జనవరిలో డీఎస్సీ!
♦ ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సర్కారు నిర్ణయం
♦ 10 వేల వరకు పోస్టులు ఉండే అవకాశం!
♦ వచ్చే విద్యా సంవత్సరంలో కొత్త టీచర్లు
♦ అప్పటివరకు విద్యా వలంటీర్లతో బోధన
♦ వచ్చేనెల 10 నాటికి 7,983 మంది వీవీల నియామకం
♦ రూ. 8 వేల వేతనంతో మండలం యూనిట్‌గా భర్తీ
♦ రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ప్రక్రియను పూర్తిచేసి పాఠశాలల్లో కొత్త టీచర్లను నియమించనుంది. దాదాపు 10 వేల ఉపాధ్యాయ పోస్టులు ఉండే అవకాశం ఉన్నట్లు అంచనా. అయితే ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ జారీ చేసినా.. ప్రక్రియ పూర్తయ్యేందుకు ఐదారు నెలల సమయం పడుతుంది. అంటే ప్రస్తుత విద్యా సంవత్సరం దాదాపు పూర్తయి, వేసవి సెలవుల సమయం వస్తుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ నెలాఖరు లేదా జనవరిలో నోటిఫికేషన్ జారీచేస్తే మే నెలాఖరుకల్లా నియామకాల ప్రక్రియను పూర్తి చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా వచ్చే ఏడాది జూన్ 12న స్కూళ్లు ప్రారంభించే నాటికి కొత్త టీచర్లను పాఠశాలలకు పంపించాలన్న యోచనలో ఉంది.
వారంలో విద్యా వలంటీర్లు..
ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సమయం పట్టే అవకాశం ఉన్నందున టీచర్లు లేని స్కూళ్లలో వెంటనే విద్యా వలంటీర్లను నియమించనున్నారు. ప్రస్తుతమున్న 7,983 ఖాళీల్లో సెప్టెంబర్ 10వ తేదీ నాటికి ఈ నియామకాలను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విద్యా వలంటీర్లకు నెలకు రూ.8 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లించే అవకాశముంది. ఎస్జీటీ ఖాళీల్లో నియమించే వారికి ఇంటర్‌తోపాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) విద్యార్హత ఉండాలి. స్కూల్ అసిస్టెంట్ స్థానంలో నియమితులయ్యే వారికి డిగ్రీతోపాటు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) అర్హత ఉండాలి. మండలం యూనిట్‌గా జిల్లా యంత్రాంగం నేతృత్వంలో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలు ఈ నియామకాలను చేపడతాయి.
ఆ మండలానికి చెందిన వారినే విద్యా వలంటీర్లుగా నియమిస్తారు. వయోపరిమితి తదితర వివరాలు మార్గదర్శకాల్లో ఉంటాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. టెన్త్, ఇంటర్, డీఎడ్/బీఎడ్‌లో అభ్యర్థులు సాధించిన మార్కులకు వెయిటేజీ ఇచ్చి మెరిట్‌ను రూపొందించి నియామకాలు చేపడతారు. దీంతోపాటు రోస్టర్, రిజర్వేషన్లను పాటిస్తారు. ఈ మేరకు మార్గదర్శకాలు రెండు మూడు రోజుల్లో జారీ కానున్నాయని పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు వెల్లడించారు.
ఖాళీలపై స్పష్టత వచ్చినందునే..
‘‘ఉపాధ్యాయ ఖాళీలపై ప్రస్తుతం స్పష్టత వచ్చింది. గతంలో ఆ స్పష్టత లేనందునే కొత్త నోటిఫికేషన్‌పై దృష్టి పెట్టలేదు. ఇప్పుడు కూడా వెంటనే నియామకాలు చేపట్టడం సాధ్యం కాదు. నోటిఫికేషన్ ఇచ్చినా ఐదారు నెలల సమయం పడుతుంది. మొత్తానికి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త టీచర్లను నియమిస్తాం. డీఎస్సీ నోటిఫికేషన్ జారీ ఎప్పుడన్నది త్వరలో నిర్ణయిస్తాం..’’
- డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి.
జిల్లాల వారీగా నియామకం కానున్న విద్యా వలంటీర్లు
- మహబూబ్‌నగర్ 1,646
- రంగారెడ్డి 1,408
- ఆదిలాబాద్ 1,244
- మెదక్ 1,104
- ఖమ్మం 674
- నిజమాబాద్ 480
- హైదరాబాద్ 414
- నల్లగొండ 362
- కరీంనగర్ 337
- వరంగల్ 314.