ఈ ఏడాదే 16,392 టీచర్‌ పోస్టుల భర్తీ | teacher will be fulfilled in telangana, says kadiyam srihari | Sakshi
Sakshi News home page

ఈ ఏడాదే 16,392 టీచర్‌ పోస్టుల భర్తీ

Published Fri, Mar 24 2017 2:20 AM | Last Updated on Sat, Aug 11 2018 6:42 PM

ఈ ఏడాదే 16,392 టీచర్‌ పోస్టుల భర్తీ - Sakshi

ఈ ఏడాదే 16,392 టీచర్‌ పోస్టుల భర్తీ

జూన్‌ నుంచి ప్రతి ప్రభుత్వ బడిలో టాయిలెట్లు
బాలబాలికలకు వేర్వేరుగా కనీసం ఒక్కోటి ఏర్పాటు
కచ్చితంగా నీటి వసతి, విద్యుత్‌ సౌకర్యం
స్కూళ్లలో మౌలిక వసతుల కోసం రూ. 2,682 కోట్లు
5,600 బడుల్లో డిజిటల్‌ తరగతులు
కొత్తగా 5,400 స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం
బడులు తెరిచేలోపే పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు
ఇంటర్‌ విద్యార్థులకూ మధ్యాహ్న భోజనం
‘కార్పొరేట్‌’కు కళ్లెం వేసేందుకు ఆన్‌లైన్‌ ప్రవేశాలు చేపడుతున్నట్లు శాసనసభలో వెల్లడి  


సాక్షి, హైదరాబాద్‌
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో ఈ ఏడాదే 16,392 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శాసనసభలో ప్రకటించారు. అందులో సాధారణ పాఠశాలలకు సంబంధించి 8,792 పోస్టులు, గురుకులాలకు సంబంధించి 7,600 పోస్టులు ఉన్నాయని తెలిపారు. వీటి భర్తీ కోసం నోటిఫికేషన్‌ జారీ చేయాల్సిందిగా ఇప్పటికే రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)ను ఆదేశించినట్లు చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేదిశలో కీలక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో కాంగ్రెస్‌ సభ్యులు వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ ప్రశ్నలకు సమాధానంగాను, విద్యా శాఖ పద్దుపై మాట్లాడిన సమయంలోనూ కడియం ఈ వివరాలను వెల్లడించారు. ఇటీవలే 8 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చామని.. కానీ అర్హతల విషయంలో అభ్యర్థుల విన్నపం మేరకు దానిని నిలిపివేశామని చెప్పారు.

మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం
ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడా టీచర్లుండరని, పాఠాలు సరిగా చెప్పరని, తగిన వసతులు ఉండవనే ఉద్దేశంతో పేదలు కూడా ప్రైవేటు బడులవైపే మొగ్గుచూపుతున్నారని.. ఈ దుస్థితిని మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందని కడియం తెలిపారు. అందులో భాగంగా జూన్‌ 15 నుంచే ప్రతి ప్రభుత్వ పాఠశాలలో బాల, బాలికలకు వేర్వేరుగా.. కనీసం ఒక్కోటి చొప్పున టాయిలెట్లు అందుబాటులోకి తెస్తామని, వాటిలో తప్పనిసరిగా నీటి వసతి, నిర్వహణ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. విద్యుత్, నీళ్లు, మరుగుదొడ్లు, ఫర్నీచర్‌ తదితర మౌలిక వసతుల కల్పనకు వీలుగా ఈసారి బడ్జెట్‌లో రూ.2,682 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. తొలుత అన్ని ఉన్నత పాఠశాలల్లో విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇక జూన్‌ 15 నుంచి 5,600 ఉన్నత పాఠశాలల్లో డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో 3వ తరగతి స్థాయిలో ప్రమాణాలు పెరిగాయన్నారు.

వెంటనే పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు
పాఠశాలలు ప్రారంభమయ్యేనాటికల్లా పాఠ్యపుస్తాకాలు, యూనిఫారాల సరఫరా చేయాలని నిర్ణయించామని కడియం వెల్లడించారు. మార్చి 21 నాటికే పాఠ్యపుస్తకాలు పంపామని, జూన్‌ 15 కల్లా యూనిఫారాలు సరఫరా అవుతాయని చెప్పారు. మరోవైపు ఇప్పటికే 5,400 ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించగా... ఈ సంవత్సరం మరో 5 వేల పాఠశాలల్లో ప్రారంభిస్తామని తెలిపారు. వాటిల్లో వచ్చే ఫలితాల ఆధారంగా అన్ని పాఠశాలలకు ఇంగ్లిషు మీడియాన్ని విస్తరిస్తామని ప్రకటించారు. ఇక ప్రభుత్వ స్కూళ్లలో గతంలో బోగస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ ఉండేదని.. దాన్ని అరికట్టేందుకు ఆధార్‌తో అనుసంధానించామని తెలిపారు. ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం లక్ష చొప్పున విద్యార్థుల సంఖ్య తగ్గేదని, ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల దాన్ని 50 వేలకు తగ్గించామని ప్రకటించారు. బడిబాట మొదటి విడత కార్యక్రమాన్ని ఏప్రిల్‌లో, రెండో విడతను జూన్‌లో నిర్వహించాలని నిర్ణయించామన్నారు. 2017–18 నుంచి అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక స్కూళ్ల పరిధిలోకి తెచ్చి ప్లేస్కూళ్లుగా తయారుచేస్తామన్నారు.

ఇంటర్‌ విద్యార్థులకూ భోజనం
ఈ ఏడాది నుంచే ఇంటర్‌ విద్యార్థులకు కూడా మధ్యాహ్నం భోజన పథకాన్ని అమలు చేసే యోచనలో ఉన్నామని కడియం తెలిపారు. వారికి ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందిస్తున్నామని చెప్పారు. ఈ సంవత్సరం నుంచే ఇంటర్‌లో ఆన్‌లైన్‌ అడ్మిషన్లు మొదలుపెడతామని.. దాంతో కార్పొరేట్‌ కళాశాలల దూకుడుకు కళ్లెం పడుతుందని పేర్కొన్నారు. కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్‌ చేసే చర్యలు ప్రారంభించగా.. కొందరు కోర్టుకెళ్లటంతో బ్రేక్‌ పడిందని చెప్పారు. ఆ కేసు వేసినవారు కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉన్నట్టు తెలిసిందని, వారు కేసు వెనక్కు తీసుకునేలా చూడాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కడియం కోరారు. అయితే కేసు వేసినవారికి కాంగ్రెస్‌తో సంబంధం లేదని ఉత్తమ్‌ ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు.

కేంద్ర నిధులు వచ్చేలా చూడాలి
డిగ్రీ కళాశాలల్లో ఇప్పటికే ఆన్‌లైన్‌ ప్రవేశాలు ప్రారంభించామని, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు మొదలుపెట్టామని కడియం తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి ఒక మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటుకు సీఎం నిర్ణయించారన్నారు. ఉస్మానియా వర్సిటీ దేశంలో వందేళ్ల ఉత్సవాన్ని జరుపుకొంటున్న ఏడో విశ్వవిద్యాలయమని, ఇందుకు కేంద్రం నిధులు విడుదల చేసేలా బీజేపీ సభ్యులు ప్రయత్నించాలని కోరారు. కస్తూర్బా విద్యాలయాలు మంజూరయ్యేలా ప్రయత్నించాలని విజ్ఞప్తి చేశారు. పాఠశాలల అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు సీడీఎఫ్‌ నుంచి నిధులు కేటాయిస్తే దానికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్‌ నిధులు కేటాయిస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement