సాక్షి, అమరావతి: విద్యార్థుల్లో ప్రతిభను పోత్సహించేందుకు ఎడ్యుకేషనల్ ఎపిఫనీ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న ‘ఈఈఎంటీ–2024’ (ఎడ్యుకేషనల్ ఎపిఫనీ మెరిట్ టెస్ట్) పరీక్ష తోడ్పడుతుందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. విజయవాడలోని సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో ఈఈఎంటీ షెడ్యూల్‌ను మంగళవారం ఆయన విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 7, 10 తరగతి విద్యార్థులకు గత 11 సంవత్సరాలుగా ఆన్‌లైన్‌లో ఈ ఉచిత టెస్ట్ నిర్వహిస్తున్నారని తెలిపారు. పిల్లల్లో ప్రతిభా పాటవాలను వెలికి తీసేలా ఈ పోటీలు ఉంటాయన్నారు.
జనవరి 23న ప్రిలిమనరీ, 31న మెయిన్స్ పరీక్ష ‘కోడ్ తంత్ర’ సాఫ్ట్‌వేర్ ద్వారా ఈ పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు. ఎక్కువ మంది విద్యార్థులు పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకునేలా జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బుధవారం నుంచి జనవరి 8వ తేదీ వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని సూచించారు.
162 మంది విజేతలకు రూ.9 లక్షల బహుమతులు
7, 10 తరగతుల్లో డిసెంబర్ వరకు పూర్తయిన సిలబస్‌పై 80 శాతం ప్రశ్నలు, జనరల్ నాలెడ్జిపై మరో 20 శాతం ప్రశ్నలు ఉంటాయి. కాగా, ఈ పోటీల్లో మొత్తం 162 మంది విజేతలకు దాదాపు రూ.9 లక్షల విలువైన నగదు బహుమతులు అందించనున్నారు. మరో 1,752 మందికి మెడల్స్, ప్రశంసాపత్రాలు అందజేస్తారు. రాష్ట్రస్థాయిలో పదో తరగతిలో ప్రథమ బహుమతిగా రూ.30 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.25 వేలు, తృతీయ బహుమతి రూ.20 వేలు ప్రకటించారు.
ఏడో తరగతిలో రాష్ట్ర స్థాయి మొదటి విజేతకు రూ.20 వేలు, రెండో విజేతకు రూ.15 వేలు, మూడో విజేతకు రూ.10 వేలు బహుమతిగా అందిస్తారు. ఈ పరీక్షకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి, ఎపిఫనీ సంస్థ ప్రతినిధి డి.నభీ కోఆర్డినేటర్లుగాను, వి.ఎస్.సుబ్బారావు పరీక్షా కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.https:// educationalepiphany.org/eemt 2024/registration.php లింక్ ద్వారా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
పూర్తి వివరాలకు https:// educationalepiphany.org/ వెబ్‌సైట్‌లో గాని, 96667 47996 నంబర్‌లోగాని సంప్రదించి తెలుసుకోవచ్చు. ఈ సమావేశంలో ఎడ్యుకేషనల్ ఎపిఫనీ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ తవనం వెంకటరావు, ఉపాధ్యక్షుడు హేమచంద్ర, కన్వీనర్ పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment