రాయవరం :డీఎస్సీ (టెట్ కమ్ టీఆర్టీ-2014) అభ్యర్థులు ఎదురు చూస్తున్న రోజు ఎట్టకేలకు వచ్చింది. ఇటీవల మెరిట్ జాబితా విడుదలైనా సెలెక్షన్ జాబితాలో మాత్రం సందిగ్ధం నెలకొంది. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 5నే విడుదల కావలసిన సెలెక్షన్ జాబితా కోర్టు కేసుల కారణంగా జాప్యమైంది. దీంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఒక సందర్భంలో అసలు విడులవుతుందా అన్న సందేహమూ తలెత్తింది. ఎట్టకేలకు జాబితాను బుధవారం సాయంత్రం ప్రకటించడంతో అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా సెలెక్షన్ జాబితాను విద్యాశాఖాధికారులు కలెక్టర్ అనుమతితో ఎస్జీటీ, భాషా పండితుల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా, తాత్కాలిక నియామక పత్రాలను వెబ్‌సైట్‌లో ఉంచారు. ఎంపికైన అభ్యర్థుల సెల్‌ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌లు కూడా పంపారు. వారికి తెలిపిన తేదీల్లో విద్యార్హత, ఇతర ధృవీకరణ పత్రాల పరిశీలన ఉంటుందని జిల్లా విద్యాశాఖాధికారి ఆర్.నరసింహారావు తెలిపారు. ఎస్జీటీ
(తెలుగు), లాంగ్వేజ్ పండిట్
(తెలుగు), (హిందీ), (సంస్కృతం) కేటగిరీలకు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు అర్హత పొందిన అభ్యర్థుల జాబితాను www.deoeg.org నందు ఉంచినట్లు డీఈవో తెలిపారు. అర్హత పొందిన అభ్యర్థులు ఈ వెబ్‌సైట్ నుంచి కాల్ లెటర్స్ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. జాబితా, కాల్ లెటర్‌లో పేర్కొన్న తేదీలు, సమయం ప్రకారం అభ్యర్థులు కాకినాడ బాలాజీచెరువు వద్ద ఉన్న పీఆర్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు వ్యక్తిగతంగా హాజరు కావాలన్నారు. వారికి సంబంధించిన ధృవపత్రాల ఒరిజినల్స్, మూడు సెట్ల జిరాక్స్ కాపీలు (ఏ4 సైజు), ఒరిజినల్ సర్టిఫికేట్లను (జేపీఈజీ ఫార్మట్‌లో), 50కేబీ లోపు స్కాన్ చేసిన అభ్యర్థి ఫొటోను సీడీ/డీవీడీలో భద్రపర్చి వెరిఫికేషన్ సమయంలో ఏ4 సైజు బ్రౌన్ కలర్ కవర్లో ఉంచి ఇవ్వాలని సూచించారు.
అప్లికేషన్ ప్రింట వుట్, ర్యాంక్ కార్డ్, పాత టీఈటీ మార్కుల జాబితా, కాల్ లెటర్, 10వ తరగతి మార్కుల జాబితా, అకడమిక్, ప్రొఫెషనల్ విద్యార్హతలకు సంబంధించి అప్లికేషన్‌లో పేర్కొన్న అన్ని ధృవపత్రాలు తీసుకు రావాలన్నారు. వీటితో పాటు స్టడీ(4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు) సర్టిఫికెట్లు, కుల, నివాస ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుందన్నారు.
748 ఎస్‌జీటీ పోస్టులకు 5,636 మంది దరఖాస్తు చేయగా, 4,391 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. ఇప్పుడు 703 మందిని ఎంపిక జాబితాలో ప్రకటించారు. అలాగే 135 లాంగ్వేజ్ పండిట్ పోస్టులకు 6,761 దరఖాస్తులు రాగా 6,025 మంది పరీక్ష రాశారు. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 12, 13, 14 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారం మార్చి 5న విధుల్లో చేరాల్సి ఉంటుంది.
నిరీక్షణకు తెర
Published Thu, Feb 11 2016 12:37 AM | Last Updated on Sun, Sep 3 2017 5:22 PM
Advertisement