టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీకి సర్కారు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 2,444 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలంటూ బుధవారం టీఎస్‌పీఎస్సీని ఆదేశించింది. సాంఘిక సంక్షేమ గురుకులాల్లోని 758 ఉపాధ్యాయ పోస్టులు, బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని గురుకులాల్లోని 307, రాష్ట్ర ప్రభుత్వ గురుకులాల్లోని 313, గిరిజన గురుకులాల్లోని 436, మైనారిటీ గురుకులాల్లోని 630 పోస్టులను భర్తీ చేయనుంది.
టీచర్ పోస్టుల భర్తీ టీఎస్‌పీఎస్సీకే!
ఇప్పటివరకు విద్యాశాఖ నేతృత్వంలో, గురుకులాల సొసైటీల ఆధ్వర్యంలో వాటి పరిధిలోని ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారు. కానీ ఇకపై అన్ని విభాగాల్లోని ఉపాధ్యాయ పోస్టులను టీఎస్‌పీఎస్సీ ద్వారానే భర్తీ చేసే అవకాశం ఉంది. ఈ అంశంపై ఇప్పటికే సీఎం స్థాయిలో చర్చ జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లోని ఖాళీల భర్తీని విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా ఎంపిక కమిటీల (డీఎస్సీ) ద్వారా చేపట్టడంతో... జిల్లాల్లో కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు నోటిఫికేషన్ జారీ నుంచి భర్తీ చేసేదాకా ఆ ప్రక్రియపైనే పనిచేయాల్సి వస్తోంది. దాంతో ఇతర విద్యా సంబంధ కార్యక్రమాలు నిలిచిపోతున్నాయి.
దాంతోపాటు జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో ఆరు నెలల పాటు పాలన స్తంభించిపోతోంది. అకడమిక్ కార్యక్రమాలను పట్టించుకునేవారు లేకుండా పోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం టీచర్ పోస్టుల భర్తీని టీఎస్‌పీఎస్సీకి అప్పగించాలని యోచిస్తోంది. ఇక ప్రభుత్వ పాఠశాలల్లోని దాదాపు 12 వేల పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైలు ప్రస్తుతం ముఖ్యమంత్రి వద్ద ఉంది. ఆ పోస్టుల భర్తీకి త్వరలోనే గ్రీన్‌సిగ్నల్ రానుంది. వాటి భర్తీని కూడా టీఎస్‌పీఎస్సీకే అప్పగించే అవకాశం ఉంది.