5 లక్షల టీచర్ పోస్టులపై రాష్ట్రాలకు కేంద్రం లేఖ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఐదు లక్షల ప్రాథమిక ఉపాధ్యాయుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ కేంద్రం అన్ని రాష్ట్రాలకూ లేఖలు రాయనుంది. కేవలం ఒక ఉపాధ్యాయుడితో నడుస్తున్న పాఠశాలలు దేశంలో నేడు లక్ష ఉన్నాయి. ‘టీచర్ల స్థానాలు ఖాళీగా ఉండడం అనేది తీవ్ర సమస్య. ఉపాధ్యాయులను నియమించాల్సిన బాధ్యత రాష్ట్రాలది కాబట్టి వారే వీలైనంత త్వరగా టీచర్ల ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతున్నాం’ అని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు.
సరైన మౌలిక సదుపాయాలు, మానవ వనరులు లేకుండా విద్యలో నాణ్యతను తీసుకురావడం కుదరదు కాబట్టి కేంద్రం ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తోందని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా 33.08 లక్షల ప్రాథమిక స్థాయి టీచర్ల ఉద్యోగాలు మంజూరైతే ప్రస్తుతం 5.56 లక్షల స్థానాలు ఖాళీగా ఉన్నాయని మంత్రిత్వ శాఖ గతంలో పార్లమెంటులో తెలిపింది.