సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లో ప్రస్తుతం భర్తీ చేసే ఉపాధ్యాయ పోస్టులే కాకుండా మరో ఎనిమిది వేల పోస్టుల భర్తీకి వచ్చే ఏడాది నోటిఫికేషన్ ఇస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. శాసనసభలో గురువారం ప్రశ్నోత్తరాలలో విద్యా శాఖపై ఆయన వివరణ ఇస్తూ.. రాష్ట్రంలో మొత్తం 1,22,955 ఉపాధ్యాయ పోస్టులు ఉండగా వాటిలో 1,09,256 పోస్టుల్లో ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని, 13,699 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు.
పదోన్నతితో భర్తీ చేసే పోస్టులను మినహాయించి 8,792 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌కు హైకోర్టు ఆమోదం తెలిపిందన్నారు. ఈ నోటిఫికేషన్‌ను ఎందుకు ఆపలేకపోయామని కాంగ్రెస్ మధన పడుతోందన్నారు. ప్రభుత్వం కొత్తగా 544 గురుకులాలు ప్రారంభించిందని, పాఠశాలల్లో అధిక ఫీజుల నియంత్రణ కోసం ప్రొఫెసర్ తిరుపతిరావు అధ్యక్షతన కమిటీ వేశామన్నారు. ఈ నెలాఖరులో కమిటీ ఇచ్చే నివేదికను బట్టి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు.
బయ్యారంలో పరిశ్రమపై చిత్తశుద్ధితో ఉన్నాం: కేటీఆర్
బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అదే ప్రాంతంలో ఖనిజ నిల్వలు ఉండాలనే నిబంధన ఏమీ లేదు.
విశాఖపట్టణం సమీపంలో ఎక్కడా ఇనుప ఖనిజం లేదు. అయినా అప్పటి పరిస్థితుల్లో అక్కడ ఏర్పాటు చేశారు. 2018 మార్చిలోపు నివేదిక వస్తుంది. దీన్ని సభ ముందు పెడతాం. బయ్యారంలో భారత ప్రభుత్వరంగ సంస్థ సెయిల్ ఆధ్వర్యంలోనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment