
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 2020 జనవరి నుంచి భర్తీ చేసే ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి కేవలం రాత పరీక్షలలో మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేయనుంది.
ఏపీపీఎస్సీపై సీఎం జగన్ సమీక్ష
కాగా అంతకు ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్‌పై సమీక్ష నిర్వహించారు. ప్రతి ఏడాది జనవరిలో ఉద్యోగాల భర్తీపై క్యాలెండర్ రూపొందించాలని అధికారులకు సూచనలు చేశారు. అత్యంత పారదర్శకంగా ఏపీపీఎస్సీ ఉద్యోగాలు భర్తీ చేయాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి పరీక్షలో ఐఐటీ, ఐఐఎం భాగస్వామ్యం అయ్యేలా ఆలోచన చేయాలని అన్నారు. అలాగే అత్యవసర సర్వీసులు అందిస్తున్న విభాగాల్లో పోస్టుల భర్తీకి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి నోటిఫికేషన్ కోర్టు కేసులకు దారి తీస్తుందని అధికారులు చెప్పగా, ఇకపై అలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచనలు చేశారు. కాగా ఉద్యోగ నియామకాల్లో మరింత పాదర్శకత దిశగా సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి సీతారామాంజనేయులు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ మేరకు జనవరిలో కొత్త నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏపీపీఎస్సీ సన్నాహాలు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment