టీచర్ పోస్టుల ఖాళీలపై సుప్రీం నోటీసు
అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ, తెలంగాణకు ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వేల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయన్న అంశంపై ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు నోటీసులు జారీచేసింది. రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో సిబ్బంది కొరత, మౌలిక వసతుల లేమిపై దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది. ఆర్టికల్ 371–డి కారణంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో జాప్యం జరుగుతోందని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది వివరించగా.. విద్య ప్రాథమిక హక్కు అని, ప్రభుత్వ పాఠశాలల విషయంలో నిర్లక్ష్యం తగదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఉపాధ్యాయుల నియామకంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై అసంతృప్తి వ్యక్తంచేసింది.
పాఠశాలలంటే భవనాలు ఉంటే సరిపోదని, నాణ్యమైన విద్య అందించాలని సూచించింది. విద్యాహక్కు చట్టాలను సక్రమంగా అమలుచేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టం చేసింది. టీచర్ల నియామకంపై మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని రెండు రాష్ట్రాలను ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల మరుగుదొడ్లలో నీటి వసతిలేమిపై ధర్మాసనం ప్రశ్నించింది. అన్ని పాఠశాలల్లో నీటి వసతి ఉన్న జిల్లా పేరు చెబితే తనిఖీలు చేయిస్తామని ధర్మాసనం పేర్కొంది. మరుగుదొడ్డి వసతి లేకపోవడం కారణంగా కూడా విద్యార్థినుల హాజరు శాతం తక్కువగా ఉండడం, డ్రాప్ అవుట్స్ పెరగడం చోటుచేసుకుంటోందని వ్యాఖ్యానించింది. దీనికి ఆంధ్రప్రదేశ్ తరఫు న్యాయవాది సమాధానమిస్తూ విజయనగరం జిల్లాలో పరిశీలన చేయవచ్చని కోర్టుకు విన్నవించారు. ఆ జిల్లాలో పరిశీలన చేసి నివేదిక సమర్పించాలని మౌలిక వసతుల లేమిని అధ్యయనం చేస్తున్న గుప్తా కమిటీని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 23కి వాయిదా వేసింది.