
మరో 2 వేల గురుకుల టీచర్ పోస్టులు
► భర్తీకి సీఎం కేసీఆర్ ఆమోదం
► ఇప్పటికే 2,444 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ చర్యలు
► వీలైతే అన్నింటికీ కలిపి నెలాఖరులో నోటిఫికేషన్!
► నోటిఫికేషన్‌తోపాటే సిలబస్, పరీక్ష నిబంధనలు
సాక్షి, హైదరాబాద్
రాష్ట్రంలో వివిధ గురుకుల సొసైటీల పరిధిలోని పాఠశాలల్లో దాదాపు 4,500 పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే 2,444 పోస్టుల భర్తీకి ఓకే చెప్పగా రాష్ట్రంలో కొత్తగా మంజూరు చేసిన 224 గురుకుల పాఠశాలలు, 30 డిగ్రీ కాలేజీలకు 2 వేల పోస్టులు మంజూరు చేసేందుకు సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతకం చేసినట్లు తెలిసింది. 224 గురుకుల పాఠశాలల్లో 103 ఎస్సీ గురుకులాలు, 71 మైనారిటీ గురుకులాలు, 50 ఎస్టీ గురుకులాలు ఉన్నాయి. ఇవి కాకుండా మరో 50 బీసీ గురుకులాల మంజూరు ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది.
ఈ నేపథ్యంలో పోస్టుల భర్తీకి ఈ నెలాఖరులో నోటిఫికేషన్ జారీ చేసేందుకు టీఎస్‌పీఎస్సీ కసరత్తు చేస్తోంది. పాఠశాలల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ప్రిన్సిపాల్ పోస్టులు, కాలేజీల్లో జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకి అవసరమైన పరీక్ష విధానాన్ని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఆయా పోస్టులకు సంబంధించి గురుకుల సొసైటీల నుంచి ఇండెంట్లు, రూల్ ఆఫ్ రిజర్వేషన్లు, రోస్టర్ వివరాలను తీసుకొని నోటిఫికేషన్ జారీ చేయాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది. ఈ ప్రక్రియకు మరో 15 రోజుల సమయం పట్టనుంది. మరోవైపు నియామక నిబంధనలు, సిలబస్ రూపకల్పన వంటి అంశాలపై దృష్టి సారించింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఈ నెలాఖరుకల్లా పూర్తి చేసి నోటిఫికేషన్ జారీకి అవసరమైన చర్యలు చేపట్టాలని టీఎస్‌పీఎస్సీ అధికారులను చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఆదేశించినట్లు తెలిసింది.
ఈ నెలాఖరులో నోటిఫికేషన్ ఇచ్చే నాటికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మరో 2 వేల పోస్టుల వివరాలు అందితే వాటిని కూడా కలిపి మొత్తంగా దాదాపు 4,500 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆ వివరాలు అందడం ఆలస్యమైతే తొలుత 2,444 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి ఆ తరువాత 2 వేల పోస్టులు వచ్చాక వాటిని అదే నోటిఫికేషన్ పరిధిలోకి తేవాలని భావిస్తోంది. మరోవైపు కేటగిరీలవారీగా పోస్టులకు నిర్వహించే పరీక్ష సిలబస్‌ను ముందుగా ప్రకటించాలని భావిస్తోంది. వీలుకాకపోతే నోటిఫికేషన్‌తోపాటు జారీ చేసే అవకాశం ఉంది.
అర్హత పరీక్షగానే టెట్?
ఇప్పటిరవకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) స్కోర్‌కు ఉపాధ్యాయ నియామకాల్లో 20 శాతం వెయిటేజీ ఉంది. కానీ ప్రభుత్వం ప్రకటించిన ఇటీవల గురుకులాల్లో భర్తీ చేసే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టుల పరీక్ష విధానంలో టెట్ అంశాన్ని ప్రస్తావించలేదు. దీంతో టీజీటీ పోస్టులకు టెట్ అవసరమా లేదా అనే సందేహం నెలకొంది. అయితే టెట్‌ను కేవలం అర్హత పరీక్షగానే చూడాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. టెట్ స్కోర్‌కు వెయిటేజీని తొలగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు టె ట్ వెయిటేజీ అంశంపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 5న జరిగే టీఎస్‌పీఎస్సీ కమిషన్ సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.