సాక్షి, రంగారెడ్డిజిల్లా: విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించడంలో ఉపాధ్యాయల పాత్ర ఎంతో కీలక మని, ఉత్తమ విద్యాబోధన ద్వారానే విద్యార్థులు మంచి పౌరులుగా ఎదుగుతారని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులను శుక్రవారం కొత్తపేట బీజేఆర్ భవన్‌లో పురస్కారాలతో సత్కరించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ.. గురువు లేనిదే ఎవ్వరూ రాణించలేరన్నారు. ఇప్పుడున్న ఎంతోమంది ప్రజా ప్రతినిధులు, అధికారులు ఎలాంటి సౌకర్యాలు లేని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని ఉపాధ్యాయుల సూచనలతో పైకి వచ్చినవారేనన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, బంగారు తెలంగాణ నిర్మాణంలోనూ వారు పాలుపంచుకోవాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టోలో ప్రకటించినట్లు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్భంధ విద్యను అమలు చేస్తామని స్పష్టం చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉందని, త్వరలో ఆ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. జెడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ.. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను అందరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదన్నారు. భువనగిరి ఎంపీ వూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ.. గురువులు వెన్నంటి ప్రోత్సహిస్తే సాధించలేనిది ఏదీ ఉండదన్నారు. కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైందని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివి తాను ఈ స్థాయిలో ఉన్నానంటే అది ఉపాధ్యాయుల కృషి ఫలితమేనన్నారు. డీఈఓ రమేశ్ తాను సొంతంగా రాసుకున్న ‘ప్రణామం గురువా.. ప్రణామం, పెడదారిన పడుతున్న మా పట్ల వారధిగా మారి..’ అన్న పాటను పాడి ఆకట్టుకున్నారు. అనంతరం విద్యారంగంలో ఉత్తమ సేవలందించిన 85 మంది ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి, పురస్కారాలు అందచేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో మహేశ్వరం, వికారాబాద్ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, సంజీవరావు, ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, ఆర్‌వీఎం పీడీ కిషన్‌రావ్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల ఉన్నతిలో గురువులే కీలకం
Published Fri, Sep 5 2014 11:55 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement
Advertisement