సాక్షి, హైదరాబాద్: డీఎస్సీ–2008 అభ్యర్థులను ఎస్‌జీటీలుగా నియమించే అంశాన్ని పునఃపరిశీలించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. నాటి డీఎస్సీ మెరిట్ జాబితా ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలోని ఈ సమస్యకు ఏపీ సర్కార్ కొంత ఉపశమన నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడింది. అయితే తెలంగాణలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం సరికాదని వ్యాఖ్యానించింది. 2008– డీఎస్సీ నోటిఫికేషన్‌లో తమ కంటే తక్కువ అర్హత ఉన్న డీఎడ్ అభ్యర్థులకు 30 శాతం ఎస్‌జీటీ పోస్టులను రిజర్వు చేయడాన్ని వ్యతిరేకిస్తూ బీఎడ్ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్లపై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీ, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. ఒకే రకమైన పోస్టులకు అర్హత ఎక్కువున్న వారిని కాదని.. తక్కువ ఉన్న వారిని నియమించడం చట్టప్రకారం సరికాదని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదించారు. ‘ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలు చేసేటప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4)కు లోబడి క్లాసిఫికేషన్ చేయాలిగానీ.. ఇష్టం వచ్చి నట్లు నిర్ణయం తీసుకోవడం చెల్లదు. ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ–2008 బీఎడ్ అభ్యర్థుల విషయంలో ఆ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది.
వారికి 60 ఏళ్లు వచ్చే వరకు కాంట్రాక్టు ఉద్యోగాల్లో కొనసాగిస్తామని హామీ ఇవ్వడమే కాకుండా అమలు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కారణంగానే వివాదం ఏళ్లుగా కొనసాగుతోంది. కనీసం ఖాళీగా ఉన్న పోస్టుల్లో నాటి బీఎడ్ అభ్యర్థులను నియమిస్తే అందరికీ ఉపశమనం లభిస్తుంది’అని పేర్కొ న్నారు. ఏపీ ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది గోవింద్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘ఏపీ ప్రభుత్వం సంక్షేమ రాష్ట్రం. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమే ఏ నిర్ణయమైనా తీసుకుంటుంది.
ఇందులో భాగంగానే మానవతా ధృక్పథంతో అలోచించి అర్హులైన డీఎస్సీ 2008 అభ్యర్థులను కాంట్రాక్టు ఉద్యోగులుగా నియమించింది’అని నివేదించారు. వాదనలు విన్న ధర్మాసనం.. బీఎడ్ అభ్యర్థులను ఉద్యోగాల్లో నియమించే అంశాన్ని పునః పరిశీలించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, విచారణను 6 వారాలకు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment