నడిసంద్రంలో డీఎస్సీ అభ్యర్థులు | DSC candidates in trouble | Sakshi
Sakshi News home page

నడిసంద్రంలో డీఎస్సీ అభ్యర్థులు

Published Thu, Oct 11 2018 2:51 AM | Last Updated on Thu, Oct 11 2018 2:51 AM

DSC candidates in trouble - Sakshi

కర్నూలు శారదానగర్‌కు చెందిన వివాహిత విజయలక్ష్మి(26) గత మూడేళ్ల నుంచి డీఎస్సీ కోసం ఎదురుచూస్తోంది.టెట్‌లో ఉత్తీర్ణత సాధించిన ఆమె ఈసారి డీఎస్సీలో కచ్చితంగా జాబ్‌ సాధిస్తాననే ఆత్మవిశ్వాసంతో ఉంది. అయితే డీఎస్సీ వాయిదా పడిందని తెలియడంతో మనస్తాపానికి గురై బుధవారం ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. రాష్ట్రంలో డీఎస్సీని నమ్ముకొన్నవారి పరిస్థితికి ఈ సంఘటన ఒక నిదర్శనం. ఇలా రాష్ట్రంలో ఎంతో మంది అభ్యర్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది.

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డీఈడీ, బీఈడీ కోర్సులు పూర్తిచేసిన దాదాపు 7 లక్షల మంది అభ్యర్థులు గత మూడేళ్లుగా డీఎస్సీ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగ ప్రకటనల్లో అంతో ఇంతో ఎక్కువ ఉండేవి.. ఉపాధ్యాయ పోస్టులే. అందులోనూ పోస్టుల భర్తీ ఏటా ఉంటుందన్న ఆశతో ఏటా వేలాది మంది డీఈడీ, బీఈడీ కోర్సుల్లో చేరుతున్నారు. ఫీజులు భారమైనా అప్పోసప్పో చేసి కాలేజీల్లో చేరుతున్నారు. ఇందుకోసం దూరప్రాంతాలకు వెళ్లి హాస్టళ్లలో, రూముల్లో ఉంటూ భారీ అద్దెలు చెల్లిస్తున్నారు. ఇంత కష్టపడి కోర్సులు పూర్తిచేస్తున్న అభ్యర్థులు ప్రభుత్వం ఒక్క పోస్టూ భర్తీచేయకపోవడంతో తీవ్ర నిరాశానిస్పృహలకు గురవుతున్నారు.  
 
30 వేల ఖాళీలున్నా.. 
రాష్ట్రంలో దాదాపు 30 వేల వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నా గత నాలుగేళ్లుగా ఒక్క నోటిఫికేషన్‌ కూడా జారీచేయలేదు. 2014 టెట్‌ కమ్‌ టీఆర్టీకి 4.20 లక్షల మంది హాజరయ్యారు. అప్పట్లో ప్రకటించిన పోస్టులు 10,313 మాత్రమే. అంటే.. ఆ పోస్టులు పొందిన వారు కాకుండా ఇంకా 4.10 లక్షల మంది నిరుద్యోగులుగానే మిగిలిపోయారు. ఈ నాలుగేళ్లలో డీఈడీ, బీఈడీ కోర్సులు పూర్తిచేసిన వారి సంఖ్య ఏటా 70 వేల వరకు ఉంటోంది. ఈ లెక్కన దాదాపు ఏడు లక్షల మంది డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.  
 
టెట్, డీఎస్సీల కోసం లక్షల్లో ఖర్చు 
2014లో టెట్‌ కమ్‌ టీఆర్టీ నిర్వహించాక మళ్లీ ప్రభుత్వం పోస్టుల భర్తీపై దృష్టి పెట్టలేదు. ఈలోగా డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన లక్షలాదిమంది అభ్యర్థులు, అంతకుముందు టెట్‌లో అర్హత సాధించినవారు డీఎస్సీ నోటిఫికేషన్‌ ఏ క్షణంలోనైనా వెలువడవచ్చని చేస్తున్న చిన్నచిన్న ఉద్యోగాలను, ఉపాధి పనులను పక్కనపెట్టి పరీక్షల కోసం కోచింగ్‌ కేంద్రాల్లోనే గడుపుతున్నారు. కొంతమంది తమ కుటుంబాలకు ఆ ఉద్యోగం ద్వారా వచ్చే వేతనమే ఆధారమైనా ప్రభుత్వ టీచర్‌ పోస్టు సాధిస్తే బతుకు సాఫీగా ఉంటుందని భావించి కోచింగ్‌ కోసం వాటిని వదిలేశారు. కుటుంబ పోషణకు, శిక్షణకు డబ్బులేకపోయినా అప్పులు చేసి మరీ శిక్షణ తీసుకున్నారు. అయినా ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్‌ కూడా విడుదల కాలేదు. ప్రభుత్వం ఈ నాలుగేళ్ల కాలంలో రెండుసార్లు టెట్‌ను నిర్వహించింది. డీఎస్సీలో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉండడంతో మెరిట్‌ జాబితాలో ముందుండవచ్చన్న ఆశతో మళ్లీ అందరూ వీటికి సన్నద్ధమవ్వాల్సి వచ్చింది.

మళ్లీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజులు, పుస్తకాలు, కోచింగ్‌కు ఖర్చు తడిసిమోపిడైంది. డీఎస్సీ వేస్తామంటూ ప్రతిసారీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటనలు చేస్తుండటంతో ఏ క్షణంలో అది వస్తుందో అని అభ్యర్థులు మళ్లీ శిక్షణ కోసం కోచింగ్‌ సెంటర్లలో చేరారు. నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో కొన్ని నెలలు శిక్షణ పొంది మళ్లీ ఇళ్లకు చేరారు. మళ్లీ మంత్రి నుంచి ప్రకటనలు రావడంతో మళ్లీ కోచింగ్‌ సెంటర్లవైపు పరుగులు తీశారు. ఒక్కో దఫాకు రూ.50 వేల వరకు ఆయా కోచింగ్‌ సెంటర్లకు ఫీజుల కింద చెల్లించారు. డీఎస్సీ శిక్షణ కేంద్రాలు కృష్ణా జిల్లా అవనిగడ్డతోపాటు హైదరాబాద్, తదితర నగరాల్లో ఉన్నాయి. మూడు నెలల శిక్షణకు ఆయా కోచింగ్‌ సెంటర్లు ఒకొక్కరి నుంచి రూ.50 వేల నుంచి లక్ష వరకు వరకు వసూలు చేస్తున్నాయి.

ఇది కాకుండా అదనంగా మెటీరియల్‌ కోసం మరో రూ.10 వేల వరకు ఖర్చు అవుతోంది. హాస్టల్‌లోనో, లేదంటే స్థానికంగా రూములు తీసుకొనో ఉండడానికి నెలకు కనీసంగా రూ.10 నుంచి రూ.15 వేల వరకు ఖర్చు అవుతోంది. మహిళలు అయితే మరిన్ని అవస్థలు ఎదుర్కొంటున్నారు. వివాహితలు పిల్లలను ఇళ్ల దగ్గర వదిలి రాలేక తమతో పాటే వారిని కోచింగ్‌ సెంటర్లున్న ప్రాంతాలకు తీసుకువెళ్లాల్సి వస్తోంది. తమకు తోడుగా ఇంట్లోని వారిని కూడా తీసుకొని వెళ్తూ అద్దె రూముల్లో ఉంటూ కోచింగ్‌ తీసుకుంటున్నారు. అవివాహితల పరిస్థితి కూడా ఇబ్బందిగానే ఉంటోంది. తోడుగా తోటి అభ్యర్థినులు లేకుంటే ఇంటిదగ్గర నుంచి కుటుంబ సభ్యులను తెచ్చుకుంటున్నారు. ఇలా అన్నిటికి కలిపి మూడు లేదా నాలుగు నెలలకు దాదాపు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చవుతోంది. 
 
పరీక్షల విధానం తెలీక అయోమయం 
మరోపక్క ఈసారి డీఎస్సీని ఎలా నిర్వహిస్తారనే దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. ఆన్‌లైన్‌లో ఉంటుందని ప్రచారం జరిగినా ఆన్‌లైన్‌లో అభ్యర్థులకు అనుభవం లేకపోవడంతో తాము నష్టపోతామని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు మరీ సంకటంగా మారుతుంది. ఇప్పటివరకు వీరంతా పుస్తకాల ఆధారంగా కోచింగ్‌లు తీసుకున్నారే తప్ప ఎవరూ కంప్యూటర్‌పై పరీక్షలకు శిక్షణ తీసుకోలేదు. మరోవైపు ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులకు కూడా నేషనల్‌ కౌనిŠస్‌ల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) అర్హత కల్పించింది. దీంతో వీరికి టెట్‌ పేపర్‌–1ను పెట్టాల్సి ఉంది. ఎన్‌సీటీఈ ఉత్తర్వులు వచ్చి రెండునెలలైనా ప్రభుత్వం ఆ మేరకు చర్యలు చేపట్టలేదు. ఎన్‌సీటీఈ ఉత్తర్వుల ప్రకారం ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులకు అర్హత కల్పిస్తూ మంగళవారం ప్రభుత్వం జీవో విడుదల చేసింది. టెట్‌ను వీరికి వేరేగా నిర్వహిస్తారా? లేక ఎస్జీటీ పోస్టుల వరకు టెట్‌ను, టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్టును కలిపి నిర్వహిస్తారా? అనే దానిపై కూడా స్పష్టత లేదు. ఇలా డీఎస్సీ పోస్టుల ప్రక్రియ రాష్ట్రంలో అస్తవ్యస్తంగా మారింది. 

ఏమి చేయాలో పాలుపోవడం లేదు 
మాది శ్రీకాకుళం జిల్లా జిజివలస. నాకు పెళ్‌లైయి ఇద్దరు పిల్లలు. నా భార్య కూడా బీఈడీ పూర్తి చేసింది. మేమిద్దరం టెట్‌ పాసయ్యాం. రూ.10 వేలు చెల్లించి డీఎస్సీ కోచింగ్‌ తీసుకున్నా. తర్వాత మళ్లీ నోటిఫికేషన్‌ అని ప్రభుత్వం ప్రకటించడంతో విజయనగరంలో ప్రైవేటు కోచింగ్‌ సెంటర్‌లో రూ.13 వేలు వెచ్చించి శిక్షణ పొందాను. తాజాగా ఈ నెల 10న నోటిఫికేషన్‌ ఇస్తామని మంత్రి గంటా ప్రకటించడంతో మళ్లీ విశాఖలో డీఎస్సీ కోచింగ్‌కు నాలుగు రోజుల క్రితమే రూ.20 వేలు చెల్లించి శిక్షణకు చేరాను. మళ్లీ డీఎస్సీ నోటిఫికేషన్‌ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ప్రతిసారి వేలకు వేలు చెల్లించి కోచింగ్‌లు తీసుకోవడంతో మా ఆర్ధిక పరిస్థితి క్షీణిస్తోంది. ఏమి చేయాలో పాలుపోవడంలేదు.  
–సాదె కృష్ణారావు, ఎంఏ, బీఈడీ (10విఎస్‌సీ292బి–320046–సాదె కృష్ణారావు)  

ఎన్నికల స్టంట్‌ 
ప్రభుత్వం డీఎస్సీ ప్రకటిస్తుందని ఆశపడి మా భార్యాభర్తలం అధిక వడ్డీకి అప్పులు చేసి మరీ కోచింగ్‌ తీసుకున్నాం. ఇప్పటి వరకూ ఇద్దరికీ కలిపి కోచింగ్‌కి రూ.2 లక్షలు, ఇంటి అద్దెలు, మెస్‌ ఛార్జీలు కలిపి సుమారు రూ.4 లక్షల వరకూ ఖర్చు అయింది. ఈ ప్రభుత్వ హయాంలో డీఎస్సీ చూస్తామన్న నమ్మకం కలుగడం లేదు. ఎన్నికల స్టంట్‌గా కనిపిస్తోంది. 
–నేకూరి సతీష్, డీఎస్సీ అభ్యర్థి 
 
ప్రభుత్వం తాత్సారం చేస్తోంది 
డీఎస్సీ ప్రకటిస్తామన్న ప్రభుత్వం ఇప్పటి వరకూ అదిగో, ఇదిగో అంటూ తాత్సారం చేస్తూ వస్తోంది. ఇప్పుడు కూడా ఈరోజు, రేపు అంటూ చెబుతున్నారు తప్ప ప్రకటన మాత్రం వెలువడడం లేదు. ఒక వేళ డీఎస్సీ ప్రకటించినా ఎన్నికలలోపు పరీక్ష రాసినా ఉద్యోగాలు మాత్రం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.  
–మేరుగు కిరణ్, డీఎస్సీ అభ్యర్థి 

ఖర్చు భరించలేకున్నాం.. 
అవనిగడ్డలో గతేడాది కాలంగా కోచింగ్‌ తీసుకుంటున్నా. ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేయకపోవడంతో కోచింగ్‌ ఖర్చులు పెరిగిపోయాయి.. ఇంటికి వచ్చేయాలని నిర్ణయించుకున్నాను. కానీ పోటీలో ఎక్కడ వెనకపడిపోతామేమోనన్న భయంతో ఇంటికి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాను. 
-ఎస్‌కే నాగూల్‌ మీరా, ఎస్‌జీటీ, గంపల గూడెం,కృష్ణా జిల్లా. 

కోచింగ్‌కు వేల రూపాయల ఖర్చు 
ఉద్యోగం సాధించాలనే ఆశతో సొంత ఊరుకు దూరంగా గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం, గుళ్ళపల్లి వెళ్లి అక్కడ శిక్షణ పొందుతున్నా. ఎనిమిది నెలలుగా కోచింగ్‌ ఫీజు, హాస్టల్‌ వసతికి రూ.70 వేలు ఖర్చయింది. ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ను పదపదే వాయిదా వేస్తుండటంతో చాలా ఇబ్బందిగా ఉంది. కుటుంబానికి ఆర్థికంగా భారమైనప్పటికీ ఉద్యోగం వస్తుందనే ఆశతో అమ్మానాన్న ఫీజులు చెల్లించారు.  
– పోతుల భ్రమరాంబ, గురజాల  

ఎదురుచూసి అలసిపోయి.. 
డీఎస్సీ కోసం ఎదురు చూసి అలసిపోయా. ఎంతకూ డీఎస్సీ ప్రకటన రాకపోవడంతో ఎమ్మెస్సీ కూడా పూర్తి చేశా. అయినప్పటికీ ఆశ చావక నాలుగేళ్లున్నరేళ్లుగా ప్రిపరేషన్‌లోనే ఉన్నా. డీఎస్సీ నోటిఫికేషన్‌ రాకపోవడంతో కుటుంబ పోషణకు ఇబ్బందులు తలెత్తడంతో ట్యూషన్లు చెప్పుకుంటున్నా.  
–దగ్గుమాటి శ్రీలత, కావలి  

ఇప్పటికే లక్ష దాకా ఖర్చయింది  
టెట్, డీఎస్సీ శిక్షణకు ఇప్పటికే ఒక లక్ష రూపాయిల దాకా ఖర్చయింది. మేము నలుగురు పిల్లలం. అయినా నాన్న డీఎస్సీ శిక్షణ ఇప్పించడానికి ఎంత ఖర్చైనా వెనకాడలేదు. వ్యవసాయ నేపథ్యం కలిగిన మధ్యతరగతి కుటుంబం అయినప్పటికీ శిక్షణకు పంపించారు.  
– మమత, కొండపల్లి, కనగానిపల్లి మండలం, అనంతపురం జిల్లా 
 
నెలకు రూ.3 వేల ఖర్చవుతోంది                            
డీఎస్సీ కోసం ఆరు నెలలుగా కర్నూలులో అద్దె గదిలో ఉంటూ చదువుతున్నా. కోచింగ్‌ ఖర్చులు కాకుండా అద్దె, మెస్‌ చార్జీలతో కలిపి నెలకు రూ.3 వేలకు పైగా అవుతోంది. నోటిఫికేషన్‌ ఇస్తామని వాయిదా మీద వాయిదాలు వేస్తున్నారు. ఇలా వాయిదాలు వేస్తే ఆత్మస్థైర్యం కోల్పోయే అవకాశం ఉంది.  
  – నారాయణ, ఎస్‌జీటీ అభ్యర్థి, కర్నూలు జిల్లా 

కాంట్రాక్టు ఉద్యోగాన్ని కూడా వదులుకుని.... 
 నా పేరు శ్రీనివాసులు. మాది కడప. మా నాన్న 10 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. కుటుంబ భారం నామీదే ఉంది. నాకు వివాహమైంది. అమె కూడా ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. నేను రాయచోటి మున్సిపాలిటిలో కాంట్రాక్టు పద్ధతిన బిల్‌ కలెక్టర్‌గా పనిచేస్తూ ఉండేవాడిని. నెలకు రూ. 15 వేలు జీతం వచ్చేది. డీఎస్సీ కోసమని సెలవుపెట్టాను. దీంతో డిసెంబర్‌ నుంచి ఇప్పటి వరకు ఒకటినర్న లక్ష జీతం పోవడంతోపాటు.. డీఎస్సీ కోసం 10 వేలకు పైగా ఖర్చు అయింది. ప్రస్తుతం నా భార్యకు వచ్చే జీతంతో కుటుంబం నడిస్తోంది.
– శ్రీనివాసులు, కడప.   

 డీఎస్సీపై ఎన్నో ఆశలు పెంచుకున్నాం. పోస్టులు పెంచకుంటే అన్యాయానికి గురవుతాం. ఉద్యోగాలు కూడా వదులుకుని కోచింగ్‌లు పెట్టుకున్న ఈ తరుణంలో పోస్టులు కుదిస్తే మా పరిస్థితి అగమ్యగోచరమవుతుంది.  
– కేతా సత్యనారాయణ (కొండ), డీఎడ్‌ అభ్యర్ధి, రాయవరం, తూర్పుగోదావరి జిల్లా.  
 
ఏమి చేయాలో పాలు పోవడం లేదు 
డీఎడ్‌ శిక్షణ పొంది రెండేళ్లుగా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నాను. అప్పు చేసి ఆర్నెళ్ల పాటు కోచింగ్‌ తీసుకున్నాను. నోటిఫికేషన్‌ పడకపోవడంతో తిరిగి ప్రైవేటు టీచర్‌గా పనిచేస్తున్నాను.  
 – అల్లాడ సాయికుమార్, డీఎడ్‌ అభ్యర్థి, సోమేశ్వరం, రాయవరం మండలం, తూర్పు గోదావరి జిల్లా.  

పాఠాలు చెప్పాల్సింది పోయి.. పనులకు 
నేను 2017లో టీటీసీ పూర్తి చేశాను. డీఎస్సీ రాసేందుకు శిక్షణ కోసం జిల్లా కేంద్రం ఒంగోలు వచ్చాను. కోచింగ్‌ ఫీజు, పుస్తకాలు, రూమ్‌ అద్దె, భోజనం కలుపుకుంటే దాదాపు లక్ష రూపాయల ఖర్చు అయింది. పాఠాలు చెప్పాల్సిన నేను ఊళ్లో పనులకు వెళ్లాల్సివస్తోంది. 
– వడ్లమూడి అనిల్‌కుమార్, జె.పంగులూరు, ప్రకాశం జిల్లా 

అన్యాయం చేస్తే ఊరుకోం  
ప్రభుత్వం మొదట్లో ఇచ్చిన మాటప్రకారం ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేయాల్సిందే. ఇచ్చిన మాటను నెరవేర్చకపోతే ఊరుకునేది లేదు. నిరుద్యోగులంతా ఏకమై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతాం. అప్పులు చేసి కోచింగ్‌ తీసుకుంటున్న మాకు ప్రభుత్వం అన్యాయం చేస్తే టీడీపీకి తగిన శాస్తి చెబుతాం.                 
– వైభవి, చిత్తూరు 
 
అప్పలు చేసి కోచింగ్‌లు తీసుకుంటున్నాం  
డీఎస్సీ కోసం అప్పులు చేసి మరీ కోచింగ్‌లు తీసుకుంటున్నాం. డీఎస్సీ నోటిఫికేషన్‌పై ప్రభుత్వం ఆశలు రేపడంతో ఎంతో కష్టపడి చదివాం. ఇప్పుడు వాయిదా వేస్తున్నట్టు సమాచారం రావడంతో మా ఆశలన్నీ అడియాసలే అయ్యాయి. వేలాది రూపాయలు అప్పులు చేసి తీసుకున్న కోచింగ్‌లు వృథా అయిపోయాయి. ఆర్థికంగా నష్టపోయాం. 
– పి.శివకుమార్, ఎన్‌ఎన్‌ కాలనీ, కొత్తూరు, శ్రీకాకుళం జిల్లా 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement