సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీచర్ పోస్టుల ఖాళీపై కొత్త ప్రభుత్వం ఆరా తీసింది. నిలిచిపోయిన నియామకాలు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై వాకబు చేసింది. విద్యాశాఖ కార్యదర్శి, పాఠశాల విద్య డైరెక్టర్ సమగ్ర వివరాలతో రూపొందించిన నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమర్పించారు. దీంతో పాటే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులను వివరించారు.
కోర్టు వివాదంలో ఉన్న అంశాలు, ఎన్నికల కోడ్ వల్ల నిలిచిపోయిన డీఎస్సీ పరీక్షను నివేదికలో పేర్కొన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేసే అవకాశం ఉంది. దీంతో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్టు పాఠశాల విద్య డైరెక్టరేట్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.
డీఎస్సీ రీ షెడ్యూల్?
ఎన్నికల ముందు 5,089 టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించారు. రోస్టర్ విధానాన్ని స్పష్టం చేశారు. ఈలోగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో నియామక ప్రక్రియ వాయిదా పడింది. ఆగిపోయిన డీఎస్సీని ముందుకు తీసుకెళ్ళడమా? కొత్త షెడ్యూల్ ఇవ్వడమా? అనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
రోస్టర్ విధానం వెల్లడించిన తర్వాత కొన్ని జిల్లాల్లో సాధారణ కేటగిరీల్లో పోస్టులు లేకుండా పోయాయి. స్థానికేతరులకూ కేవలం 15 శాతమే అర్హత ఉండటంతో డీఎస్సీపై నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అప్పట్లోనే కొన్ని పో స్టులు కలపాలన్న ఆలోచన గత ప్రభుత్వం చేసింది. కానీ ఇది కార్యాచరణకు నోచుకోలేదు. ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చే వీలుందని అధికార వర్గాలు అంటున్నాయి.
20 వేలకుపైగానే ఖాళీలు
విద్యాశాఖలో 20,740 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు విద్యాశాఖ అధికారులు లెక్కగట్టారు. 2022లో ప్రభుత్వం 13 వేల ఖాళీలు భర్తీ చేస్తామని తెలిపింది. ఈ మేరకు 2023లో 5,089 పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహణకు సిద్ధమైంది. ఈ క్రమంలో ప్రస్తుతం విద్యాశాఖ ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలున్నాయనే అంశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందించిన నివేదికలో పేర్కొంది. పదోన్నతులు కల్పించడం ద్వారా హెచ్‌ఎం పోస్టులను భర్తీ చేస్తారు.
స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు కూడా ఎస్‌జీటీలకు పదోన్నతులు కల్పించడం ద్వారా 70 శాతం భర్తీ చేయాల్సి ఉంటుందని, మిగిలిన 30 శాతం ప్రత్యక్ష నియామకం చేపట్టడం ద్వారా భర్తీ చేయాలనే విషయాన్ని సూచించింది. జిల్లా విద్యాశాఖ అధికారులు కేవలం ఐదు జిల్లాలకే ఉన్నారని, మండల విద్యాశాఖ అధికారుల పోస్టులు 467 ఖాళీగా ఉన్నాయని తెలిపింది. వీటిల్లో ఎన్ని భర్తీ చేస్తారనేది కొత్త ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుందని అధికార వర్గాలు అంటున్నాయి. ఉన్నత స్థాయి సమీక్ష తర్వాతే ఓ స్పష్టత వచ్చే వీలుందని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment