15 ఏళ్లదాకా 44,842 టీచర్ పోస్టులే
* భవిష్యత్తులో డీఎస్సీలు కష్టమే
* మరోవైపు 10 లక్షలకు చేరనున్న బీఎడ్, డీఎడ్‌ల సంఖ్య
* 2030 నాటికి పరిస్థితులపై సక్సెషన్ ప్రణాళిక రూపొందించిన విద్యాశాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే 15 ఏళ్లలో ఉపాధ్యాయ పోస్టులు, బీఈడీ, డీఎడ్ అభ్యర్థుల నిష్పత్తిలో భారీ వ్యత్యాసం ఏర్పడనుంది. లక్షలాది మంది అభ్యర్థులకు ఉద్యోగాలు లభించే పరిస్థితి లేదు. విద్యాశాఖలో రిటైర్‌మెంట్ ద్వారా 44,842 పోస్టులు మాత్రమే ఖాళీ కానున్నాయి. అంటే 2030 నాటికి వాటిని మాత్రమే భర్తీ చేసే అవకాశమున్నట్లు పాఠశాల విద్యాశాఖ నివేదిక రూపొందించింది.
మరోవైపు రాష్ట్రంలోని బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఎడ్), డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎడ్) అభ్యర్థుల సంఖ్య మాత్రం 10 లక్షలకు చేరనుందని పేర్కొంది. సక్సెషన్ రిపోర్టు పేరుతో 2030 నాటికి రాష్ట్రంలో బీఎడ్, డీఎడ్ అభ్యర్థుల సంఖ్య, ఉపాధ్యాయ ఖాళీల సంఖ్యను అంచనా వేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1.24 ల క్షల మంది, ప్రైవేటు పాఠశాలల్లో 1.10 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని 44,842 మంది ఉపాధ్యాయులు 2030 నాటికి పదవీ విరమణ పొందనున్నారు. వారిలో బీఎడ్ అర్హతతో ఉద్యోగాలు పొందిన స్కూల్ అసిస్టెంట్లు దాదాపు 23 వేల మంది, మరో 21,482 మంది డీఎడ్ అర్హత కలిగిన సెకండరీ గ్రేడ్ టీచర్లు ఉండే అవకాశముంది.
అయితే, పదవీ విరమణ పొందే స్కూల్ అసిస్టెంట్లలో 30 శాతం మందిని రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. మిగతా 70 శాతం స్కూల్ అసిస్టెంట్ పోస్టులను సెకండరీ గ్రేడ్ టీచర్లతో పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన వచ్చే 15 ఏళ్లలో రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ రెండు, మూడుసార్లకు మించి చేపట్టే అవకాశం కనిపించడం లేదు.
10 లక్షలకు చేరనున్న అర్హులు
రాష్ట్రంలో టెట్ పేపరు-1 లో అర్హత సాధించినవారు లక్షన్నర మంది ఉండగా, పేపరు-2లో అర్హత సాధిం చినవారు 2.5లక్షల మంది ఉన్నారు. టెట్ రాసేం దుకు సిద్ధంగా మరో 2 లక్షల మంది ఉన్నారు. అంటే ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నవారు 5లక్షల వరకు ఉన్నారు. ఇక రాష్ట్రంలోని డీఎడ్, బీఎడ్ కాలేజీల నుంచి ఏటా 40 వేల మంది బయటకు వస్తున్నారు. 2030 నాటికి ఈ సంఖ్య 10 లక్షలు దాట నుంది. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 61 లక్షల మంది విద్యార్థులుండగా, జనాభా నియంత్రణ నేపథ్యంలో 2030 నాటికి ఆ సంఖ్యలో మార్పు లక్ష లోపే ఉండే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో కొత్త పోస్టుల సృష్టి పెద్దగా ఉండే అవకాశం లేదు.