డీఎస్సీపై దగాకోరు రాతలు  Latest DSC notification for filling 6100 posts | Sakshi
Sakshi News home page

డీఎస్సీపై దగాకోరు రాతలు 

Published Sat, Mar 2 2024 2:42 AM | Last Updated on Sat, Mar 2 2024 2:42 AM

Latest DSC notification for filling 6100 posts - Sakshi

ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై రామోజీ కుటిల కథనం 

ఇప్పటికీ తెలంగాణలో పోస్టింగ్స్‌కు 1998, 2008 డీఎస్సీ అభ్యర్థుల నిరీక్షణ 

అప్పటి నుంచి మురిగిపోయిన పోస్టులతో కలిపే ఇప్పుడు డీఎస్సీ నోటిఫికేషన్‌ 

ఏపీలో గత ఐదేళ్లలో 15 వేల పోస్టులు భర్తీ చేసిన సీఎం జగన్‌  

వీటిలో 1998 నుంచి పోస్టింగ్స్‌ లేని వారికీ ఉద్యోగాలు 

తాజాగా 6,100 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ 

వీటితో కలిపితే ఏపీలో ఇచ్చిన టీచర్‌ ఉద్యోగాలు 21,108 

ఈ విషయం దాచి తెలంగాణలో మెగా అంటూ దగా కథనం 

డీఎస్సీ అభ్యర్థులను చంద్రబాబు మోసం చేసిన వైనం పైనా దాపరికమే 

2018 డీఎస్సీలో నామమాత్రంగా 300 పోస్టులు మాత్రమే భర్తీ  

1998, 2008 డీఎస్సీ అభ్యర్థులను పట్టించుకోని బాబు 

వైఎస్‌ జగన్‌ సీఎం అయిన తర్వాత మూడు డీఎస్సీల అభ్యర్థులకు న్యాయం 

ప్రత్యేక శ్రద్ధతో కోర్టు కేసులు పరిష్కరించి మరీ పోస్టింగ్స్‌ 

ఏపీలోని విద్యా సంస్కరణలు తెలంగాణలో లేవేమిటని ప్రశ్నించని రామోజీ

సాక్షి, అమరావతి: ఐదేళ్లు సీఎంగా పనిచేసి కేవలం 300 టీచర్‌ ఉద్యోగాలిచ్చిన చంద్రబాబును ఇదేమిటని ఎన్నడూ ప్రశ్నించరు ఈనాడు రామోజీరావు. గత ఐదేళ్లలో ఇప్పటికే 15 వేల టీచర్‌ ఉద్యోగాలిచ్చి పేదల పిల్లలకు చక్కటి చదువులు అందిస్తూ మరో 6,100 మంది ఉపాధ్యాయుల నియామకానికి నోటి­ఫికేషన్‌ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పరిపాలనపై మాత్రం విషం చిమ్ముతారు అదే రామోజీ. ఎందుకంటే.. రామోజీ, చంద్రబాబు అంటేనే పెత్తందార్ల పెద్దలు. పేదల పిల్లల ఎదుగుదల, అభివృద్ధిని సహించలేరు. అందుకే పేదల చదువులపై ఎప్పుడూ విషం చిమ్ముతుంటారు.

అదే క్రమంలో రాష్ట్రంలో తాజా డీఎస్సీపై పక్క రాష్ట్రంతో పోలిక పెట్టి.. మెగా.. దగా.. అంటూ ఓ కుటిల కథనం అచ్చేశారు. అసలు ఈ పోలికే ఓ దగా. ఎందుకంటే.. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ 1998, 2018 డీఎస్సీ నోటిఫికేషన్స్‌ పోస్టుల  భర్తీ జరగనే లేదు. అలాంటి పోస్టులన్నీ మురగపెట్టి ఇప్పుడు 11వేల పోస్టులకు అక్కడి ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చింది. దీనినే రామోజీ మెగా డీఎస్సీ అంటున్నారు.

కానీ, మన రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 1998 డీఎస్సీ నుంచి 2019 స్పెషల్‌ డీఎస్సీ, మరో 12,00 కేజీబీవీ రెగ్యులర్‌ పోస్టులు కలిపి 15 వేల పోస్టులను ఇప్పటికే భర్తీ చేసింది. తాజాగా 6,100 పోస్టులతో డీఎస్సీ నిర్వహిస్తోంది. ఇవన్నీ కలిపితే సీఎం జగన్‌ ఇచ్చిన ఉపాధ్యాయ ఉద్యోగాలు 21,108. అంటే తెలంగాణలో భర్తీ చేస్తున్న పోస్టులకంటే ఏపీలో పోస్టులే అధికం. ఈ విషయం చెప్పకుండా రామోజీ పాఠకులను తప్పుదోవ పట్టిస్తూ కథనం ఇవ్వడం దగా కాక మరేమిటి? 

తాజా డీఎస్సీతో అన్ని ఖాళీల భర్తీ 
తాజాగా 2024 డీఎస్సీ­లో 6100 పోస్టుల భ­ర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చా­రు. ఇందులో జిల్లా, మం­డల పరిషత్, ము­న్సి­పల్, మున్సిపల్‌ కా­ర్పొరేషన్, ఏపీ మో­డల్‌ స్కూళ్లు, ఏపీ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ, ఏపీ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ (గురుకులం), ఏపీ ట్రైబల్‌ వెల్పేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ (ఆశ్రం), ఏపీ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ, మహాత్మా జోతిబాపూలే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ వెల్ఫేర్‌ సొసైటీ విద్యా సంస్థల్లో మొత్తం అన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

ఇందులో సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ పోస్టులు 2,280, స్కూల్‌ అసిస్టెంట్స్‌ 2,299, టీజీటీ 1,264, పీజీటీ 215, ప్రిన్సిపల్‌ పోస్టులు 42 ఉన్నాయి. ఇకపై ప్రతి విద్యా సంవత్సరం చివర్లో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసి కొత్త విద్యా సంవత్సరంలో పూర్తిస్థాయి బోధన అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. 

బాబు డీఎస్సీ పెద్ద నాటకం 
చంద్రబాబు హయాంలో డీఎస్సీ ఓ పెద్ద నాటకం. చంద్రబాబు నాలుగేళ్లు అధికారాన్ని అనుభవించి ఎన్నికలకు ముందు ఏడాది 2018లో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చారు. దానిని కూడా సక్రమంగా నిర్వ­హించలేక చేతులెత్తేశారు. ఫలితంగా అ­భ్య­ర్థులకు అన్యాయం జరగడంతో కో­ర్టుకు వెళ్లాల్సివచ్చింది. ఇందులో 7,254 ఉపాధ్యాయ పోస్టులకు గాను.. చంద్రబాబు భర్తీ చేసిన పోస్టులు 300 మాత్రమే. కానీ, డీఎస్సీకి చంద్రబాబు పేటెంట్‌ అన్నట్టు ఈనాడు కలరింగ్‌ ఇస్తోంది. 

ఇది సీఎం జగన్‌ చేసిన మేలు 
2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్‌ ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందించారు. ఒక్క పాఠశాల కూడా మూత పడకుండా, ఏ ఒక్క టీచర్‌ అభ్యర్థికి అన్యా­యం జరగకుండా చర్య­లు చేపట్టారు. ప్రతి పాఠశాలలో నూరు శాతం టీ­చర్లను నియమిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే పాత, కొత్త డీఎస్సీల ద్వారా పోస్టులను భర్తీ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే 2018 డీఎస్సీలో చంద్రబాబు చేతి­లో దగాపడ్డ అభ్యర్థులకు సీఎం జగన్‌ న్యాయం చే­శా­రు. కోర్టు కేసులు పరిష్కారమయ్యేలా ప్రత్యేక దృష్టి సారించి సుమా­రు 6,954 మంది అభ్యర్థులకు ఉపాధ్యాయులుగా పోస్టింగులు ఇచ్చారు. అంతకు ముందు 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులు కూడా దశాబ్దాలుగా పోస్టింగ్స్‌ కోసం ఎదురు చూశారు. చంద్రబాబు వీరినీ పట్టించుకోకుండా తీవ్ర అన్యాయం చే­శారు.

ఇలా చంద్రబాబు దొంగ నాటకానికి బలైపోయిన అభ్యర్థులను సీఎం జగన్‌ చొరవ తీసుకుని టైం స్కేల్‌ ప్రాతిపదికన నియమించారు. ఇలా 1998 డీఎస్సీలోని 4,059 మంది, 2008 డీఎస్సీ­లోని 2,193 మంది అభ్యర్థులకు పోస్టింగ్స్‌ ఇచ్చా­రు. వీటితో పాటు కేజీబీవీల్లో సుమారు 1,200 మంది రెగ్యులర్‌ టీచర్లను నియమించారు. నిత్యం శుద్దపూస కబుర్లు చెప్పే రామోజీ.. చంద్రబాబు చేతిలో మోసపోయిన డీఎస్సీ అభ్యర్థులకు సీఎం జగన్‌ చేసిన ఈ మేలు గురించి ఒక్క అక్షరం రాయరు. 

ఇది రామోజీ కుటిలత్వం 
రామోజీ బోడి గుండుకు.. మోకాలికి ముడిపెట్టే ప్రయత్నం కూడా చేశారు. ప్రపంచ బ్యాంకు రుణం కోసం ఉపాధ్యాయ ఖాళీలను దాచేస్తున్నారంటూ పాతరాగానికి కొత్త ట్యూన్‌ కట్టారు. ఇక్కడ పాఠశాలల అభివృద్ధిని కాంక్షిస్తూ రుణం వస్తుంది. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు కీలక భూమిక పోషిస్తేనే ఆ పాఠశాల బాగుపడుతుంది. విద్యార్థికి ఉన్నత భవిష్యత్తు దక్కుతుంది. ఈనాడు చెప్పినట్టు కేవలం రుణం కోసం ఖాళీలను దాచేసి పాఠాలు చెప్పేవారు లేకుండా చేసి విద్యాభివృద్ధిని ఎలా సాధిస్తారు? కొంచెం జ్ఞానంతో ఆలోచిస్తే ఎవరికైనా రామోజీ రాతల్లోని కుటిలత్వం బోధపడుతుంది.  

తెలంగాణలో ఇవెందుకు లేవు రామోజీ? 
విద్యా రంగంలో సీఎం జగన్‌ విప్లవాత్మక మార్పులు తెస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క విద్యా రంగంపైనే రూ.73 వేల కోట్లు ఖర్చు చేశారు. ఏపీలో మనబడి నాడు–నేడు కార్యక్రమంతో ప్రభుత్వ విద్యలో సమూల మా­ర్పులు కళ్లకు కడుతున్నాయి. ఇంగ్లిష్‌ మీడియం, టొఫెల్, సీబీఎస్సీఈ సిలబస్, జగనన్న గోరుముద్ద, పేద విద్యార్థులకు ట్యాబ్స్, జగనన్న విద్యా కానుక, అమ్మఒడి సాయం, ద్విభాషా పాఠ్య పుస్తకం, ఐఎఫ్‌పీలు, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్‌ టీచర్‌ బోధనతో పాటు ప్రపంచం మెచ్చిన ఇంటర్నేషనల్‌ బాకలారియెట్‌ (ఐబీ) సిలబస్‌ మూరుమూల పల్లెలోని ప్రభుత్వ బడుల్లోకి వస్తున్నాయి.

మన పిల్లలను అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేస్తున్నాయి. ఇవన్నీ తెలంగాణలో లేవు. అక్కడి పేదల పిల్లలకు ఇలాంటి ఫలాలు దక్కట్లేదని ఈనాడు రాయదు. ఇక్కడ రామోజీ లక్ష్యం ఒక్కటే.. అది సీఎం జగన్‌ ప్రభుత్వంపై ప్రజల్లో ఏదో రకంగా వ్యతిరేకత పెంచడం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement