ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ :
ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఆశలపై రాష్ట్ర విభజన ప్రకటన నీళ్లు చల్లింది. ఈ ఏడాది డీఎస్సీ-13 నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి కొన్ని నెలల క్రితం చేసిన ప్రకటన బీఈడీ, డీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థుల్లో ఆశలు చిగురింపజేసింది. జిల్లాలో 609 టీచర్ పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉండటంతో వేలాదిమంది అభ్యర్థులు వ్యయప్రయాసలకోర్చి డీఎస్సీ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కానీ ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కన్పించటంలేదు. కనీసం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) నిర్వహించినా అభ్యర్థులు శాంతిస్తారనుకుంటే దానికీ అతీగతి లేకుండా పోతోంది.
రాష్ట్ర విభజన అనివార్యమయ్యేట్టయితే నాన్‌లోకల్ కేటగిరీ పోస్టుల భర్తీలో తెలంగాణ జిల్లాల్లోని సీమాంధ్ర అభ్యర్థులు ఎక్కడ పోస్టులు కొట్టుకుపోతారో అనే భయంతోనే డీఎస్సీ-13 నిర్వహణను జాప్యం చేస్తున్నారనే వాదనా ఉంది. అసలు నిర్వహిస్తారో? లేదో? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే జిల్లాకు చెందిన సుమారు 22 వేల మంది అభ్యర్థులు టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. టెట్‌లో సాధించిన మార్కులు డీఎస్సీలో పోస్టు సాధించటానికీ ఉపయోగపడటంతో దీనిలోను మంచిమార్కులు సాధించాలని అభ్యర్థులు కసరత్తు చేస్తున్నారు. పది నెలల నుంచి డీఎస్సీ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ అభ్యర్థులు రూ.25వేల నుంచి 60వేల వరకు ఖర్చు చేశారు. అయినా డీఎస్సీ నోటిఫికేషన్ రాకపోవటంతో వారు డీలాపడిపోతున్నారు.
జిల్లాలో ఖాళీ పోస్టులు ఇవే
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 818 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 609 పోస్టులను మాత్రమే డీఎస్సీ-13లో భర్తీ చేస్తారని గతంలో వెలువడిన ప్రకటనవల్ల తెలుస్తోంది. ఈ పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్ 152 , సెకండరీ గ్రేడ్ తెలుగు 558, ఉర్దూ 4 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్ 93, పీఈటీ 11 పోస్టులు ఉన్నాయి.
స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో గణితం 40, ఫిజికల్ సైన్స్ 13, బయోలాజికల్ సైన్స్ 18, ఇంగ్లిష్ 20, సోషల్ స్టడీస్ 35, తెలుగు 14, హిందీ 5, సంస్కృతం 3, ఉర్దూ 1, ఫిజికల్ డెరైక్టర్‌పోస్టులు 3 ఉన్నాయి.
లాంగ్వేజ్ పండిట్ పోస్టుల్లో... తెలుగు భాషా పండిట్స్ 42, హిందీ పండిట్స్ 45, సం స్కృతం 5, ఉర్దూ 1 పోస్టు ఖాళీగా ఉన్నాయి.
ఎక్కువ పోస్టులు ఉండే సెకండరీ గ్రేడ్ టీచర్లకు డీఎడ్ అభ్యర్థులు మాత్రమే అర్హులు కావటంతో పోటీ తక్కువగానే ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో మాత్రం పోటీ భారీగా ఉంటుంది. సెకండరీ గ్రేడ్ పోస్టులను డీఎడ్ అభ్యర్థులతోనే భర్తీ చేయాలనే నిబంధన బీఎడ్ అభ్యర్థులకు ఆశనిపాతంగా పరిణమించింది.
డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూపులు
Published Sat, Nov 9 2013 1:51 AM | Last Updated on Fri, May 25 2018 5:44 PM
Advertisement