రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ప్రక్రియను పూర్తిచేసి పాఠశాలల్లో కొత్త టీచర్లను నియమించనుంది. దాదాపు 10 వేల ఉపాధ్యాయ పోస్టులు ఉండే అవకాశం ఉన్నట్లు అంచనా. అయితే ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ జారీ చేసినా.. ప్రక్రియ పూర్తయ్యేందుకు ఐదారు నెలల సమయం పడుతుంది. అంటే ప్రస్తుత విద్యా సంవత్సరం దాదాపు పూర్తయి, వేసవి సెలవుల సమయం వస్తుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ నెలాఖరు లేదా జనవరిలో నోటిఫికేషన్ జారీచేస్తే మే నెలాఖరుకల్లా నియామకాల ప్రక్రియను పూర్తి చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.