ఖమ్మం, న్యూస్‌లైన్: రెండేళ్లుగా వాయిదా పడుతున్న గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ ఎట్టకేలకు ఆదివారం పోలీసు పహారా నడుమ కొనసాగింది. ముందుగా ఊహించిన విధంగానే కౌన్సెలింగ్‌ను అడ్డుకునేందుకు ఏజెన్సీ ప్రాంత గిరిజన ఉపాధ్యాయ సంఘాలు విఫల యత్నం చేశాయి. ఆయా సంఘాల నాయకు లు డీఈవో కార్యాలయంలోకి దూసుకెళ్లేం దుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని, అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం జిల్లాలోని వివిధ కేటగిరీల్లో ఎస్‌ఏ(స్కూల్ అసిస్టెంట్)లుగా పనిచేస్తున్న 38 మందికి గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించారు.
హైకోర్టు ఆదేశాల మేరకు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. కాగా జిల్లాను యూనిట్‌గా పదోన్నతులు చేపట్టవద్దని, దీంతో గిరిజనులకు నష్టం జరుగుతుందని ఆరోపిస్తూ కౌన్సెలింగ్‌ను అడ్డుకుంటామని ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్, ఇతర గిరిజన ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరించా యి. ఈ క్రమం లో జిల్లా విద్యాశాఖ అధికారి కలెక్టర్‌ను ఆశ్రయించారు. ఆయన ఎస్పీతో మాట్లాడి డీఈవో కార్యాలయం ఎదుట బందోబస్తు ఏర్పాటు చేశారు.
కౌన్సెలింగ్ ప్రారంభం కాగానే గిరిజన ఉపాధ్యాయ సంఘాల నాయకులు డీఈవో కార్యాలయానికి చేరుకుని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కార్యాలయంలోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, ఉపాధ్యాయులకు తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో టీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామారావు, తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌నాయక్, ఆది వాసీ గిరిజన ఉపాధ్యాయ సంఘం నాయకులు రామారావులతోపాటు పలువురిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది.
మెరిట్ లిస్ట్‌పై అభ్యంతరాలు
జిల్లా విద్యాశాఖ అధికారులు తయారు చేసిన మెరిట్ లిస్టు గందరగోళంగా ఉందని, తక్కువ పాయింట్లు వచ్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువ పాయింట్లు ఉన్నవారిని విస్మరించారని ఉపాధ్యాయురాలు లక్ష్మీ సుజాత డీఈవోకు ఫిర్యాదు చేశారు. తనకంటే తక్కువ సీనియార్టి ఉన్న నాగేశ్వరరావును జాబితాలో ముందు ఉంచారని ప్రశ్నించారు. దీనిపై తర్జనభర్జన పడ్డ అధికారులు నాలుగో స్థానంలో నాగేశ్వరరావు పేరును 15వ స్థానానికి మార్చారు. జాబితా సరిచేసి కౌన్సెలింగ్ నిర్వహించారు.
38 మంది ఎస్‌ఏలకు గ్రేడ్-2 హెచ్‌ఎంలుగా పదోన్నతి
స్కూల్ అసిస్టెంట్ స్థాయిలో పనిచేస్తున్న వివిధ కేటగిరీలకు చెందిన 38 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు గ్రేడ్-2 హెచ్‌ఎంలుగా పదోన్నతి కల్పించారు. జిల్లాలో ఖాళీగా ఉన్న 45 హెచ్‌ఎం పోస్టుల భర్తీకోసం ఉపాధ్యాయుల సీని యార్టి లిస్టును తయారుచేశారు. మొత్తం 70 మందితో కూడిన జాబితాను తయారు చేసి ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించగా ఏడుగురు ఉపాధ్యాయులు హాజరు కాలేదు. హాజరైన 38 మందికి కౌన్సెలింగ్ నిర్వహించి వారు కోరుకున్న పాఠశాలకు పదోన్నతిపై బదిలీ చేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.
58 మంది ఉపాధ్యాయుల బైండోవర్
ఖమ్మం క్రైం: కౌనెల్సింగ్‌ను అడ్డుకునేందుకు యత్నించిన ఉపాధ్యాయులను త్రీటౌన్ పోలీసులు బైండోవర్ చేశారు. ఆందోళన చేస్తున్న 58 మంది ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకుని అర్బన్ తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీస్ పహారా నడుమ ఉపాధ్యాయుల పదోన్నతుల కౌన్సెలింగ్
Published Mon, Apr 14 2014 3:15 AM | Last Updated on Sat, Sep 2 2017 5:59 AM
Advertisement
Advertisement