జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న హోం మంత్రి మేకతోటి సుచరిత, చిత్రంలో మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యేలు తదితరులు
సాక్షి, కోనేరుసెంటర్(మచిలీపట్నం): మహిళలపై దాడులకు తెగబడే మృగాళ్ల గుండెల్లో వణుకుపుట్టించే చట్టమే దిశ చట్టం అని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. జిల్లాకేంద్రమైన మచిలీపట్నంలో నూతనంగా ఏర్పాటుచేసిన దిశ పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం హోంమంత్రి సుచరిత ప్రారభించారు. అనంతరం జిల్లా పోలీస్‌పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళల పక్షపాతి అని అన్నారు. ఒక మహిళను రాష్ట్ర హోంమంత్రిని చేయటమే అందుకు నిదర్శనమన్నారు. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా మహిళల భద్రతకు ప్రత్యేక చట్టం తెచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు.
దిశ చట్టంపై మహిళలంతా పూర్తి అవగాహన కలిగివుండాలన్నారు. పొరుగు రాష్ట్రంలో జరిగిన దిశ ఘటన మరెక్కడ జరగకూడదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఆలోచన చేసి, అలాంటి నేరాలకు పాల్పడే మానవ మృగాలకు 21 రోజుల్లో శిక్ష పడేలా దిశ చట్టాన్ని అమలు తీసుకువచ్చారన్నారు. మహిళలపై దాడులకు పాల్పడి అమాయక ఆడపిల్లలను హత్యలు చేసే మానవ మృగాలకు కఠినమైన శిక్ష పడేలా ఈ చట్టాన్ని అమలులోకి తీసుకురావటం జరిగిందన్నారు. ఈ చట్టం ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందన్నారు. ఏడు రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి, 14 పని దినాల్లో విచారణ ముగించి, 21 రోజుల్లో నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి దిశ స్టేషన్‌లు ఏర్పాటుచేయటం జరుగుతుందన్నారు. ప్రత్యేక వసతులతో ఈ స్టేషన్‌లు ఉంటాయన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌లు, ప్రత్యేక న్యాయస్థానాలు ఈ చట్టం అమలు కోసం ఏర్పాటుచేయటం జరుగుతుందన్నారు.
దిశ చట్టాన్ని రాష్ట్రంలో పటిష్టంగా అమలు చేసేందుకు ఇద్దరు ప్రత్యేక అధికారులను సైతం ప్రభుత్వం నియమించినట్లు చెప్పారు. రాష్ట్రంలో 18 దిశ పోలీస్‌స్టేషన్‌లు ఏర్పాటు చేయటం జరుగుతుందని, మహిళలంతా ఈ చట్టంపై పూర్తి అవగాహన కలిగివుండటంతో పాటు దిశ యాప్‌ను తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆమె సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ యేడాదిని మహిళ భద్రత సంవత్సరంగా ప్రకటించటం జరిగిందన్నారు. దిశ చట్టం అమలుపై పక్క రాష్ట్రాలు సైతం ఆసక్తి కనబరుస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ప్రతి యేటా మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై దాదాపు 13,000లకుపైగా కేసులు నమోదు అవుతున్నాయన్నారు. దీని బట్టి చూస్తే మహిళల పట్ల మగాళ్ళకు ఉన్న విలువ ఏంటో అర్ధం అవుతుందన్నారు. అలాంటి పరిస్థితులకు స్వస్తి చెప్పేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కఠినమైన చట్టాలను అమలులోకి తీసుకువస్తున్నారన్నారు. గత ప్రభు త్వం మద్యాన్ని ఆదాయ వనరుగా పరిగణనిస్తే ప్రస్తుత ప్రభుత్వం మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధించాలనే సంకల్పంతో సంపూర్ణ మద్యనిషేధం వైపు అడుగులు వేస్తుందని అన్నారు.
మహిళలకు రక్షణ కవచం : మంత్రి పేర్ని నాని
రాష్ట్ర రవాణా, సమాచార పౌరసంబంధాలశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) మాట్లాడుతూ మహిళలకు దిశ చట్టం రక్షణకవచంలా నిలుస్తుందన్నారు. మనిషి అనారోగ్యానికి గురైతే ఆ రోగాన్ని కనిపెట్టే యంత్రాలు వాడుకలోకి వచ్చాయిగానీ మనిషి ఎప్పుడు ఎలా మారతాడో కనిపెట్టే యంత్రం మాత్రం ప్రపంచవ్యాప్తంగా కనిపెట్టలేకపోయారన్నారు. మహిళల పట్ల తప్పు చేసే మానవ మృగాల్లో దిశ చట్టం భయం పుట్టిస్తుందన్నారు. అలాగే అన్యాయానికి గురైన బాధితులకు 21 రోజుల్లో న్యాయం జరుగుతుందన్నారు.
చట్టం అమలుకు పటిష్ట చర్యలు: ఏలూరు రేంజ్ డీఐజీ ఖాన్
ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ మాట్లాడుతూ మహిళల రక్షణకు, దిశ చట్టం అమలుకు పోలీసుశాఖ పటిçష్ట చర్యలు చేపడుతుందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో వేలాది మంది మహిళలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహిళా సంరక్షణ కార్యదర్శులుగా నియమించటం గొప్ప విషయమన్నారు. వీరితో పాటు బాలమిత్ర, సైబర్‌మిత్ర టీంలను కూడా మహిళల రక్షణ కోసం ఏర్పాటుచేయటం జరిగిందన్నారు.
శక్తివంతమైనది దిశ చట్టం: వాసిరెడ్డి పద్మ
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ దిశ చట్టం ద్వారా నేరాల సంఖ్య దాదాపు తగ్గిపోవటం ఖాయమన్నారు. తల్లిదండ్రులు ఆడపిల్లలకు చెప్పే జాగ్రత్తలు ఈ చట్టం అమలుతో మగపిల్లలకు చెప్పే రోజులు వస్తాయన్నారు. అంతటి శక్తివంతమైన చట్టంగా దిశ అమలు అవుతుందన్నారు. ఈ చట్టం అమలుతో నేరస్తుల్లో ఖచ్ఛితమైన మార్పు రావాలన్నారు. దిశ చట్టం అమలుపై ప్రతిపక్షం ఎన్ని ఆరోపణలు చేసినా మగాళ్ల మైండ్‌సెట్ మారే వరకు చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.
మహిళలకు మరింత భద్రత : ఎస్పీ రవీంద్రనాథ్ బాబు
జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు మాట్లాడుతూ దిశ చట్టం చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. దిశ పోలీస్‌స్టేషన్ ప్రారంభంతో జిల్లాలోని మహిళలకు మరింత భద్రత కల్పించటం జరుగుతుందన్నారు. దిశ స్టేషన్‌కు అవసరమైన సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఏఎస్పీ మోకా సత్తిబాబు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని), శాసనసభ్యులు సింహాద్రి రమేష్, కైలే అనిల్‌కుమార్, దూలం నాగేశ్వరరావు, వల్లభనేని వంశీ, రక్షణనిధి, డాక్టర్ మొండితోక జగన్మోహన్‌రావు, దిశ చట్టం ప్రత్యేక అధికారిణి దీపికా పటేల్, జిల్లా విద్యాశాఖా«ధికారిణి రాజ్యలక్ష్మి, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment