విజయనగరం అర్బన్ : జిల్లాలో ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి సంబంధించి డీఎస్సీ–2018కు ఎట్టకేలకు మోక్షం లభిం చింది. ఏటా డీఎస్సీ చేపడతామని హామీ ఇచ్చిన గత ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క నియామకం చేపట్టకుండా గతేడాది కంటితుడుపుగా కేవలం 377 పోస్టులను జిల్లాకు కేటాయిస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. వాస్తవానికి ఎన్నికల ముందే వాటిని భర్తీ చేసే అవకాశం ఉన్నా దానిని పక్కన పెట్టేశారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించాక నెలరోజుల్లోనే వీటి నియామకాలపై దృష్టి పెట్టి హామీ నిలబెట్టుకుంటున్నారు.
జిల్లాలో వచ్చే 17 నుంచి భర్తీ ప్రక్రియ ప్రారంభం
ఎన్నికల ముందు నిర్వహించి విడుదల చేసిన డీఎస్సీ ఫలితాల మెరిట్ జాబితాను ప్రామాణికంగా తీసుకొని పోస్టుల భర్తీకి నూతన ప్రభుత్వం అనుమతించింది. దీనిపై విద్యాశాఖ డీఎస్సీ ఎంపిక ప్రాథమిక షెడ్యూల్‌ని విడుదల చేసింది. ఈ క్రమంలో తొలుత జోన్ పరిధిలో ఉన్న మోడల్ స్కూల్, ఏపీ బీసీ సంక్షేమ పాఠశాలల్లో వివిధ కేటగిరీ పోస్టులను భర్తీ చేయనున్నారు. జిల్లా పరిధిలోని వివిధ యాజమాన్యాల పరిధిలో 623కు పైగా ఉపాధ్యాయ పోస్టులుండగా నాలుగేళ్లలో పలుమార్లు కుదించిన తరువాత చివరికి 377 పోస్టులకు ఖాయం చేశారు. జిల్లా పరిధిలోని ఈ పోస్టులకు జూలై 17 నుంచి నియామక ప్రక్రియ ప్రారంభిస్తారు. తొలిరోజున అన్ని రకాల స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టుల అభ్యర్థుల ఎంపిక జాబితాను ప్రకటిస్తారు. జాబితాలోని అభ్యర్థుల విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను 20, 21 తేదీల్లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అగస్టు 1న తుది జాబితా ప్రకటన వెలువడుతుంది. అదే నెల 2, 3న వెబ్ ఆప్షన్లు, 5న పోస్టింగ్ ఆర్డర్లు ఇస్తారు. ఆ తరువాత సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు ఆగస్టు 2 నుంచి నిర్వహించి సెప్టెంబర్ 4న పోస్టింగ్ ఆర్డర్లు జారీ చేస్తారు.
జిల్లాలో భర్తీ కానున్న పోస్టులు 377
జిల్లాలోని వివిధ యాజమాన్యాల పాఠశాలల్లో వివిధ కేటగిరీకి చెందిన 377 పోస్టులున్నాయి. వాటిలో సెకెండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు–186, స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టులు–98, భాషా పండిత టీచర్ పోస్టులు–58, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు–23, క్రాఫ్ట్–5, సంగీతం–5, ఆర్ట్–1 ఉన్నాయి. వివిధ కేటగిరీకి చెందిన 81 పోస్టుల భర్తీ ప్రక్రియ వాయిదా వేశారు. కోర్టులో కేసులున్న నేపథ్యంలో తెలుగు, హిందీ భాషా పండితులు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ హిందీకి చెందిన 58 పోస్టులు, పీఈటీ పోస్టులు 23 నియామకాలు ప్రస్తుతం చేపట్టడంలేదు.
జిల్లా విద్యాశాఖ సిబ్బంది హవాకు చెక్
ఆన్‌లైన్ విధానం వల్ల కౌన్సెలింగ్ ప్రక్రియలో జిల్లా విద్యాశాఖ సిబ్బంది హవాకు చెక్ పడినట్టయింది. ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియలో నూతన ఒరవడిని తీసుకొచ్చారు. ధ్రువపత్రాల పరిశీలనలో భాగంగా వాటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసుకోవాలి. అయితే అభ్యర్థులు దరఖాస్తులతో పెట్టుకున్న విద్యార్హత, తదితర ధ్రువపత్రాలకు సరిపోవాలి. గతంలోనూ ఇదే ప్రక్రియ ఉండేది. ఎలాంటి తేడా వచ్చినా సరిచేయడానికిగాని, తిరిగి జతచేయడానికిగాని అవకాశం ఇచ్చే అధికారం జిల్లా స్థాయి విద్యాధికారులకు ఉండేది. ప్రస్తుతం ఆ విధానానికి చెక్ చెప్పారు. తొలి దరఖాస్తుతో జత చేసిన ధ్రువపత్రాలకు ప్రస్తుత ఒరిజినల్ పత్రాల్లో ఎలాంటి తేడా ఉన్నా రిజక్ట్ చేస్తారు. వాటిని సవరించాలంటే రాష్ట్రస్థాయి అధికారిని వేడుకోవడంగాని, కోర్టులను ఆశ్రయించడంగాని చేయాల్సిందే. ఇలాంటి సవరణ అంశాలలోనే జిల్లా విద్యాశాఖలో కొందరు ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవహరించేవారు. కొన్ని సందర్భాల్లో రోస్టర్ విధానాన్ని తప్పుతోవ పట్టించి ప్రతిభగల అభ్యర్థులకు అన్యాయం జరిగిన సంఘటనలు గతంలో కొన్ని ఉన్నాయి. వారిలో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రంచిన వారు ఉన్నారు. ప్రస్తుత విధానంలో అవకాశం లేకపోవడంతో స్థానికంగా జిల్లా విద్యాశాఖ పరిధిలోని పరిశీలన సిబ్బంది హవాకు చెక్ పెట్టినట్లయింది.
మోడల్ స్కూల్, గురుకుల పాఠశాల పోస్టులు:
ఈ సారి ఉపాధ్యాయుల నియామక పరీక్ష(టీఆర్‌టీ)లో డీఎస్సీతో పాటు జోన్ పరిధిలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్, గురుకుల పాఠశాల బోధన సిబ్బందికి పోటీ పరీక్ష కూడా తొలిసారిగా విద్యాశాఖ నిర్వహిస్తోంది.
విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం పరిధిలోని జోన్–1లో ఏపీమోడల్ స్కూళ్లలోని ఖాళీగా ఉన్న 214 పోస్టులను భర్తీ చేస్తోంది. ఇందులో టీజీటీలు 108, పీజీటీలు 106 ఉండగా రాష్ట్ర పరిధిలోని ప్రిన్సిపాల్ పోస్టులు 77 ఉన్నాయి. ఏపీగురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 175 పోస్టులను భర్తీ చేయనున్నారు. వాటిలో టీజీటీలు 93, పీజీటీలు 60, పీటీటీలు 22 ఉన్నాయి. బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 91 పోస్టులను భర్తీ చేస్తుండగా వాటిలో టీజీటీలు 38, పీజీటీలు 34, పీఈటీలు 9, క్రాఫ్ట్ 3, ఆర్ట్ 4, మ్యూజిక్ 3 పోస్టులు ఉన్నాయని డీఈఓ జి.నాగమణి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment