merit list
-
ఎస్జీటీలుగా 2008–డీఎస్సీ అభ్యర్థులు
సాక్షి, హైదరాబాద్: డీఎస్సీ–2008 అభ్యర్థులను ఎస్జీటీలుగా నియమించే అంశాన్ని పునఃపరిశీలించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. నాటి డీఎస్సీ మెరిట్ జాబితా ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలోని ఈ సమస్యకు ఏపీ సర్కార్ కొంత ఉపశమన నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడింది. అయితే తెలంగాణలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం సరికాదని వ్యాఖ్యానించింది. 2008– డీఎస్సీ నోటిఫికేషన్లో తమ కంటే తక్కువ అర్హత ఉన్న డీఎడ్ అభ్యర్థులకు 30 శాతం ఎస్జీటీ పోస్టులను రిజర్వు చేయడాన్ని వ్యతిరేకిస్తూ బీఎడ్ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీ, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. ఒకే రకమైన పోస్టులకు అర్హత ఎక్కువున్న వారిని కాదని.. తక్కువ ఉన్న వారిని నియమించడం చట్టప్రకారం సరికాదని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదించారు. ‘ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలు చేసేటప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4)కు లోబడి క్లాసిఫికేషన్ చేయాలిగానీ.. ఇష్టం వచ్చి నట్లు నిర్ణయం తీసుకోవడం చెల్లదు. ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ–2008 బీఎడ్ అభ్యర్థుల విషయంలో ఆ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. వారికి 60 ఏళ్లు వచ్చే వరకు కాంట్రాక్టు ఉద్యోగాల్లో కొనసాగిస్తామని హామీ ఇవ్వడమే కాకుండా అమలు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కారణంగానే వివాదం ఏళ్లుగా కొనసాగుతోంది. కనీసం ఖాళీగా ఉన్న పోస్టుల్లో నాటి బీఎడ్ అభ్యర్థులను నియమిస్తే అందరికీ ఉపశమనం లభిస్తుంది’అని పేర్కొ న్నారు. ఏపీ ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది గోవింద్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘ఏపీ ప్రభుత్వం సంక్షేమ రాష్ట్రం. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమే ఏ నిర్ణయమైనా తీసుకుంటుంది. ఇందులో భాగంగానే మానవతా ధృక్పథంతో అలోచించి అర్హులైన డీఎస్సీ 2008 అభ్యర్థులను కాంట్రాక్టు ఉద్యోగులుగా నియమించింది’అని నివేదించారు. వాదనలు విన్న ధర్మాసనం.. బీఎడ్ అభ్యర్థులను ఉద్యోగాల్లో నియమించే అంశాన్ని పునః పరిశీలించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. -
స్టాఫ్‌నర్స్ ప్రొవిజినల్ మెరిట్ జాబితా విడుదల
సాక్షి, హైదరాబాద్: స్టాఫ్‌నర్స్ పోస్టుల మెరిట్ జాబితాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మేంట్ బోర్డ్ సభ్య కార్యదర్శి గోపీకాంత్‌రెడ్డి గురువారం విడుదల చేశారు. ఈ నెల 18వ తేదీన విడుదల చేసిన రాత పరీక్ష ఫలితాలపై అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ఈ జాబితాను ప్రకటించినట్లు ఆయన వెల్లడించారు. ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ ఆధారంగా 1:1.25 నిష్పత్తిలో అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయాలని నిర్ణయించామని తెలిపారు. మొత్తం స్టాఫ్‌నర్స్ పోస్టులకు 40,936 మంది దరఖాస్తు చేశారు. అందులో 38,674 మంది రాత పరీక్ష రాశారు. వారిలో నుంచి 8,892 మందిని సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలిచినట్లు ఆయన వివరించారు. శనివారం (30వ తేదీ) నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తామని చెప్పారు. వెరిఫికేషన్ ఎక్కడంటే.. ఎక్సైజ్ అకాడమీ ఫర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ (ఈస్ట్), 120/పీ, సెయింట్ మైకేల్స్ కాలనీ, అభ్యుదయన గర్, అభ్యుదయ నగర్ కాలనీ, బండ్లగూడ జాగీర్, హైదరాబాద్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుంది. దరఖాస్తుదారులు ఒరిజినల్ సర్టిఫికె ట్లు, డాక్యుమెంట్లతోపాటు వాటికి సంబంధించి రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తీసుకురావాలి. అలాగే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన దరఖాస్తు ఫారమ్ పీడీఎఫ్‌ను వెంట తీసుకొని రావాలి. ఎవరెవరు ఏయే సర్టిఫికెట్లు తేవాలంటే.. ఆధార్ కార్డ్, పుట్టిన తేదీ రుజువు సర్టిఫికెట్, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ వర్తించేవారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కమ్యూనిటీ సర్టిఫికెట్ తీసుకురావాలి. నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్ అందించని బీసీలను ఓసీలుగా పరిగణిస్తారు. ఈడబ్ల్యూఏఎస్ రిజర్వేషన్ క్లెయిమ్ చేసే అభ్యర్థులు తాజా ఆదాయ ధ్రువీకరణపత్రం తీసుకురావాలి. స్పోర్ట్స్ కేటగిరీ కింద రిజర్వేషన్‌ను క్లెయిమ్ చేసే వారు స్పోర్ట్స్ సర్టిఫికెట్ తీసుకురావాలి. దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ తీసుకురావాలి. స్థానికతను తెలిపే సర్టిఫికెట్లు, జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ సర్టిఫికెట్, తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో వెంట తీసుకొని రావాలి. ఒరిజినల్ సర్టిఫికెట్లు తేకుంటే అభ్యర్థిత్వం రద్దు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రాకపోవడం లేదా ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురాకపోతే వారి అభ్యర్థిత్వం రద్దు చేస్తారు. ప్రొవిజినల్ జాబితా ఎంపిక జాబితా కాదని గోపీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కాగా, 7,094 స్టాఫ్‌నర్స్ పోస్టులను భర్తీ చేస్తారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు వచ్చిన వారిలో అనర్హులుండి, పోస్టుల కంటే తక్కువ మంది మాత్రమే అర్హత సాధిస్తే, తమ వద్ద ఉన్న అర్హుల జాబితా నుంచి మరికొందరిని పిలుస్తామని ఆయన తెలిపారు. నిర్ణీత రోజుల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయం... ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే ఆరో తేదీ వరకు ప్రతి రోజూ మూడు సెషన్లలో సర్టిఫికెట్ల వెరిఫి కేషన్ నిర్వహిస్తారు. ప్రతీ సెషన్లో 400 నుంచి 500 మంది సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. ఈ మేర కు అభ్యర్థులకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. మొదటి సెషన్: ఉదయం 9.15 నుంచి 11.15 గంటల వరకు రెండో సెషన్: మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు మూడో సెషన్: మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు -
మార్కుల డివిజన్ ప్రకటించం
సాక్షి, న్యూఢిల్లీ: 10, 12 తరగతుల మార్కుల ఫలితాల్లో ఇకపై డివిజన్, డిస్టింక్షన్‌ను ప్రకటించబోమని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) పేర్కొంది. మెరిట్ లిస్టును ప్రకటించే విధానానికి గతంలోనే స్వస్తి చెప్పిన బోర్డు తాజాగా డివిజన్, డిస్టింక్షన్‌పై నిర్ణయాన్ని వెలువరించింది. ఈమేరకు సీబీఎస్ఈ ఎగ్జామినేషన్ కంట్రోలర్ భరద్వాజ్ ఒక ప్రకటన విడుదల చేశారు. మార్కుల శాతాన్ని లెక్కించడం, ప్రకటించడం వంటివి బోర్డు ఇకపై చేయదని స్పష్టం చేశారు. ఉన్నత చదువులకు మార్కుల శాతం అవసరమనిపిస్తే సదరు సంస్థ వాటిని గణించుకోవచ్చని వివరించింది. ఒకవేళ విద్యార్థి అయిదుకు మించి సబ్జెక్టులను ఎంచుకున్నట్లయితే..వాటిలో అయిదు ఉత్తమ సబ్జెక్టులను గుర్తించడంపై సంబంధిత ఉన్నత విద్యా సంస్థ లేదా యజమాని నిర్ణయం తీసుకోవచ్చని భరద్వాజ్ తెలిపారు. 10, 12వ తరగతి సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు 2024 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మొదలవుతాయని తెలిపారు. -
ఎంబీబీఎస్ ప్రాథమిక మెరిట్ జాబితా విడుదల
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్ కోర్సులలో ప్రైవేట్ వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్లలో 2023–24 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ప్రాథమిక మెరిట్ జాబితాను వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం విడుదల చేసింది. దీంతోపాటు ఈ ఏడాది కొత్తగా ప్రారంభిస్తున్న 5 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల జాబితాను విడుదల చేశారు. విద్యార్థులు తమ అభ్యంతరాలు, వినతులను https://ugmq.ysruhs.com/ Grievance/ index. php వెబ్సైట్ లో శుక్రవారం సాయంత్రం 4 గంటలలోగా నమోదు చేయాల్సి ఉంటుంది. గడువు ముగిసిన అనంతరం నమోదు చేసిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోబోమని రిజిస్ట్రార్ రాధికారెడ్డి తెలిపారు. -
గుడ్‌న్యూస్: సబ్‌రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ల జాబితా విడుదల
సాక్షి,అమరావతి: గ్రూప్-2 సబ్‌రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా ఎంపికైన వారి జాబితాను ఏపీపీఎస్సీ బుధవారం విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్సైట్లో ఉంచినట్టు సహకార శాఖ కమిషనర్ ప్రకటన జారీ చేశారు. apcooperation.nic.in వెబ్సైట్లో ఉద్యోగాలకు ఎంపికైన వారి తుది జాబితాను పొందుపరిచినట్లు తెలిపారు -
అర్హత ఉన్నా.. మెరిట్ లిస్ట్‌లో పేరున్నా జాబ్ రాలే..
సాక్షి, మంచిర్యాల: ఎంఎస్సీ నర్సింగ్ అర్హత ఉండి మెరిట్ లిస్ట్‌లో పేరున్నా తమకు కాకుండా బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థులకు జాబ్ ఇచ్చారని, తమకు జరిగిన అన్యాయంపై సోమవారం అభ్యర్థులు కలెక్టర్ భారతి హోళ్లికేరి, డీఎంహెచ్ఓ సుబ్బరాయుడుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంఎస్సీ, బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థులతో భర్తీ చేయాల్సి ఉండగా కేవలం బీఎస్సీ వారికే అవకాశం ఇచ్చారన్నారు. అంతేకాకుండా ఎస్సీ క్యాటగిరీలో ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలేదన్నారు. అధికారులు ఏ ప్రాతిపదికన నియామకం చేశారో అర్థం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లి సాగర్, ఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జుమ్మిడి గోపాల్, ఏఐఎఫ్డీఎస్ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, తెలంగాణ విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షుడు క్రాంతికుమార్, పీడీఎస్‌యూ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ తోట రాజేష్ పాల్గొన్నారు. -
ఏపీపీఎస్సీలో ఇంటర్వ్యూలు రద్దు
-
ఏపీ ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 2020 జనవరి నుంచి భర్తీ చేసే ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి కేవలం రాత పరీక్షలలో మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఏపీపీఎస్సీపై సీఎం జగన్ సమీక్ష కాగా అంతకు ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్‌పై సమీక్ష నిర్వహించారు. ప్రతి ఏడాది జనవరిలో ఉద్యోగాల భర్తీపై క్యాలెండర్ రూపొందించాలని అధికారులకు సూచనలు చేశారు. అత్యంత పారదర్శకంగా ఏపీపీఎస్సీ ఉద్యోగాలు భర్తీ చేయాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి పరీక్షలో ఐఐటీ, ఐఐఎం భాగస్వామ్యం అయ్యేలా ఆలోచన చేయాలని అన్నారు. అలాగే అత్యవసర సర్వీసులు అందిస్తున్న విభాగాల్లో పోస్టుల భర్తీకి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి నోటిఫికేషన్ కోర్టు కేసులకు దారి తీస్తుందని అధికారులు చెప్పగా, ఇకపై అలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచనలు చేశారు. కాగా ఉద్యోగ నియామకాల్లో మరింత పాదర్శకత దిశగా సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి సీతారామాంజనేయులు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ మేరకు జనవరిలో కొత్త నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏపీపీఎస్సీ సన్నాహాలు చేస్తోంది. -
కొలిక్కి వచ్చిన మెరిట్ జాబితా..!
సాక్షి, విజయనగరం : గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థుల మెరిట్ జాబితా ఓ కొలిక్కి వచ్చింది. గ్రేడ్–1 మినహా మిగతా పోస్టులకు సంబంధించి సిద్ధమైన మెరిట్ జాబితాను కలెక్టర్ ఆమోదం పొందాక వెబ్సైట్లో పెడుతున్నట్టు జెడ్పీ సీఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. మెరిట్ జాబితా ను రూపొందించేందుకు మూడు రోజులుగా కసరత్తు చేస్తున్నాం.. రోస్టర్, రూల్‌ఆఫ్ రిజర్వేషన్లకు అనుగుణంగా అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో పారదర్శకంగా జాబితాను రూపొందిస్తున్నాం.. దీంతో అనుకున్న సమయం కంటే సమయం ఎక్కువుగా పడుతున్నట్టు చెబుతున్నారు. గ్రేడ్–1 పోస్టులు మినఘా అగ్రికల్చర్ అసిస్టెంట్, ఫిషరీస్ అసిస్టెంట్, హార్టికల్చరల్ అసిస్టెంట్, ఏఎన్ఎం తదితర పోస్టులన్నింటికి సంబంధించిన మెరిట్ జాబితా సిద్ధమైంది. వెబ్ సైట్లో పెట్టాక మెరిట్ జాబితాలో ఉన్న వారికి ఆయా శాఖాల నుంచి కాల్ లెటర్లు సోమవారం రాత్రి నుంచే పంపిస్తున్నట్టు తెలిపారు. కాల్ లెటర్లు పంపించిన అభ్యర్థులకు ఇచ్చిన సమ యం ప్రకారం ధ్రువపత్రాలు పరిశీలన ఉంటుం దన్నారు. కొందరి ధ్రువపత్రాలను నేడు (మంగళవారం) పరిశీలించే అవకాశం ఉందన్నారు. అభ్యర్థుల ఎదురుచూపు... సోమవారం మెరిట్ జాబితా వెల్లడిస్తామని అధికారులు చెప్పడంతో ఉదయం నుంచి కొంతమంది జిల్లా పరిషత్ కార్యాలయానికి హడవుడిగా తిరిగారు. రాత్రి వరకు కార్యాలయాల పరిసరాల్లోనే గడిపారు. -
మెరిట్ జాబితాపై కసరత్తు
సాక్షి, ఏలూరు (టూటౌన్) : గ్రామ, వార్డు సచివాలయ నియామక పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు మెరిట్ జాబితా కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకూ ఈ జాబితా రూపకల్పనలో జిల్లా యంత్రాంగం తలమునకలైంది. ఈ జాబితాపై జిల్లా అధికారులతో పాటు జిల్లాపరిషత్ ఉద్యోగులు కసరత్తు చేస్తున్నారు. ఈనెల 1 నుంచి 8వ తేదీ వరకూ జిల్లాలోని మొత్తం 19 రకాల పోస్టులకు 14 రకాల పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. జిల్లావ్యాప్తంగా 9,576 పోస్టులకు 1,41,806 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో పరీక్షలకు 1,28,268 మంది హాజరయ్యారు. ఈ పరీక్షల ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం కేవలం 11 రోజుల్లోనే వెలువరించి రికార్డు నెలకొల్పింది. జిల్లాలకు సంబంధించి జాబితాను ఈ నెల 21నే పంపినా.. రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల వారీగా తుది మెరిట్ జాబితా రూపకల్పన ప్రక్రియలో జిల్లా అధికారులు తలమునకలయ్యారు. దీనికి సంబంధించి ఆయా శాఖల సిబ్బంది శనివారం అర్ధరాత్రి వరకూ కష్టపడి ఒక జాబితాను రూపొందించారు. దీనిని ఆదివారం ఉదయం కలెక్టర్ ముత్యాలరాజుకు సమర్పించారు. దీనిని పరిశీలించిన కలెక్టర్ దీనిలో లోపాలు కనిపిస్తున్నాయని, వాటిని సరిచేసిన తర్వాతనే అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆదివారం అయినా జిల్లా యంత్రాంగం పూర్తి సమయాన్ని జాబితాల రూపకల్పనపైనే పెట్టింది. ఆదివారం మధ్యాహ్నం కలెక్టర్ స్వయంగా జిల్లాపరిషత్ సమావేశ మందిరంలోనే ఉండి జాబితా రూపకల్పన ప్రక్రియను సమీక్షించారు. అధికారుల అనుమానాలు నివృత్తి చేశారు. రాత్రి పొద్దుపోయే వరకూ అధికారులు జాబితా రూపకల్పనలోనే నిమగ్నమయ్యారు. -
'సచివాలయ ఉద్యోగాల మెరిట్ లిస్ట్‌లు సిద్ధం’
సాక్షి, అమరావతి : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల మెరిట్ లిస్ట్‌లు సిద్ధం చేశామని మున్సిపల్‌శాఖ కమిషనర్ విజయ్‌కుమార్ తెలిపారు. మెరిట్ లిస్ట్‌ను జిల్లాల కలెక్టర్లకు పంపినట్లు వెల్లడించారు. ఈనెల 21 నుంచి 23 వరకు ఎంపికైనన అభ్యర్థులకు కాల్ లెటర్ పంపిస్తామని, అభ్యర్థులకు ఈ-మెయిల్, ఎస్ఎమ్ఎస్ ద్వారా కూడా సమాచారం అందుతుందని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు ఆన్లైన్లో సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలని, ధరఖాస్తులో చెప్పిన అర్హత, కుల ధృవీకరణ, క్రీమిలేయర్, నివాస సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ నెల 23 నుంచి 25 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని, ఈ నెల 27న అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేయనున్నట్లు తెలిపారు. జిల్లాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం 20 బృందాలను ఏర్పాటు చేశామని, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు. భర్తీ ప్రక్రియ పూర్తయ్యాక ఏ అభ్యర్థి ఎక్కడ ఉద్యోగం చేయాలన్నది నిర్ణయిస్తామని, 60 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి చేశామని మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. -
జిల్లాలకు ‘సచివాలయ’ మెరిట్ జాబితా
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూలు లేని కారణంగా ఉద్యోగానికి అర్హత సాధించిన వారికే జిల్లా సెలక్షన్ కమిటీలు కాల్ లెటర్లు పంపుతాయని పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. జిల్లాల వారీగా రాతపరీక్షల మెరిట్ జాబితాలు శుక్రవారం ఉదయానికి కల్లా ఆయా జిల్లాలకు చేరవేయనున్నట్టు వెల్లడించారు. మెరిట్ జాబితా ఆధారంగా జిల్లా సెలక్షన్ కమిటీ.. ఆ జిల్లాలో భర్తీ చేసే ఉద్యోగాలు, కేటగిరీల వారీగా రిజర్వేషన్ పోస్టుల సంఖ్యను షార్ట్ లిస్ట్ చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. శనివారం కల్లా జిల్లాల్లో షార్ట్ లిస్టు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని, అది పూర్తయిన వెంటనే ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. షార్ట్ లిస్టులో పేరు ఉన్న అభ్యర్థులు వారి కాల్‌లెటర్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆయా అభ్యర్థులకు జిల్లా సెలక్షన్ కమిటీలు మెయిల్ ద్వారా కూడా సమాచారం ఇస్తారని, అంతేగాక ఆయా పోస్టులకు సంబంధించి జిల్లా కార్యాలయాల్లోనూ ఎంపికైన వారి జాబితా ఉంచనున్నామని చెప్పారు. ఆ కార్యాలయాల నుంచి నేరుగా కాల్ లెటర్లు పొందే వెసులుబాటు కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. కాల్‌లెటర్లు అందిన వారు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు ఆన్లైన్లో అప్లోడ్ చేయడంతో పాటు 23వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఆయా జిల్లాల్లో నిర్వహించే సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియకు హాజరు అయ్యి తమ ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలు అధికారులకు చూపించాల్సి ఉంటుందన్నారు. ఇక కాల్ లెటర్లు వచ్చిన వారు ఎటువంటి క్రిమినల్ కేసులు లేనివారై ఉండాలి. (చదవండి: ‘సచివాలయ’ పరీక్షల ఫలితాల్లోనూ రికార్డ్) -
ఎట్టకేలకు టీఆర్టీలకు మోక్షం
సాక్షి, వనపర్తి : టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ) అభ్యర్థుల నియామకాలకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఈ ఏడాదైనా ప్రభుత్వం బడులు తెరిచే నాటికి నియమాకాలు చేపట్టాలనే వారి డిమాండ్ కొంచెం అటు, ఇటుగా ఫలించింది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టులను ఆర్టీటీ అభ్యర్థులతో భర్తీ చేసేందుకు 2017లో టీఆర్టీ పరీక్ష నిర్వహించి, ఇందుకు ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినా.. ఎంపికైన వారికి నియమాక ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో ఇన్నాళ్లు అయోమయ పరిస్థితిలో వారంతా కొట్టుమిట్టాడారు. ఇదే క్రమంలో ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తూ వస్తున్నా వారు నియమాకాల కోసం రోజుల తరబడి ఎదురుచూపులకు ఫలితం దక్కనుంది. ప్రభుత్వం వారికి పోస్టింగ్‌లు ఇవ్వాలని నిర్ణయించడంతో ఎన్ని రోజుల ఎదురుచూపుల ఆశలు నేరవేరనున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా భర్తీ ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో పాటుగా ఉమ్మడి జిల్లా కేంద్ర కలెక్టర్ చైర్మన్‌గా, జేసీ వైస్ చైర్మన్‌గా, డీఈఓ కార్యదర్శిగా, జెడ్పీసీఈఓ లేదా ఇతర అధికారిని సభ్యులను కమిటీగా ఏర్పాటు చేసి, వారి ద్వారా నియమాకాల ప్రక్రియను చేపట్టనున్నారు. ఇందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ రోస్టర్, మెరిట్ జాబితా ప్రకారం ప్రభుత్వ పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. నాలుగు కేటగిరీల్లో నియామకాలు టీఆర్టీల నియమకాలను ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా జిల్లా కమిటీలు నాలుగు కేటగిరిల్లో భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులుండి ఉపాధ్యాయులు లేని పాఠశాలలకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఉమ్మడి జిల్లా ప్రతిపాదికన కొత్త జిల్లాల అధికారులను సమన్వయం చేసుకుంటూ పోస్టులు భర్తీ చేసేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ఎవరైనా అభ్యర్థులు కౌన్సెలింగ్ హాజరుకాకపోతే మిగిలిన స్థానాల్లో నియమిస్తున్నట్లు వారికి రిజిష్టర్ పోస్టు ద్వారా సమాచారం అందించనున్నట్లు అధికార వర్గాలు తెలుపుతున్నాయి.ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా 2005 మంది విద్యార్థులు అర్హత సాధించారు. వీరిలో సెకండ్ గ్రేడ్ టీచర్స్( ఎస్జీటీ) 1465, స్కూల్ ఆసిస్టెంట్లు 391, ల్వాంగేజ్ పండిట్స్ 113, పీఈటీలు 36 మంది ఉన్నారు. -
ఎట్టకేలకు ఆ డీఎస్సీకి మోక్షం!
విజయనగరం అర్బన్ : జిల్లాలో ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి సంబంధించి డీఎస్సీ–2018కు ఎట్టకేలకు మోక్షం లభిం చింది. ఏటా డీఎస్సీ చేపడతామని హామీ ఇచ్చిన గత ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క నియామకం చేపట్టకుండా గతేడాది కంటితుడుపుగా కేవలం 377 పోస్టులను జిల్లాకు కేటాయిస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. వాస్తవానికి ఎన్నికల ముందే వాటిని భర్తీ చేసే అవకాశం ఉన్నా దానిని పక్కన పెట్టేశారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక నెలరోజుల్లోనే వీటి నియామకాలపై దృష్టి పెట్టి హామీ నిలబెట్టుకుంటున్నారు. జిల్లాలో వచ్చే 17 నుంచి భర్తీ ప్రక్రియ ప్రారంభం ఎన్నికల ముందు నిర్వహించి విడుదల చేసిన డీఎస్సీ ఫలితాల మెరిట్ జాబితాను ప్రామాణికంగా తీసుకొని పోస్టుల భర్తీకి నూతన ప్రభుత్వం అనుమతించింది. దీనిపై విద్యాశాఖ డీఎస్సీ ఎంపిక ప్రాథమిక షెడ్యూల్‌ని విడుదల చేసింది. ఈ క్రమంలో తొలుత జోన్ పరిధిలో ఉన్న మోడల్ స్కూల్, ఏపీ బీసీ సంక్షేమ పాఠశాలల్లో వివిధ కేటగిరీ పోస్టులను భర్తీ చేయనున్నారు. జిల్లా పరిధిలోని వివిధ యాజమాన్యాల పరిధిలో 623కు పైగా ఉపాధ్యాయ పోస్టులుండగా నాలుగేళ్లలో పలుమార్లు కుదించిన తరువాత చివరికి 377 పోస్టులకు ఖాయం చేశారు. జిల్లా పరిధిలోని ఈ పోస్టులకు జూలై 17 నుంచి నియామక ప్రక్రియ ప్రారంభిస్తారు. తొలిరోజున అన్ని రకాల స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టుల అభ్యర్థుల ఎంపిక జాబితాను ప్రకటిస్తారు. జాబితాలోని అభ్యర్థుల విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను 20, 21 తేదీల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అగస్టు 1న తుది జాబితా ప్రకటన వెలువడుతుంది. అదే నెల 2, 3న వెబ్ ఆప్షన్లు, 5న పోస్టింగ్ ఆర్డర్లు ఇస్తారు. ఆ తరువాత సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు ఆగస్టు 2 నుంచి నిర్వహించి సెప్టెంబర్ 4న పోస్టింగ్ ఆర్డర్లు జారీ చేస్తారు. జిల్లాలో భర్తీ కానున్న పోస్టులు 377 జిల్లాలోని వివిధ యాజమాన్యాల పాఠశాలల్లో వివిధ కేటగిరీకి చెందిన 377 పోస్టులున్నాయి. వాటిలో సెకెండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు–186, స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టులు–98, భాషా పండిత టీచర్ పోస్టులు–58, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు–23, క్రాఫ్ట్–5, సంగీతం–5, ఆర్ట్–1 ఉన్నాయి. వివిధ కేటగిరీకి చెందిన 81 పోస్టుల భర్తీ ప్రక్రియ వాయిదా వేశారు. కోర్టులో కేసులున్న నేపథ్యంలో తెలుగు, హిందీ భాషా పండితులు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ హిందీకి చెందిన 58 పోస్టులు, పీఈటీ పోస్టులు 23 నియామకాలు ప్రస్తుతం చేపట్టడంలేదు. జిల్లా విద్యాశాఖ సిబ్బంది హవాకు చెక్ ఆన్లైన్ విధానం వల్ల కౌన్సెలింగ్ ప్రక్రియలో జిల్లా విద్యాశాఖ సిబ్బంది హవాకు చెక్ పడినట్టయింది. ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియలో నూతన ఒరవడిని తీసుకొచ్చారు. ధ్రువపత్రాల పరిశీలనలో భాగంగా వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవాలి. అయితే అభ్యర్థులు దరఖాస్తులతో పెట్టుకున్న విద్యార్హత, తదితర ధ్రువపత్రాలకు సరిపోవాలి. గతంలోనూ ఇదే ప్రక్రియ ఉండేది. ఎలాంటి తేడా వచ్చినా సరిచేయడానికిగాని, తిరిగి జతచేయడానికిగాని అవకాశం ఇచ్చే అధికారం జిల్లా స్థాయి విద్యాధికారులకు ఉండేది. ప్రస్తుతం ఆ విధానానికి చెక్ చెప్పారు. తొలి దరఖాస్తుతో జత చేసిన ధ్రువపత్రాలకు ప్రస్తుత ఒరిజినల్ పత్రాల్లో ఎలాంటి తేడా ఉన్నా రిజక్ట్ చేస్తారు. వాటిని సవరించాలంటే రాష్ట్రస్థాయి అధికారిని వేడుకోవడంగాని, కోర్టులను ఆశ్రయించడంగాని చేయాల్సిందే. ఇలాంటి సవరణ అంశాలలోనే జిల్లా విద్యాశాఖలో కొందరు ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవహరించేవారు. కొన్ని సందర్భాల్లో రోస్టర్ విధానాన్ని తప్పుతోవ పట్టించి ప్రతిభగల అభ్యర్థులకు అన్యాయం జరిగిన సంఘటనలు గతంలో కొన్ని ఉన్నాయి. వారిలో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రంచిన వారు ఉన్నారు. ప్రస్తుత విధానంలో అవకాశం లేకపోవడంతో స్థానికంగా జిల్లా విద్యాశాఖ పరిధిలోని పరిశీలన సిబ్బంది హవాకు చెక్ పెట్టినట్లయింది. మోడల్ స్కూల్, గురుకుల పాఠశాల పోస్టులు: ఈ సారి ఉపాధ్యాయుల నియామక పరీక్ష(టీఆర్టీ)లో డీఎస్సీతో పాటు జోన్ పరిధిలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్, గురుకుల పాఠశాల బోధన సిబ్బందికి పోటీ పరీక్ష కూడా తొలిసారిగా విద్యాశాఖ నిర్వహిస్తోంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం పరిధిలోని జోన్–1లో ఏపీమోడల్ స్కూళ్లలోని ఖాళీగా ఉన్న 214 పోస్టులను భర్తీ చేస్తోంది. ఇందులో టీజీటీలు 108, పీజీటీలు 106 ఉండగా రాష్ట్ర పరిధిలోని ప్రిన్సిపాల్ పోస్టులు 77 ఉన్నాయి. ఏపీగురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 175 పోస్టులను భర్తీ చేయనున్నారు. వాటిలో టీజీటీలు 93, పీజీటీలు 60, పీటీటీలు 22 ఉన్నాయి. బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 91 పోస్టులను భర్తీ చేస్తుండగా వాటిలో టీజీటీలు 38, పీజీటీలు 34, పీఈటీలు 9, క్రాఫ్ట్ 3, ఆర్ట్ 4, మ్యూజిక్ 3 పోస్టులు ఉన్నాయని డీఈఓ జి.నాగమణి తెలిపారు. -
‘స్కూల్ అసిస్టెంట్’ ఫలితాలు వెల్లడి
సాక్షి, హైదరాబాద్ : ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టుల ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) ప్రకటించింది. అభ్యర్థికి వచ్చిన మార్కుల వివరాలతో పాటు మెరిట్ ఆధారంగా వారికి రాష్ట్ర ర్యాంకులను కేటాయించింది. పోస్టుల భర్తీలో పారదర్శకతతో పాటు జిల్లాలోని 20 శాతం ఓపెన్ కేటగిరీ పోస్టులకు అన్ని జిల్లాల అభ్యర్థులకు అవకాశం కల్పించడంతో ఈ ర్యాంకులను ప్రకటించింది. 1941 స్కూల్ ఆసిస్టెంట్ పోస్టుల్లో సబ్జెక్టుల వారీగా అభ్యర్థికి వచ్చిన రాష్ట్ర ర్యాంకు, హాల్‌టికెట్ నంబరు, మార్కులు, రిజర్వేషన్ కేటగిరీ, జిల్లా వివరాలతో ఫలితాలను ప్రకటించింది. మొత్తం 27 సబ్జెక్టులకు 1,17,410 మందితో మెరిట్ జాబితాను రూపొందించింది టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం జారీ చేసిన ర్యాంకుల జాబితాల నుంచి ఒక్కో పోస్టుకు 1:3 నిష్పత్తిలో మెరిట్ జాబితాలను సిద్ధం చేసి ఆయా జిల్లాలకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పంపించనుంది. వెరిఫికేషన్ పూర్తయ్యాక జిల్లాల నుంచి వచ్చిన జాబితాలను బట్టి అభ్యర్థులను పోస్టులకు ఎంపిక చేయనుంది. మరోవైపు సెకండరీ గ్రేడ్ టీచర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, పండిట్ పోస్టులకు సంబంధించిన ర్యాంకులను కూడా త్వరలోనే ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
2011 గ్రూప్–1 మెయిన్స్ మెరిట్ జాబితా విడుదల
సాక్షి, అమరావతి : ఏపీపీఎస్సీ.. గతంలో నిర్వహించిన 2011 గ్రూప్–1 మెయిన్స్ మెరిట్ జాబితాను 294 మంది అభ్యర్థులతో మంగళవారం విడుదల చేసింది. 2011 గ్రూప్–1 పోస్టుల భర్తీకి సంబంధించి సుదీర్ఘకాలం సుప్రీంకోర్టులో విచారణ జరిగి తీర్పు వెలువడ్డా చివరి వరకు పలు వివాదాలు దీన్ని వెన్నాడుతూనే వచ్చాయి. ఎట్టకేలకు 152 పోస్టులకు ఇంటర్వ్యూలకు పిలుస్తూ 294 మంది పేర్లతో జాబితా వెలువడింది. త్వరలోనే ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని, వివరాలను వెబ్సైట్లో పొందుపరుస్తామని ఏపీపీఎస్సీ పేర్కొంది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కాంప్లెక్స్ ఎదురుగా ఆర్అండ్బీ భవనంలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపింది. ఇంటర్వ్యూలకు హాజరైనప్పుడు ఒరిజినల్ సర్టిఫికెట్లను కూడా పరిశీలిస్తామని చెప్పింది. కాగా, డీఎస్పీ తదితర పోస్టులకు ఎంపికైనవారు శరీరదారుఢ్య పరీక్షలకు విశాఖపట్నంలోని మెడికల్ బోర్డు, దివ్యాంగులు సంబంధిత మెడికల్ బోర్డు ముందు హాజరుకావాల్సి ఉంటుంది. న్యాయవివాదాలతో సుదీర్ఘ కాలం.. 2011, నవంబర్‌లో 312 గ్రూప్–1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. 2012, మే 27న ప్రిలిమ్స్ నిర్వహించారు. ప్రిలిమ్స్ ‘కీ’లో 13 తప్పులు ఉన్నాయని అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేయగా ఏడింటిని సవరించిన కమిషన్ ఆరింటినీ వదిలేసింది. దీనిపై అభ్యర్థులు కొందరు ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే 2012, సెప్టెంబర్ 18 నుంచి 30 వరకు మెయిన్స్ పరీక్షలు, తర్వాత ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారు. ప్రిలిమ్స్ కీపై ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వగా అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. తప్పుగా ఉన్న ఆరు ప్రశ్నలపై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నుంచి నివేదిక కోరుతూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. వీటిపై ఏపీపీఎస్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుదీర్ఘ విచారణ అనంతరం ప్రిలిమ్స్‌లోని 150 ప్రశ్నల్లో తప్పులున్న ఆరు ప్రశ్నలను రద్దు చేసి మిగిలిన 144 ప్రశ్నల మేరకు మెరిట్ లిస్టు రూపొందించి మళ్లీ మెయిన్స్, ఇంటర్వ్యూలు నిర్వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే కమిషన్ మెయిన్స్ పరీక్షలను నిర్వహించలేదు. రెండోసారి మెయిన్స్ నిర్వహించినా తప్పులే అభ్యర్థులు కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేయడంతో ఆంధ్రప్రదేశ్ (172), తెలంగాణ (140) రాష్ట్రాల సర్వీస్ కమిషన్లు వేర్వేరుగా మెయిన్స్ పరీక్షను చేపట్టాయి. క్యారీఫార్వర్డ్ అంటూ పోస్టుల సంఖ్య 172 నుంచి 152కు కుదించుకుపోయింది. మెయిన్స్ పరీక్షను మళ్లీ నిర్వహించినా తప్పులే దొర్లాయి. పేపర్–5 150 మార్కులకు నిర్వహించగా 42 మార్కులకు ప్రశ్నలు తప్పుగా వచ్చాయి. దీనిపై అభ్యంతరాల మేరకు కమిషన్ వాటిని తొలగించి 108 మార్కులకే పరిగణనలోకి తీసుకొని అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మళ్లీ వారం రోజుల్లోనే ఆ జాబితాను తొలగించి తప్పుగా వచ్చిన 42 మార్కుల ప్రశ్నలనూ కలిపి మొత్తం 150 మార్కులకు స్కేలింగ్ విధానంలో అర్హుల జాబితాను ప్రకటించింది. మొదటి జాబితాలో ఉన్న 28 మంది అభ్యర్థుల పేర్లు ఈ రెండో జాబితాలో లేకపోగా కొత్తగా మరికొంతమందికి అవకాశం వచ్చింది. దీంతో వారంతా కమిషన్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీనిపై ట్రిబ్యునల్ మొదటి జాబితాను మాత్రమే ఉంచాలని, లేదంటే మళ్లీ పరీక్ష పెట్టాలని ఆదేశించింది. దీనిపై ఏపీపీఎస్సీ మళ్లీ హైకోర్టుకు వెళ్లింది. కోర్టు నుంచి సానుకూల ఉత్తర్వులు రావడంతో కమిషన్ తాజాగా రెండో జాబితాను ఖరారు చేసి ఇంటర్వ్యూలకు రంగం సిద్ధం చేసింది. -
అభ్యంతరాలుంటే తెలియజేయండి
అనంతపురం మెడికల్ : వైద్య ఆరోగ్యశాఖలో రెండు నోటిఫికేషన్లకు సంబంధించి మెరిట్ లిస్ట్‌ను శనివారం అధికారులు విడుదల చేశారు. జాబితాలపై అభ్యంతరాలుంటే ఈ నెల 20 లోగా తెలియజేయాలని డీఎంహెచ్ఓ వెంకటరమణ కోరారు. వివరాల్లోకి వెళితే.. 13వ ఫైనాన్స్ కమిషన్ కింద జిల్లాలో కొత్తగా ఏడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్మించారు. వీటిలో కాంట్రాక్ట్ పద్ధతిలో 14 సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, 21 స్టాఫ్‌నర్సులు, ఏడు ఫార్మసిస్టు పోస్టుల భర్తీకి గతంలోనే దరఖాస్తులు ఆహ్వానించారు. వీటికి సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్ట్‌తోపాటు సెలెక్షన్ లిస్ట్, ఏడు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల రివైజ్డ్ ప్రొవిజినల్ జనరల్ మెరిట్ లిస్ట్‌ను విడుదల చేశారు. అదేవిధంగా ఆర్బీఎస్కేలో కాంట్రాక్ట్ పద్ధతి కింద మెడికల్ ఆఫీసర్లు, ఆయుష్ మెడికల్ ఆఫీసర్లు, ఎంపీహెచ్ఏ (ఫిమేల్), ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తులను గతంలోనే స్వీకరించారు. తాజాగా ఫార్మసిస్ట్‌లకు సంబంధించి ప్రొవిజినల్ జనరల్ మెరిట్ లిస్ట్, ఇతర క్యాడర్ల ఫైనల్ సెలెక్షన్ లిస్ట్‌లను విడుదల చేశారు. వీటిని ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏఎన్ఏఎన్టీఏపీయూఆర్ఏఎంయూ.ఏపీ.జీఓవీ.ఐఎన్’ అనే వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. జాబితాలపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఆదివారం నుంచి 20లోగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో తెలియజేయాల్సి ఉంటుంది. -
కటాఫ్ వస్తేనే ‘మెరిట్’లో చోటు
► గతేడాదికంటే కాస్త సులభంగా జేఈఈ అడ్వాన్స్డ్ ► కెమిస్ట్రీలో 3 ప్రశ్నల జవాబులపై కొంత సందిగ్ధం ► వచ్చే నెల 11న ఫలితాలు, 19 నుంచి ప్రవేశాలు షురూ సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ప్రశ్నలు గతేడాది కంటే సులభంగా వచ్చాయి. కెమిస్ట్రీలో 3 ప్రశ్నలకు, ఫిజిక్స్‌లో 3 ప్రశ్నలకు ఇచ్చిన జవాబుల విషయంలో కొంత సందిగ్ధం నెలకొన్నట్లు సబ్జెక్టు నిపుణులు వెల్లడించారు. ఈ పరీక్షలు రాసేందుకు దేశ వ్యాప్తంగా 1.7 లక్షల మంది, తెలుగు రాష్ట్రాల నుంచి 31,695 మంది దరఖాస్తు చేసుకోగా, ఎంతమంది హాజ రయ్యారన్న కచ్చితమైన వివరాలు తెలియరా లేదు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు కనీస అర్హత మార్కులు సాధిస్తేనే మెరిట్, ర్యాంకుల జాబితాలో చోటు కల్పిస్తారు. ఓపెన్ కేటగిరీలో 35% మార్కులను విద్యార్థులు సాధించాలి. ఓబీసీ–నాన్ క్రీమీలేయర్ కేటగిరీలో 31.5 శాతం మార్కులను, ఎస్సీ కేటగిరీలో 17.5 శాతం, ఎస్టీ కేటగిరీలో 17.5 శాతం, ప్రతి కేటగిరీలో వికలాంగులు 17.5 శాతం మార్కులను సాధించాల్సి ఉంది. ఈ పరీక్షకు సంబంధించి ఈనెల 31న ఉదయం 10 గంటల నుంచి వచ్చే నెల 3 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో ఓఎంఆర్ జవాబు పత్రాలను ప్రదర్శిస్తారు. వాటిపై అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు స్వీకరి స్తారు. వచ్చే నెల 4న ఉదయం వెబ్సై ట్లో జవాబుల కీలను అందుబాటులో ఉంచుతారు. 6వ తేదీ వరకు వాటిపై విద్యార్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. 11వ తేదీన ఉదయం 10 గంటలకు ఫలితాలను ప్రకటి స్తారు. ఆర్కిటెక్చర్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఆర్కిటెక్చర్ ఆప్టి ట్యూట్ టెస్టు (ఏఏటీ) కోసం వచ్చే నెల 11, 12 తేదీల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తారు. 14వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏఏటీ పరీక్ష ఉంటుంది. 18వ తేదీన వాటి ఫలితా లను విడుదల చేస్తారు. వచ్చే నెల 19న ఎన్ఐ టీ, ట్రిపుల్ఐటీ, ఐఐటీ ల్లో సంయుక్త ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించి జూలై 18లోగా ఈ ప్రవేశాలను పూర్తి చేస్తారు. ఇదీ నిపుణుల విశ్లేషణ.. పేపరు–1లో మొత్తంగా 183 మార్కులతో కూడిన 54 ప్రశ్నలు ఇచ్చినట్లు సబ్జెక్టు నిపుణు లు ఎంఎన్‌రావు, కేదారీశ్వర్, రామకృష్ణ తెలిపా రు. పేపరు–2లోనూ అలాగే ఇచ్చారని పేర్కొ న్నారు. పేపరు–1లో మ్యాథ్స్‌లో 18, ఫిజిక్స్ లో 18, కెమిస్ట్రీలో 18 ప్రశ్నలు ఇచ్చారని వివ రించారు. ప్రతి సబ్జెక్టులో ఆబ్జెక్టివ్ విధానంలో 7 ప్రశ్నలు ఇచ్చారని, మరో 5 సింగిల్ డిజిట్ ఇంటీజర్ ప్రశ్నలు ఇచ్చినట్లు వెల్లడించారు. మరో త్రీ కాలమ్స్ మ్యాట్రిక్స్ మ్యాచింగ్ ప్రశ్న లను గతంలో ఎన్నడూలేని విధంగా ఇచ్చినట్లు వివరించారు. కొన్ని కేటగిరీల ప్రశ్నలకు నెగిటివ్ మార్కులు లేవు. పార్షియల్ మార్కింగ్ విధానంలోనూ ప్రశ్నలు ఇచ్చారు. పేపరు మొత్తంలో 21 ప్రశ్న లకు ఒకటికంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉన్న ప్రశ్నలు ఇచ్చారు. 15 ప్రశ్నలు సింగిల్ డిజిట్ ఇంటీజర్ (0 నుంచి 9 లోపు ఉన్న అంకెలే సమాధానం గా ఉంటాయి.) జవాబులు కలిగిన ప్రశ్నలు ఇచ్చారు. 18 ప్రశ్నలు మ్యాట్రిక్స్‌కు సంబందించినవి ఇచ్చారు. ఇంటీజర్ టైపు ప్రశ్నల్లో నెగిటివ్ మార్కుల విధానం లేదు. ఇక పేపరు– 2లో ప్రతి సబ్జెక్టులో 7 సింగిల్ ఆన్సర్ ప్రశ్నలు ఇచ్చారు. మరో 7 మల్టీ ఆన్సర్ ప్రశ్నలు ఇచ్చారు. మరో 4 ప్రశ్నలు పాసేజ్‌కు సంబం ధించినవి వచ్చినట్లు వారు వెల్లడించారు. మొత్తంగా 54 ప్రశ్నలు 183 మార్కుల విధానాన్ని పాటించారు. ఇందులో కొన్నింటికి నెగిటివ్ మార్కుల విధానం ఉంది. పాసేజ్ విధానంలో నెగిటివ్ మార్కులు లేవు. -
పోలీసు కానిస్టేబుళ్ల నియామకంపై మరో పిల్
హైదరాబాద్: పోలీసు కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలు జరిగాయంటూ హైకోర్టులో మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. నల్గొండ జిల్లాకు చెందిన టి.వీరభద్రం మరో ఇద్దరు దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ, కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని తెలిపారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను అనుసరించలేదన్నారు. అంతేకాక వాహన లైసెన్స్ ఉన్న వారికి ఇచ్చే గ్రేస్ మార్కుల విషయంలో అతకతవకలు జరిగాయని తెలిపారు. లైట్ మోటారు వెహికల్ (ఎల్ఎంవీ) లైసెన్సు ఉన్న వారికి 3 నుంచి 5 వరకు గ్రేస్ మార్కులున్నాయని, అయితే ద్విచక్ర వాహన లైసెన్స్ ఉన్న వారికీ కూడా గ్రేస్ మార్కులు ఇచ్చారని వివరించారు. ఇటువంటి అవకతవకలతో మెరిట్ జాబితాను తయారు చేశారన్నారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా రచనారెడ్డి జోక్యం చేసుకుంటూ పరోక్షంగా మధ్యంతర ఉత్తర్వుల కోసం అభ్యర్థించారు. దీనిని అర్థం చేసుకున్న ధర్మాసనం, ఇప్పటికే ఇదే అంశంపై పిల్ దాఖలైందని తెలిపింది. ఆ వ్యాజ్యంలో ప్రతీ అభ్యర్థి నియామకపు ఉత్తర్వుల్లో వారి నియామకం కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేశామంది. కాబట్టి కోర్టుకొచ్చిన అభ్యర్థుల ప్రయోజనాలకు పూర్తి రక్షణ ఉందని తెలిపింది. ఒకవేళ తుది విచారణ సమయంలో ఈ నియామకాల్లో పిటిషనర్లు ఆరోపించినట్లు అక్రమాలు, అవకతవకలు జరిగినట్లు తేలితే మొత్తం ప్రక్రియను రద్దు చేస్తామని తేల్చి చెప్పింది. ఈ వ్యాజ్యాన్ని కూడా పాత వ్యాజ్యంతో జత చేస్తూ విచారణను వాయిదా వేసింది. -
నేడు 1999 గ్రూప్–2 మెరిట్ జాబితా
హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 1999 గ్రూప్– 2 పోస్టులకు సంబంధించి తాజా మెరిట్ జాబితాను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) శుక్రవారం విడుదల చేయనుంది. ఈ పోస్టులకు సంబంధించి మెరిట్ జాబితాను ఒకటికి పదిసార్లు సరిచూసుకొని తప్పులు లేకుండా ఖరారు చేసిన కమిషన్ అధికారులు గురువారమే విడుదల చేయాలని భావించారు. ఏపీపీఎస్సీ కమిషన్ ఆమోదముద్ర కూడా తీసుకున్నాకనే విడుదల చేయాలని జాబితా వెల్లడిని శుక్రవారానికి వాయిదా వేశారు. జాబితాను శుక్రవారం కమిషన్ ముందు పెట్టి ఆ తరువాత విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ వర్గాలు వెల్లడించాయి. -
3న మెరిట్ జాబితా విడుదల
అనంతపురం మెడికల్ : జిల్లా క్షయ నివారణ సొసైటీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి మెరిట్ జాబితాను అక్టోబర్ 3న విడుదల చేయనున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ కె.వెంకటరమణ తెలిపారు. 20 పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరించి ఆరు నెలలు గడిచినా మెరిట్ జాబితా విడుదల కాకపోవడంపై ‘కమిటీలతోనే సరి’ శీర్షికన గురువారం సాక్షి ఓ కథనాన్ని ప్రచురించింది. దీనికి స్పందించిన ఆయన ఉదయం జాబితాకు తుది రూపు తెచ్చేందుకు కమిటీ వేశారు. ఇందులో ఎన్ఆర్హెచ్ఎం డీపీఎం డాక్టర్ అనిల్‌కుమార్, జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ సుధీర్‌బాబు, జబార్ కో ఆర్డినేటర్ డాక్టర్ విజయమ్మ, జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ పురుషోత్తంతో కూడిన కమిటీని వేసి శనివారానికి జాబితా తయారు చేసేలా ఆదేశాలు జారీ చేశారు. జాబితా సిద్ధం కాగానే కలెక్టర్ కోన శశిధర్‌తో అనుమతి తీసుకుని అక్టోబర్ 3న విడుదల చేస్తామని చెప్పారు. -
డబ్బులిచ్చిన వారికే ఉద్యోగాలు..
► ఐసీడీఎస్ బాలసదన్‌లో ఇష్టానుసారంగా కాంట్రాక్టు పోస్టుల భర్తీ ► ఇంటర్వ్యూ జరపకుండా.., మెరిట్ జాబితా ఇవ్వకుండా.. ► అర్హులను కాదని అనర్హులకు పోస్టులు కట్టబెట్టిన వైనం నెల్లూరు(అర్బన్) : జిల్లాలో మొత్తం ఐదు బాలసదన్ వసతి గృహాలున్నాయి. నెల్లూరు, గూడూరు, కోట బాలసదన్ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న మ్యూజిక్, డ్రాయింగ్, కంప్యూటర్, విద్యాబోధన, సైకాలజీ, సహాయకులు తదితర 43 పోస్టులను భర్తీ చేసేందుకు ఐసీడీఎస్ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా జనవరి నెల 19వ తేదీన ఖాళీలను కాంట్రాక్టు పద్దతిన భర్తీ చేస్తున్నామని, జనవరి 28వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పత్రికాముఖంగా అధికారులు ప్రకటన ఇచ్చారు. డిగ్రీ, బీఈడీ, సోషల్ వర్క్, పదోతర గతి పాస్/ఫెయిల్ తదితర అర్హతలుండాలని చెప్పారు. అర్హతలను బట్టి అభ్యర్థులను ఎంపికజేసి ఇంటర్వ్యూకి పిలుస్తామని ప్రకటించారు. దీంతో 46 మండలాల నుంచి వందలాది మంది నిరుద్యోగులు పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రకటించని మెరిట్ జాబితా.. ఎంఎస్సీ, డిగ్రీలు చేసిన వారిని ఎంతకీ ఇంటర్వ్యూకి పిలవలేదు. దీంతో వారు జనవరి 28వ తేదీ తర్వాత ఐసీడీఎస్ కార్యాలయం చుట్టూ తిరగడం ప్రారంభించారు. అధికారులు ఇంటర్వ్యూకి కాల్‌లెటర్ పంపిస్తామని వారికి చెప్పారు. ఇది జరిగి రెండు నెలలు పూర్తయినా ఇంటర్వ్యూలు జరపలేదు. అసలు పోస్టుల భర్తీకి సంబంధించిన మెరిట్ జాబితానే ప్రకటించలేదు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం గుట్టు చప్పుడు కాకుండా పోస్టులను భర్తీ చేశారు. దీంతో అసలైన అభ్యర్థులను కాదని డబ్బులు తీసుకొని ఉద్యోగాలు భర్తీ చేశారని దరఖాస్తుదారులు కొందరు ఆరోపిస్తున్నారు. చేతులు మారిన పైసలు.. పోస్టులను భర్తీ చేశారని తెలుసుకున్న పలువురు దరఖాస్తుదారులు ఏం జరిగిందా అని ఆరాతీయగా అసలు విషయం బయటపడింది. డబ్బులు తీసుకొని అనర్హులకు పోస్టులు కట్టబెట్టిన వైనం వెలుగుచూసింది. ఒక్కో పోస్టు భర్తీ కోసం రూ.50వేల నుంచి రూ.1.50 లక్షల వరకు చేతులు మారినట్లు తెలిసింది. అలాగే అధికార పార్టీ నేతల సిఫార్సులు బాగా పనిచేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇలానే గతంలోనూ అధికారులు రెండు దఫాలు నోటిఫికేషన్లు ఇచ్చి ఎవరీకీ తెలియకుండానే ఖాళీ పోస్టులు భర్తీ చే శారు. మెరిట్ జాబితా ఇవ్వకుండా పోస్టులు భర్తీ చేయడంపై నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. జిల్లా కలెక్టర్ కలుగ చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మెరిట్ ప్రకారమే భర్తీ.. ఐసీడీఎస్ పీడీ విద్యావతి సెలవులో ఉండటంతో ఈ విషయమై సూపరింటెండెంట్ ఎలిజిబెత్‌ను సాక్షి వివరణ కోరింది. రెండు, మూడు సార్లు ఫైలు తిప్పి పంపాక మెరిట్ ప్రకారమే తయారు చేసిన జాబితాను కలెక్టర్ ఆమోదించారని ఆమె చెప్పారు. అసలు మెరిట్ లిస్ట్‌ను తయారు చేయలేదు కదా అని అడగ్గా ఇప్పుడు మెరిట్ జాబితాను నోటీసు బోర్డులో పెట్టమని క్లర్కు సుధాకర్‌కు చెబుతానన్నారు.జిల్లా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అభాగ్యులు, అనాథల కోసం నడిచే బాలసదన్ వసతిగృహాల్లో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తారనేందుకు మరో ఉదాహరణ ఇది. కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని నోటిఫికేషన్ ఇచ్చి డబ్బులిచ్చిన వారికి పోస్టులు కట్టబెట్టారు అధికారులు.. దీంతో అసలైన అర్హులు లబోదిబోమంటున్నారు. అంతా రహస్యంగా జరిగిన ఈ వ్యవహారం ప్రస్తుతం ఆశాఖలో చర్చనీయాంశంగా మారింది. -
నిరీక్షణకు తెర
రాయవరం :డీఎస్సీ (టెట్ కమ్ టీఆర్టీ-2014) అభ్యర్థులు ఎదురు చూస్తున్న రోజు ఎట్టకేలకు వచ్చింది. ఇటీవల మెరిట్ జాబితా విడుదలైనా సెలెక్షన్ జాబితాలో మాత్రం సందిగ్ధం నెలకొంది. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 5నే విడుదల కావలసిన సెలెక్షన్ జాబితా కోర్టు కేసుల కారణంగా జాప్యమైంది. దీంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఒక సందర్భంలో అసలు విడులవుతుందా అన్న సందేహమూ తలెత్తింది. ఎట్టకేలకు జాబితాను బుధవారం సాయంత్రం ప్రకటించడంతో అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా సెలెక్షన్ జాబితాను విద్యాశాఖాధికారులు కలెక్టర్ అనుమతితో ఎస్జీటీ, భాషా పండితుల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా, తాత్కాలిక నియామక పత్రాలను వెబ్సైట్లో ఉంచారు. ఎంపికైన అభ్యర్థుల సెల్ఫోన్లకు ఎస్ఎంఎస్లు కూడా పంపారు. వారికి తెలిపిన తేదీల్లో విద్యార్హత, ఇతర ధృవీకరణ పత్రాల పరిశీలన ఉంటుందని జిల్లా విద్యాశాఖాధికారి ఆర్.నరసింహారావు తెలిపారు. ఎస్జీటీ (తెలుగు), లాంగ్వేజ్ పండిట్ (తెలుగు), (హిందీ), (సంస్కృతం) కేటగిరీలకు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు అర్హత పొందిన అభ్యర్థుల జాబితాను www.deoeg.org నందు ఉంచినట్లు డీఈవో తెలిపారు. అర్హత పొందిన అభ్యర్థులు ఈ వెబ్సైట్ నుంచి కాల్ లెటర్స్ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. జాబితా, కాల్ లెటర్లో పేర్కొన్న తేదీలు, సమయం ప్రకారం అభ్యర్థులు కాకినాడ బాలాజీచెరువు వద్ద ఉన్న పీఆర్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు వ్యక్తిగతంగా హాజరు కావాలన్నారు. వారికి సంబంధించిన ధృవపత్రాల ఒరిజినల్స్, మూడు సెట్ల జిరాక్స్ కాపీలు (ఏ4 సైజు), ఒరిజినల్ సర్టిఫికేట్లను (జేపీఈజీ ఫార్మట్‌లో), 50కేబీ లోపు స్కాన్ చేసిన అభ్యర్థి ఫొటోను సీడీ/డీవీడీలో భద్రపర్చి వెరిఫికేషన్ సమయంలో ఏ4 సైజు బ్రౌన్ కలర్ కవర్లో ఉంచి ఇవ్వాలని సూచించారు. అప్లికేషన్ ప్రింట వుట్, ర్యాంక్ కార్డ్, పాత టీఈటీ మార్కుల జాబితా, కాల్ లెటర్, 10వ తరగతి మార్కుల జాబితా, అకడమిక్, ప్రొఫెషనల్ విద్యార్హతలకు సంబంధించి అప్లికేషన్లో పేర్కొన్న అన్ని ధృవపత్రాలు తీసుకు రావాలన్నారు. వీటితో పాటు స్టడీ(4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు) సర్టిఫికెట్లు, కుల, నివాస ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుందన్నారు. 748 ఎస్జీటీ పోస్టులకు 5,636 మంది దరఖాస్తు చేయగా, 4,391 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. ఇప్పుడు 703 మందిని ఎంపిక జాబితాలో ప్రకటించారు. అలాగే 135 లాంగ్వేజ్ పండిట్ పోస్టులకు 6,761 దరఖాస్తులు రాగా 6,025 మంది పరీక్ష రాశారు. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 12, 13, 14 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారం మార్చి 5న విధుల్లో చేరాల్సి ఉంటుంది. -
ఎంపీహెచ్ ఎంట్రన్స్ మెరిట్‌లిస్టు విడుదల
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో ఎంపీహెచ్ (మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్) కోర్సు చేసేందుకు అక్టోబర్ 18న నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల మెరిట్ లిస్టును డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ శనివారం విడుదల చేసింది. మెరిట్ లిస్టును యూనివర్సిటీ (హెచ్‌టీటీపీ://ఎన్టీఆర్యూహెచ్ఎస్.ఏపీ.ఎన్ఐసీ.ఇన్) వెబ్సైట్లో పొందవచ్చు. -
పోలీస్ పహారా నడుమ ఉపాధ్యాయుల పదోన్నతుల కౌన్సెలింగ్
ఖమ్మం, న్యూస్‌లైన్: రెండేళ్లుగా వాయిదా పడుతున్న గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ ఎట్టకేలకు ఆదివారం పోలీసు పహారా నడుమ కొనసాగింది. ముందుగా ఊహించిన విధంగానే కౌన్సెలింగ్‌ను అడ్డుకునేందుకు ఏజెన్సీ ప్రాంత గిరిజన ఉపాధ్యాయ సంఘాలు విఫల యత్నం చేశాయి. ఆయా సంఘాల నాయకు లు డీఈవో కార్యాలయంలోకి దూసుకెళ్లేం దుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని, అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం జిల్లాలోని వివిధ కేటగిరీల్లో ఎస్ఏ(స్కూల్ అసిస్టెంట్)లుగా పనిచేస్తున్న 38 మందికి గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. కాగా జిల్లాను యూనిట్‌గా పదోన్నతులు చేపట్టవద్దని, దీంతో గిరిజనులకు నష్టం జరుగుతుందని ఆరోపిస్తూ కౌన్సెలింగ్‌ను అడ్డుకుంటామని ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్, ఇతర గిరిజన ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరించా యి. ఈ క్రమం లో జిల్లా విద్యాశాఖ అధికారి కలెక్టర్‌ను ఆశ్రయించారు. ఆయన ఎస్పీతో మాట్లాడి డీఈవో కార్యాలయం ఎదుట బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌన్సెలింగ్ ప్రారంభం కాగానే గిరిజన ఉపాధ్యాయ సంఘాల నాయకులు డీఈవో కార్యాలయానికి చేరుకుని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కార్యాలయంలోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, ఉపాధ్యాయులకు తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో టీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామారావు, తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌నాయక్, ఆది వాసీ గిరిజన ఉపాధ్యాయ సంఘం నాయకులు రామారావులతోపాటు పలువురిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది. మెరిట్ లిస్ట్‌పై అభ్యంతరాలు జిల్లా విద్యాశాఖ అధికారులు తయారు చేసిన మెరిట్ లిస్టు గందరగోళంగా ఉందని, తక్కువ పాయింట్లు వచ్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువ పాయింట్లు ఉన్నవారిని విస్మరించారని ఉపాధ్యాయురాలు లక్ష్మీ సుజాత డీఈవోకు ఫిర్యాదు చేశారు. తనకంటే తక్కువ సీనియార్టి ఉన్న నాగేశ్వరరావును జాబితాలో ముందు ఉంచారని ప్రశ్నించారు. దీనిపై తర్జనభర్జన పడ్డ అధికారులు నాలుగో స్థానంలో నాగేశ్వరరావు పేరును 15వ స్థానానికి మార్చారు. జాబితా సరిచేసి కౌన్సెలింగ్ నిర్వహించారు. 38 మంది ఎస్‌ఏలకు గ్రేడ్-2 హెచ్ఎంలుగా పదోన్నతి స్కూల్ అసిస్టెంట్ స్థాయిలో పనిచేస్తున్న వివిధ కేటగిరీలకు చెందిన 38 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు గ్రేడ్-2 హెచ్ఎంలుగా పదోన్నతి కల్పించారు. జిల్లాలో ఖాళీగా ఉన్న 45 హెచ్ఎం పోస్టుల భర్తీకోసం ఉపాధ్యాయుల సీని యార్టి లిస్టును తయారుచేశారు. మొత్తం 70 మందితో కూడిన జాబితాను తయారు చేసి ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించగా ఏడుగురు ఉపాధ్యాయులు హాజరు కాలేదు. హాజరైన 38 మందికి కౌన్సెలింగ్ నిర్వహించి వారు కోరుకున్న పాఠశాలకు పదోన్నతిపై బదిలీ చేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. 58 మంది ఉపాధ్యాయుల బైండోవర్ ఖమ్మం క్రైం: కౌనెల్సింగ్‌ను అడ్డుకునేందుకు యత్నించిన ఉపాధ్యాయులను త్రీటౌన్ పోలీసులు బైండోవర్ చేశారు. ఆందోళన చేస్తున్న 58 మంది ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకుని అర్బన్ తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు పోలీసులు తెలిపారు.