10,00,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ
- దేశంలో ప్రభుత్వ విద్యావ్యవస్థ దుస్థితి
విద్యావ్యవస్థపై పాలకుల నిర్లక్ష్యం వీడడం లేదు. అసలే అరకొర వసతులతో సతమతమవుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో సుమారు పది లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని స్వయంగా కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ లోక్‌సభకు ఇటీవల వెల్లడించింది.
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 18 శాతం ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదే ప్రభుత్వ సెకండరీ స్కూళ్లలో 15 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్వయంగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ లోక్‌సభకు సమర్పించిన అధికారిక గణాంకాలివి. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 10 లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మానవ వనరుల శాఖ తెలిపింది. మరో మాటలో చెప్పాలంటే ప్రతి ఆరు ఉపాధ్యాయ పోస్టుల్లో ఒకటి ఖాళీగా ఉంది.
దేశంలో పలు రాష్ట్రాల్లో అన్ని ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయగా, కొన్ని రాష్ట్రాల్లో సగానికి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అక్షరాస్యత రేటు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఉపాధ్యాయ ఖాళీలు అధికంగా ఉన్నాయి. 2015–16 ఎడ్యుకేషన్ డేటా ప్రకారం దేశంలో 260 మిలియన్ల పాఠశాల విద్యార్థుల్లో 55 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యనభ్యసిస్తున్నారు.
జార్ఖండ్‌లో అత్యధికం...
దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 60 లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. వీటిల్లో ప్రాథమిక పాఠశాలల్లో 9 లక్షలకు పైగా, సెకండరీ స్కూళ్లలో లక్షకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అత్యధికంగా జార్ఖండ్ రాష్ట్రంలోని సెకండరీ స్కూళ్లలో 70 శాతం పోస్టులు(ప్రాథమిక పాఠశాలల్లో 38%) ఖాళీగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని సెకండరీ స్కూళ్లలో సగానికి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదే గుజరాత్, బిహార్ రాష్ట్రాల్లో మూడొంతుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నియామకాలపై పాలకులకు చిత్తశుద్ధి కొరవడడం, రెగ్యులర్‌గా ఖాళీలు భర్తీ చేయకపోవడం, ఆయా సబ్జెక్టులకు సంబంధించి నిపుణులైన ఉపాధ్యాయుల కొరత, విద్యార్థులు తక్కువగా ఉన్న చిన్న పాఠశాలలు వంటివి ప్రస్తుత పరిస్థితికి పలు కారణాలు.
తెలుగు రాష్ట్రాల్లో...
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు సమర్పించిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ప్రాథమిక పాఠశాలల్లో మొత్తం 1,47,139 పోస్టులు ఉండగా, 19,468 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సెకండరీ స్కూళ్లలో మొత్తం 61,793 ఉపాధ్యాయ పోస్టులు ఉండగా, 5,056 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎమ్‌ఎస్‌ఏ) కింద ఆమోదం తెలిపిన 860 స్పెషల్ ఎడ్యుకేటర్స్ పోస్టులకు సంబంధించి ఏ ఒక్కటీ భర్తీ కాలేదు.
తెలంగాణలో...
తెలంగాణలోని ప్రాథమిక పాఠశాలల్లో మొత్తం 97,507 ఉపాధ్యాయ పోస్టులు ఉండగా, 13,049 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక సెకండరీ స్కూళ్లలో 43,746 పోస్టులు ఉండగా, 3,144 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది.
ఏకైక రాష్ట్రం సిక్కిం..
గోవా, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లో ప్రాథమిక పాఠశాలల్లో ఖాళీలన్నవే లేవు. అసోం, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్రల్లోని సెకండరీ స్కూళ్లలో వరుసగా 3.9%, 3.9%, 2% చొప్పున ఖాళీలున్నాయి. దేశంలో ప్రాథమిక, సెకండరీ స్కూళ్లలో అన్ని పోస్టులు భర్తీ చేసిన ఏకైక రాష్ట్రం సిక్కిం మాత్రమే!