విద్యా శాఖ మంత్రి లోకేశ్
సాక్షి, అమరావతి: ఈ ఏడాది జూన్ వరకు ప్రభుత్వ పాఠశాలల్లో 13,497 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి సంతకం 16,347 టీచర్ పోస్టుల భర్తీపై చేసినట్టు వివరించారు. శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. వచ్చే ఆరు నెలల్లో నోటిఫికేషన్ జారీచేసి, వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామన్నారు.
గత ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి మభ్యపెట్టే ప్రయత్నం చేసిందన్నారు. అభ్యర్థుల వయోపరిమితి పెంచే ఆలోచన చేస్తున్నామన్నారు. జీవో 117కు ప్రత్యామ్నాయం తీసుకొచ్చే ఆలోచనచేస్తున్నామని మంత్రి తెలిపారు. గతంలో ఉపాధ్యాయులు ధర్నా చేసినప్పుడు అనేక కేసులు పెట్టారని, త్వరలో వాటిని తొలగిస్తామని చెప్పారు.
ఉన్నత విద్యపై అడిగిన మరో ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్‌లో సంస్కరణలు తెస్తున్నామని, తమ ప్రభుత్వం వచ్చాక ఇంటర్‌లో 15 వేల అడ్మిషన్స్ పెరిగాయని చెప్పారు. తాము నారాయణ విద్యాసంస్థలతో పోటీపడేలా పనిచేస్తున్నామని, 9వ తరగతి నుంచే క్వాలిటీ ఎడ్యుకేషన్ పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. దీనికోసం ప్రత్యేక డాష్ బోర్డు ఏర్పాటు చేసి స్కూల్స్‌కు ర్యాంకింగ్స్ ఇస్తామన్నారు.
నాడు–నేడుతో ప్రయోజనం లేదు
గత ప్రభుత్వం టీచర్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఘనంగా మోసం చేసిందని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులకు జీతాలు కూడా సరిగా ఇవ్వకుండా చాకరీ చేయించిందని విమర్శించారు. ఉపాధ్యాయులకు అదనపు పనులు చెప్పడంతో వారు పాఠాలు చెప్పలేకపోతున్నారని, దీంతో విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లిపోతున్నారని చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం రావాలన్నారు. గత ప్రభుత్వంలో నాడు–నేడు కార్యక్రమంతో ఎలాంటి ప్రమోజనం లేదని, దీనివల్ల చాలా నష్టం జరిగిందన్నారు.. పాఠశాలలు శిథిలమైపోయాయన్నారు. విద్యారంగానికిరూ.29 వేల కోట్లు కేటాయించడం హర్షించతగ్గ విషయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment