ఉపాధ్యాయ నియామకాల్లో ఓపెన్ కోటా పోస్టుల భర్తీని ఏపీలోని 13 జిల్లాలకే పరిమితం చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖాధికారులకు స్పష్టం చేసింది.
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామకాల్లో ఓపెన్ కోటా పోస్టుల భర్తీని ఏపీలోని 13 జిల్లాలకే పరిమితం చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖాధికారులకు స్పష్టం చేసింది. ఆర్టికల్ 371డి ప్రకారం టీచర్ పోస్టుల్లో ఓపెన్ కోటాలో ఇతర రాష్ట్రాల వారికి అవకాశం ఉండదని వివరించింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని అభ్యర్థులకు ఏపీలోని ఉపాధ్యాయ నియామకాల్లో అవకాశం లేనట్లేనని స్పష్టమైంది. టీచర్ పోస్టుల భర్తీకోసం నిర్వహిస్తున్న టెర్ట్‌లోని 20 శాతం ఓపెన్ కోటా పోస్టులను మెరిట్ ప్రాతిపదికన ఇతర రాష్ట్రాల వారికి అవకాశమివ్వాలా? లేక ఏపీలోని 13 జిల్లాల వారితోనే వాటిని భర్తీ చేయాలా? అనే సందిగ్ధం అధికారుల్లో నెలకొన్న సంగతి తెలి సిందే. దీనిపై స్పష్టతనివ్వాలని మంగళవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావుతో విద్యాశాఖ కార్యదర్శి అధర్‌సిన్హా, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉషారాణి భేటీ అయ్యారు. ఏపీలోని 13 జిల్లాల వారితోనే పోస్టులు భర్తీచేయాలని సీఎస్ వారికి స్పష్టంచేశారు. 371డి నిబంధనల ప్రకారం ఏపీలో 13 జిల్లాల్లో ఒక జిల్లాకు తక్కిన 12 జిల్లాలు నాన్‌లోకల్ అవుతాయని చెప్పారు. ఒక జిల్లాలోని టీచర్ పోస్టుల్లో 80 శాతం అక్కడివారిని నియమించి, తక్కిన 20 శాతం పోస్టులను మెరిట్‌లో ఉన్న ఇతర జిల్లాలవారికి ఇవ్వాలని సూచించారు.
ఫీజుల చెల్లింపు ఏపీ ఆన్‌లైన్ వరకే...
టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసేవారు నిర్ణీత ఫీజును ఏపీ ఆన్‌లైన్ కేంద్రాల్లో, లేదా ఈ-సేవా కేంద్రాల్లో చెల్లించేలా నోటిఫికేషన్‌లో అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ-సేవా కేంద్రాల్లో చెల్లించిన వివిధ రుసుముల మొత్తాలు సకాలంలో ఆయా శాఖలకు అందడం లేదన్న అభిప్రాయం కొన్ని శాఖల వారి నుంచి విద్యాశాఖకు అందింది. దీంతో ఫీజుల చెల్లింపును ఏపీ ఆన్‌లైన్ వరకే పరి మితం చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరక్టరేట్ అధికారులు భావిస్తున్నారు. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు.