
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 అభ్యర్థుల మెరిట్ జాబితాను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. టెట్ మార్కుల సవరణకు ఈనెల 17వ తేదీ వరకు అభ్యర్థులకు అవకాశం ఇచ్చింది. స్పోర్ట్స్ కోటాలో ఎంపికైనవారి జాబితా సైతం సిద్ధమైంది. ఇక మిగిలింది తుది జాబితా విడుదల మాత్రమే. ఈ నేపథ్యంలో సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే అన్ని జిల్లాల్లో డీఎస్సీ విధుల్లోకి సిబ్బందిని నియమించారు.
సీనియర్ హెచ్‌ఎంలు, ప్రిన్సిపల్స్, ఎంఈవోలకు ఈ విధులను అప్పగించారు. ఈ డీఎస్సీ ద్వారా 16,347 పోస్టులు భర్తీచేయనున్నారు. అంతేసంఖ్యలో అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచే అవకాశం ఉంది. డీఎస్సీ పరీక్షలకు పిలిచిన ఆన్‌లైన్ దరఖాస్తుల్లో దాదాపు 60 వేలమంది అభ్యర్థులు తమ టెట్ మార్కులను తప్పుగా నమోదు చేసినట్టు గుర్తించారు. దీంతో వారి మార్కులను వారే సవరించుకోవాలని రెండుసార్లు విద్యాశాఖ అవకాశం కల్పించింది. చాలామంది ఈ అవకాశాన్ని వినియోగించుకున్నట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో మెరిట్ లిస్ట్ విడుదల అనంతరం జిల్లాల్లో సర్టిఫికెట్ల పరిశీలనలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని సీనియర్ ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. తుది మెరిట్ లిస్ట్‌లో ఉన్నవారిలో అన్ని సర్టిఫికెట్లు సక్రమంగా లేకపోతే, జాబితాలో తర్వాత ఉన్న వారిని పరిగణనలోకి తీసుకుని పోస్టింగ్ ఇస్తారు. డీఎస్సీ ద్వారా కొత్త టీచర్లు వచ్చేనెల 5వ తేదీ నాటికి విధుల్లో ఉండేలా విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసినట్టు సమాచారం.