జిల్లాల ఏర్పాటు వల్లే పోస్టులు ఆలస్యం
⇒ హేతుబద్ధీకరణ తరువాత టీచర్ల నియామకాలు - కడియం
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తయిన నేపథ్యంలో టీచర్ల హేతుబద్దీకరణపై దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సూచించారు. ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని, ఎన్ని పాఠశాలలు అవసరం, ఉపాధ్యాయ పోస్టులు ఎన్ని కావాలన్న అంశాలపై స్పష్టత వస్తుందన్నారు. మొత్తానికి వచ్చే జూన్‌లో స్కూళ్లు తెరిచేనాటికి పాఠశాలల్లో టీచర్లు ఉండేలా నియామకాలు పూర్తి చేస్తామని చెప్పారు. 10 వేలకు పైగా పోస్టులకు కేబినెట్ గతంలోనే ఆమోదం తెలిపినా కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో నియామకాలు ఆపామన్నారు. పాఠశాలలు, వాటిలో విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య ప్రకారం హేతుబద్దీకరణకు సంబంధించిన అన్ని ప్రణాళికలను 15 రోజుల్లోగా సిద్ధం చేసుకొని తమకు పంపించాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య డీఈవోలకు సూచించారు.
కొత్త జిలాల్లో నియమితులైన డీఈవోలు, అసిస్టెంట్ డెరైక్టర్లు, ఆర్జేడీలకు మూడు రోజుల పాటు నిర్వహించతలపెట్టిన అవగాహన కార్యక్రమాలను ఆదివారం హైదరాబాద్‌లో కడియం శ్రీహరి ప్రారంభించారు. ప్రభుత్వ, జిల్లాపరిషత్తు పాఠశాలలల్లో టీచర్ల నియామకాల్లో వెయిటేజీ ఉంటుందన్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభించిన 250 గురుకులాలు, వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభించనున్న మరో 119 బీసీ, 90 మైనారిటీ గురుకులాల్లో మొత్తంగా 12వేల వరకు పోస్టుల్లో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఎక్కడెక్కడ టీచర్లు అవసరమో డెరైక్టరేట్‌కు రాస్తే 24 గంటల్లో విద్యా వలంటీర్ల నియామకాలకు అనుమతిస్తామన్నారు.
పాఠశాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. కోటి చొప్పున ఇచ్చేందుకు 40 మంది ఎమ్మెల్యేలు ముందుకువచ్చారని, మిగితా వారికి లేఖలు రాస్తామన్నారు. 100 శాతం సిలబస్ పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రైవేటు స్కూళ్లకు నోటీసులు ఇవ్వడం.. వారు కలిసి కవర్లు ఇవ్వగానే అన్ని బాగున్నాయని సర్టిఫై చేయడం వంటివి మానుకోవాలన్నారు. ఏకీకృత సర్వీసు రూల్స్ అంశం కొలిక్కి వచ్చిన వెంటనే రెగ్యులర్ డిప్యుటీఈవో, ఎంఈవో, డైట్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఇతర జిల్లాలకు వెళ్లిన టీచర్లకు అప్షన్ ఇస్తామని, ఈ విద్యా సంవత్సరంలో 5 వేల ఇంగ్లిషు మీడియం స్కూళ్లు ప్రారంభించామని, వచ్చే ఏడాది మరో 5 వేల స్కూళ్లు ప్రారంభిస్తామన్నారు.