
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘‘కొండంత రాగం తీసి.. ’’ అనే చందంగా తయారైంది ఉపాధ్యాయ పోస్టుల భర్తీ వ్యవహారం. కోర్టు కేసులున్న దివ్యాంగుల కోటా మినహా దాదాపు అన్ని పోస్టుల్లో నియామకాలు చేపడతామని ఇటీవల సర్కారు పేర్కొంది. దీంతో సర్కారు బడులకు మంచి రోజులు రానున్నాయని అందరూ భావించారు. అయితే చివరి నిమిషంలో అన్ని పోస్టులు కాదు కొన్నింటినే భర్తీ చేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. ఫలితంగా ఎప్పటిలాగే ఈ విద్యాసంవత్సరం కూడా సర్కారు బడుల విద్యార్థులకు అరకొర బోధనే దిక్కుకానుంది. గుర్తించిన పోస్టుల్లో ఐదో వంతు మాత్రమే ప్రస్తుతం భర్తీ చేయాలని జిల్లా విద్యాశాఖకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ఆదేశాలు జారీ చేసింది. కాగా ఒక్క ఎస్‌జీటీ పోస్టు కూడా భర్తీ చేయలేక పోతుండటం గమనార్హం. కనీసం స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్ పోస్టుల్లోనూ పూర్తి స్థాయిలో నియామకాలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
250 పోస్టులే భర్తీ!
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,269 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గతేడాది మొదట్లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహించారు. ఇందులో 915 ఎస్‌జీటీ, 192 స్కూల్ అసిస్టెంట్, 146 లాంగ్వేజ్ పండిట్, 16 పీఈటీ పోస్టులు ఉన్నాయి. వీటిలో ఎస్‌జీటీ, పీఈటీ పోస్టుల భర్తీ విషయాన్ని సర్కారు పక్కన పెట్టింది. మొత్తం స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో 151 పోస్టులకు సంబంధించే అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసేందుకు షెడ్యూల్ విడుదల చేశారు. హిందీ సబ్జెక్టు పోస్టుల ప్రస్తావనే లేదు. ఇక లాంగ్వేజ్ పండిట్ పోస్టుల విషయంలోనూ ఇదే తరహాలో వ్యవహరించారు. కేవలం 99 తెలుగు పోస్టుల అభ్యర్థులనే వెరిఫికేషన్‌కు కబురు పెట్టారు. మొత్తం మీద 250 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లనే పరిశీలించనున్నారు.
నేడు సర్టిఫికెట్ల పరిశీలన...
స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల విద్యార్హత పత్రాలను ఈనెల 11న ఎల్బీనగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరిశీలించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలు, గెజిటెడ్ అధికారి ధృవీకరించిన రెండు సెట్ల జిరాక్స్ ప్రతులు, నాలుగు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 13, 14 తేదీల్లో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఖైరతాబాద్‌లోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 9.30 గంటలకు ఇది ప్రారంభం కానుంది.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అయ్యే పోస్టులుస్కూల్ అసిస్టెంట్
గణితం: 29
ఫిజికల్ సైన్స్ : 5
బయోలాజికల్ సైన్స్ : 30
సోషల్ స్టడీస్ : 64
తెలుగు : 22
లాంగ్వేజ్ పండిట్ తెలుగు : 99
Comments
Please login to add a commentAdd a comment