హైదరాబాద్: పబ్లిక్ కమిషన్ ద్వారా సెలక్ట్ అయిన 8,792 మంది టీచర్లకు వారం రోజులలో పోస్టింగ్స్ ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. లేకపోతే మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. శనివారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో గుజ్జ కృష్ణ అధ్యక్షతన సెలక్టెడ్ టీచర్ల రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణయ్య మాట్లాడుతూ.. సెలక్ట్ అయిన టీచర్లకు వెంటనే పోస్టింగ్‌లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ బీసీ కమిషన్‌లకు ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తుందని విమర్శించారు. జాప్యం మూలంగా నెలకు రూ.100 కోట్లు బడ్జెట్ మిగుల్చుకోవాలని కుట్ర చేస్తోందని ఆరోపించారు.
అనేక వివాదాల మధ్య 6 నెలల క్రితం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసి ఫైనల్ సెలక్టెడ్ టీచర్ల జాబితాను విద్యాశాఖ అధికారులకు పంపారని, గత 6 నెలలుగా సీఎం పేషీలో ఈ ఫైలు పెండింగ్‌లో ఉందన్నారు. సీఎం ఫైళ్లను చూడటం లేదని, అందువల్ల సెలక్ట్ అయిన వేలాదిమంది టీచర్లు నిరుద్యోగులుగా మారా రన్నారు. రాష్ట్ర ప్రభుత్వం టీచింగ్ స్టాఫ్‌ను నియమించకుండా విద్యను భ్రష్టు పట్టిస్తుందని ఆరోపించారు. ఇప్పుడు జరుగుతున్న ఇంటర్ గందరగోళానికి కారణం సరైన అధ్యాపకులు లేకపోవడమేనన్నారు. దాదాపు 70% జూని యర్ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, దీంతో విద్యార్హతలు లేని వారితో పేపర్ వ్యాల్యుయేషన్ చేయించారని ఆరోపించారు. టీచర్ ఉద్యోగాల భర్తీని పీఎస్సీ నుంచి బదిలీ చేసిన డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో మాదిరిగా టీచర్ ఉద్యోగాల భర్తీని జిల్లా సెలక్షన్ కమిటీల ద్వారా భర్తీ చేయాలని ఆర్.కృష్ణయ్య సూచించారు. ఈ సమావేశంలో ఎర్ర సత్యనారాయణ, దాసు సురేష్, జి.అంజి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment