హైదరాబాద్: పోలీసు కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలు జరిగాయంటూ హైకోర్టులో మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. నల్గొండ జిల్లాకు చెందిన టి.వీరభద్రం మరో ఇద్దరు దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ, కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని తెలిపారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను అనుసరించలేదన్నారు.
అంతేకాక వాహన లైసెన్స్ ఉన్న వారికి ఇచ్చే గ్రేస్ మార్కుల విషయంలో అతకతవకలు జరిగాయని తెలిపారు. లైట్ మోటారు వెహికల్ (ఎల్‌ఎంవీ) లైసెన్సు ఉన్న వారికి 3 నుంచి 5 వరకు గ్రేస్ మార్కులున్నాయని, అయితే ద్విచక్ర వాహన లైసెన్స్ ఉన్న వారికీ కూడా గ్రేస్ మార్కులు ఇచ్చారని వివరించారు. ఇటువంటి అవకతవకలతో మెరిట్ జాబితాను తయారు చేశారన్నారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా రచనారెడ్డి జోక్యం చేసుకుంటూ పరోక్షంగా మధ్యంతర ఉత్తర్వుల కోసం అభ్యర్థించారు. దీనిని అర్థం చేసుకున్న ధర్మాసనం, ఇప్పటికే ఇదే అంశంపై పిల్ దాఖలైందని తెలిపింది. ఆ వ్యాజ్యంలో ప్రతీ అభ్యర్థి నియామకపు ఉత్తర్వుల్లో వారి నియామకం కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేశామంది. కాబట్టి కోర్టుకొచ్చిన అభ్యర్థుల ప్రయోజనాలకు పూర్తి రక్షణ ఉందని తెలిపింది. ఒకవేళ తుది విచారణ సమయంలో ఈ నియామకాల్లో పిటిషనర్లు ఆరోపించినట్లు అక్రమాలు, అవకతవకలు జరిగినట్లు తేలితే మొత్తం ప్రక్రియను రద్దు చేస్తామని తేల్చి చెప్పింది. ఈ వ్యాజ్యాన్ని కూడా పాత వ్యాజ్యంతో జత చేస్తూ విచారణను వాయిదా వేసింది.
పోలీసు కానిస్టేబుళ్ల నియామకంపై మరో పిల్
Published Tue, Mar 28 2017 7:46 PM | Last Updated on Tue, Mar 19 2019 6:01 PM
Advertisement