
సాక్షి, మచిలీపట్నం : పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో విద్యాశాఖాధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, గిరిజన సంక్షేమ విభాగాల్లో మొత్తం 222 పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా అధికారులు లెక్క తేల్చారు. కోర్టు కేసుల నేపథ్యంలో స్కూల్ అసిస్టెంట్ కేడర్ గల తెలుగు, హిందీ, సంస్కృతం, పీఈటీ పోస్టులు మొత్తం 43 ఖాళీలు ఉండగా, ప్రస్తుతానికి వీటిని భర్తీ చేయడం లేదు. మిగిలిన 179 పోస్టుల్లో అర్హులైన వారిని ఎంపిక చేసి, నియామక పత్రాలను అందజేసేందుకు విద్యాశాఖాధికారులు దృష్టి సారించారు.
2018 డీఎస్సీ ఫలితాల మేరకు అర్హులైన అభ్యర్థులను ఉపాధ్యాయులుగా నియమించనున్నారు. ఉపాధ్యాయ పోస్టులను దక్కించుకునేందుకు జిల్లాతో పాటు, ఇతర జిల్లాల నుంచి కూడా సుమారుగా 30 వేల మంది అభ్యర్థులు డీఎస్సీకి హాజరయ్యారు. వీరిలో సబ్జెక్టుల వారీగా అర్హులైన వారి మెరిట్ జాబితా ఇదివరకే సిద్ధమైంది. తాజాగా ప్రభుత్వం నుంచి నియామక ప్రక్రియ చేపట్టాలని ఆదేశాలు రావటంతో విద్యాశాఖాధికారులు డీఎస్సీ ఫైళ్లను బయటకు తీస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ధ్రువీకరణ పత్రాల పరిశీలన మొదలు, పోస్టింగ్‌లు ఇచ్చేంత వరకు నిర్ధిష్టిమైన షెడ్యూల్ సైతం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విడుదల చేయడంతో జిల్లా విద్యాశాఖాధికారులు ఇదే పనిలో నిమగ్నమయ్యారు.
అంతా ఆన్‌లైన్‌లోనే..
రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తొలిసారిగా జరుగుతున్న నియామకాలు కావడంతో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారు. నియామకాల్లో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా అంతా ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 20 నుంచి మొదలయ్యే ప్రక్రియ సెప్టెంబర్ 4 వరకు కొనసాగనుంది. పాఠశాల విద్యాశాఖ (సీఎస్‌సీ) వెబ్‌సైట్ ద్వారా ఎంపిక అభ్యర్థుల జాబితాను ఈ నెల 20న అందుబాటులో ఉంచనున్నారు.
దీనిని జిల్లాల స్థాయి సెలక్షన్ కమిటీ (డీఎస్‌సీ) ఆమోదించి ఈ నెల 21న జాబితాను ప్రకటిస్తారు. ఇందులో ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 22, 23 తేదీల్లో వారికి సంబంధించిన ఒరిజనల్ ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా పలు దఫాలుగా పరిశీలన అనంతరం ఆగస్టు 29న పోస్టుల కోసమని ఎంపికైన వారి తుదిజాబితా ప్రకటించనున్నారు. ఆగస్టు 30న వెబ్ అప్షన్‌ల అనంతరం ఎంపికైన వారికి పోస్టింగ్ ఆర్డర్‌లను సైతం ఆన్‌లైనే జారీ చేయనున్నారు.
ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ప్రత్యేక కమిటీ
డీఎస్సీ ఫలితాల ఆధారంగా ఇప్పటికే సబ్జెక్టుల వారీగా మెరిట్ అభ్యర్థుల జాబితాను విద్యాశాఖాధికారులు ఎంపిక చేశారు. అయితే అందుబాటులో ఉన్న ఖాళీల మేరకు మెరిట్, రోస్టర్, అభ్యర్థుల ప్రత్యేకతలను పరిగణనలోకి తీసుకొని మెరిట్ జాబితాలో టాప్‌లో నిలిచిన వారికి పోస్టింగ్‌లు ఇచ్చేందుకు వడపోత కార్యక్రమం చేపట్టాల్సి ఉంటుంది. ఈ దశలోనే అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇదే విషయమై సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీఈవోలకు దిశానిర్దేశం చేశారు. అభ్యర్థులు పొందుపరిచిన ధ్రువీకరణ పత్రాలను విద్యా, రెవెన్యూ, గిరిజన సంక్షేమ, వైద్యశాఖలకు చెందిన అధికారులతో కూడిన కమిటీ సభ్యులు పరిశీలన జరిపి, వాటికి ఆమోదం తెలిపిన తరువాతనే తుది జాబితా ప్రకటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
భాషా పండితుల నియామకాలకు బ్రేక్
న్యాయస్థానంలో వివాదంలో ఉన్న కొన్ని పోస్టుల భర్తీకి తాత్కాలికంగా బ్రేక్ పడింది. స్కూల్ అసిస్టెంట్ కేడర్‌లో గల తెలుగు (12), హిందీ (6), ఎల్‌పీ తెలుగు (4), ఎల్‌పీ హిందీ (4), ఎల్‌పీ సంస్కృతం (3), పీఈటీ (14) పోస్టులు మొత్తం 43 ఖాళీగా ఉండగా, వీటి నియామకాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా వీటిని భర్తీ చేసేలా, జాబితా సిద్ధం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment