రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. టీఎస్‌పీఎస్సీ ద్వారా పోస్టుల భర్తీకి అనుమతిస్తూ.. మంగళవారం నియామక నిబంధనలను జారీ చేసింది. ఈ మేరకు ‘టీచర్ రిక్రూట్‌మెంట్ రూల్స్–2017 (జీవో 25)’పేరిట విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఉత్తర్వులు వెలువరించారు. దీంతో పది పదిహేను రోజుల్లో 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశముంది. మరోవైపు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయిన వెంటనే టీఎస్‌పీఎస్సీ సమావేశమై పోస్టుల భర్తీపై చర్చించినట్లు తెలిసింది. మొత్తంగా ఉమ్మడి రాష్టంలో (2012లో) నియామకాలు చేపట్టిన ఐదేళ్ల తరువాత ఇప్పుడు టీచర్ పోస్టులు భర్తీ కానున్నాయి.