
చిలకలపూడి(మచిలీపట్నం): ఉద్యోగులు గుర్తుపెట్టుకోండి అంటూ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహంతో ఊగిపోయారు. సోమవారం అధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన నాయకులు అడుగడుగునా నిబంధనలు అతిక్రమించారు. వినతిపత్రం ఇచ్చేందుకు పదుల సంఖ్యలో వచ్చిన టీడీపీ, జనసేన, సీపీఐ నాయకులకు పోలీసులు కరోనా నిబంధనల నేపథ్యంలో 144 సెక్షన్ అమలులో ఉందని ఎక్కువ మంది నాయకులు, కార్యకర్తలు ఉండకూడదని వివరించారు.
ఈ సమయంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, చిలకలపూడి సీఐ అంకబాబుకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం డీఆర్వో ఎం వెంకటేశ్వర్లు ఆయన చాంబర్ నుంచి బయటకు వచ్చి నాయకులను నుంచి వినతిపత్రం స్వీకరించారు. కలెక్టరేట్ ప్రాంగణంలోనే మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారించి వారిని కలెక్టరేట్ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లి మాట్లాడాలని సూచించారు.
బయటకు వచ్చిన దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతూ మమ్మల్ని మాట్లాడనీయరా, బయటకు పంపేస్తారా, ఉద్యోగులు గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు, అప్రకటిత ఎమర్జెన్సీలా ప్రవర్తిస్తున్నారు అంటూ ఆగ్రహంతో ఊగిపోతూ ఉద్యోగులపై ద్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య, బోడే ప్రసాద్, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, జనసేన నాయకులు బి రామకృష్ణ, సీపీఐ నాయకులు మోదుమూడి రామారావు తదితరులు ఉన్నారు.
చదవండి: చంద్రన్న మార్కు మద్యం దందా: కాగ్ నివేదికలో వెల్లడి