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలు పూర్తవగా, ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్నాయి.

20 తర్వాతే విద్యార్థులకు పుస్తకాలు, కిట్లు 
రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు గత విద్యా సంవత్సరం వరకు పాఠ్యపుస్తకా­లు, నోటు పుస్తకాలతో పాటు విద్యా కానుక కిట్లను పాఠశా­ల తెరిచిన మొదటిరోజే అందజేశారు. ప్రతి విద్యార్థికి ఉచితంగా ద్విభాషా పాఠ్య పుస్తకాలు (ఇంగ్లిష్ –తెలుగు) నోట్‌ బుక్స్, వర్క్‌ బుక్స్, కుట్టు కూలితో 3 జతల యూనిఫామ్‌ క్లాత్, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతో పాటు ఆరో తరగతి విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లిష్–తెలుగు డిక్షనరీ, ఒకటో తరగతి పిల్లలకు పిక్టోరియల్‌ డిక్షనరీతో కూడిన కిట్‌ను ఇచ్చేవారు. 

2024–­25 విద్యా సంవత్సరానికి కూడా 36 లక్షల మంది విద్యార్థులకు గతేడాది మాదిరిగానే రూ.1,042.53 కోట్ల ఖర్చుతో స్టూడెంట్‌ కిట్లను అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే, సరఫరాదార్ల నుంచి పూర్తిస్థాయిలో వస్తు­వులు స్టాక్‌ పాయింట్లకు చేరలేదు. దీంతో వీటిని ఈనెల 20 తర్వాతే విద్యార్థులకు అందించే అవకాశం ఉంది. కాగా, ఏటా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు నూతన విద్యా సంవత్సరం కేలండర్‌ను పాఠశాల విద్యా­శాఖ ప్రకటించేది. 

అయితే, ఈసారి 1,000 ప్రభుత్వ సీబీఎస్‌ఈ స్కూళ్లు కూడా ఉండడంతో ఈ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా సీబీఎస్‌ఈ అధికారులతో కలిసి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ) అధికారులు నూతన కేలండర్‌ను రూపొందిస్తున్నారు. దీంతో మరో వారం రోజుల్లో విద్యా కేలండర్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement