17 వేల టీచర్ పోస్టుల భర్తీ: కడియం
17 వేల టీచర్ పోస్టుల భర్తీ: కడియం
Published Thu, Mar 23 2017 1:02 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీ హరి స్పష్టం చేశారు. విద్యారంగంలో 2014తో పోల్చుకుంటే 7 శాతం మెరుగుదల వచ్చిందన్నారు. గురువారం ఉదయం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు కడియం సమాధానమిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడ్డాయని, ఇతర రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణ గణనీయమైన వృద్ధి సాధించిందని కడియం తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రాథమిక పాఠశాలల్లోనే ప్లే స్కూల్స్, అంగన్‌వాడీలను ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.
రెండేళ్లలోనే 529 గురుకులాలను ప్రారంభించగా, అందులో 300 పాఠశాలలు బాలికల కోసం కేటాయించినట్లు వెల్లడించారు. ప్రతీ రెవెన్యూ డివిజన్‌కు మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయమని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్‌లో జరిగే రిక్రూట్ మెంట్ కాకుండా 8,972 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు కడియం వెల్లడించారు. రెసిడెన్షియల్, రెగ్యులర్ స్కూళ్లు కలిపి ఈ ఏడాది 17వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు చెప్పారు.
Advertisement