... బదులు!
♦ ఆశ్రమ పాఠశాలల్లో బియ్యం కొరత
♦ చేబదుళ్ల కోసం వార్డెన్లు, హెచ్ఎంల తంటాలు
♦ ఇదే పరిస్థితి కొనసాగితే విద్యార్థులు పస్తులే..
ఆశ్రమ ఉన్నత పాఠశాలలు 37
హాస్టళ్లు 12
విద్యార్థుల సంఖ్య 7,169 మంది
ఎస్ఎస్తాడ్వాయి(ములుగు): గిరిజన ఆశ్రమ పాఠశాలలను బియ్యం కొరత వేధిస్తోంది. పాఠశాలలు ప్రారంభమై ఇరవై రోజులు కావస్తున్నా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లకు ఇప్పటి వరకు బియ్యం సరఫరా చేయలేదు. దీంతో ప్రతీరోజూ విద్యార్థుల ఆకలి తీర్చేందుకు వార్డెన్లు నానా తంటాలు పడుతున్నారు. కిరాణ షాపులు, ఇతరత్రా వస్తువుల నుంచి చేబదుళ్లపై బియ్యం తీసుకురావాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇప్పటికే ఇలా గడిపినా ఇంకా ఉన్నతాధికారులు బియ్యం సరఫరా చేయకపోవడంతో రోజూ క్వింటాళ్ల కొద్ది బియ్యాన్ని ఎక్కడ నుంచి తీసుకురావాలని వారు ప్రశ్నిస్తున్నారు.
ప్రతీనెల 20న ఇండెంట్
గిరిజన సంక్షేమ ఉన్నత పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ప్రతీరోజూ మధ్యాహ్న భోజనం పెడుతారు. ఇక ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు రెండు పూటలా భోజనం, టిఫిన్ పెట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు నెలలో కావాల్సిన బియ్యం పంపిణీ కోసం ప్రతి నెల 20వ తేదీన హెచ్ఎంలు, వార్డెన్లు గిరిజన సంక్షేమశాఖ అధికారులకు ఇండెంట్ పంపిస్తారు. ఇదేక్రమంలో జూన్ నెలకు కావాల్సిన బియ్యం విషయమై మే 20వ తేదీన ఇండెంట్ పంపించినట్లు పాఠశాల హెచ్ఎంలు చెబుతున్నారు. కానీ పాఠశాలలు తెరిచి ఇరవై రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు బియ్యం సరఫరా చేయకపోవడంతో విద్యార్థులకు భోజనం వండి పెట్టేందుకు బియ్యం సర్దుబాటు చేయడం వార్డెన్లు, హెచ్ఎంలకు తలకు మించిన భారంగా మారింది.
సన్న బియ్యంతో భోజనం
రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల విద్యార్థుల మధ్యాహ్న భోజనం కోసం సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. ఈ మేరకు జిల్లాల్లోని ములుగు డివిజన్ విషయానికొస్తే ఎస్ఎస్ తాడ్వాయి, మేడారం ఇంగ్లిష్ మీడియం, ఏకే ఘనపురం, చిన్నబోయినపల్లి, చంచుపల్లి, వెంకటపూర్(కే), వాజేడు ఆశ్రమ పాఠశాలల్లో సమరుగా 500 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో రోజుకు రెండు, మూడు క్వింటాళ్ల బియ్యం భోజనం వండాల్సి ఉంటుంది. అయితే, బియ్యం సరఫరా కాకపోవడంతో రోజూ క్వింటాళ్ల కొద్ది బియ్యం చేబదులుపై తీసుకురావడానికి వార్డెన్లు ఇబ్బంది పడుతున్నారు.
ఒకవేళ రేషన్ డీలర్లను బతిమిలాడి దొడ్డు బియ్యం తీసుకొచ్చినా.. సన్న బియ్యంతో భోజనానికి అలవాటు పడిన విద్యార్థులు దొడ్డు బియ్యంతో వండే అన్నం తినేందుకు ససేమిరా అంటున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కిరాణా షాపుల్లో సన్న బియాన్ని కొనుగోలు చేసి పెట్టాల్సిన పరిస్థితి వార్డెన్లు ఎదురవుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరగా బియ్యం సరఫరా చేసేలా చర్యలు తీసుకోకపోతే విద్యార్థులు భోజనం కోసం అలమటించే దుస్ధితి నెలకొనుంది. బియ్యం కొరత ములుగు డివిజన్ ఆశ్రమ పాఠశాలలే కాకుండా జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఉందని వార్డెన్లు వాపోతున్నారు.
గిరిజన విద్యపై నిర్లక్ష్యం
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య బోధన, నాణ్యమైన భోజనం అందిస్తున్నామని అధికారులు చెప్పడమే తప్ప అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పాఠశాలలు తెరిచి ఇరవై రోజులు కావస్తున్నా బియ్యం పంపిణీ చేయకపోవడాన్ని ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. పాఠశాలలకు బియ్యం సరఫరా చేయని విషయం తెలిసినా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఏదిఏమైనా వార్డెన్లు బియ్యాన్ని చేబదులుకు తీసుకురాలేమని చేతులెత్తేస్తే జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థులు ఆకలితో మాడిపోవడం ఖాయమని చెప్పొచ్చు.
త్వరలో బియ్యం సరఫరా
ఆశ్రమ పాఠశాలలకు ఒకటి, రెండు రోజుల్లో బియ్యం సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నం. బియ్యం పంపిణీలో అలస్యం జరిగిన విషయం వాస్తవమే. పాఠశాలలకు బియ్యం పంపిణీ కోసం జీసీసీకి ఇండెంట్ పంపించాం. కానీ గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ నుంచి లేఖ రావాలని జీసీసీ అధికారులు అంటున్నారు. ఈ విషయాన్ని ఫాలో అప్ చేస్తున్నాం. వీలైనంత తర్వగా బియ్యం పంపిణీ అయ్యేలా చూస్తాం.
– మంకిడి ఎర్రయ్య, డీటీడీఓ