- మంత్రి కిమ్మెన రత్నాకర్
- ‘పీయూసీ’లోని ఖాళీలూ భర్తీ
- పాఠశాలల మౌలిక సదుపాయాలకు నిధులు
- ప్రతి మాధ్యమిక పాఠశాలకూ హెచ్‌ఎం
- బ్లాక్‌మార్కెట్‌లో పాఠ్యపుస్తకాలపై దర్యాప్తునకు ఆదేశించాం
- త్వరలో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ
సాక్షి, బెంగళూరు : రాష్ట్ర ప్రభుత్వం ఇకపై ఏటా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తుందని రాష్ట్ర ప్రాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కిమ్మెన రత్నాకర్ తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖలో ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి గురించి బెంగళూరులోని సర్వశిక్ష అభియాన్ ప్రధాన కార్యాలయంలో మీడియాకు బుధవారం వివరించారు. ఏడాదికి నాలుగు నుంచి ఐదు వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అనుమతించాల్సిందిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆర్థిక శాఖకు ఇటీవలే ఆదేశించారన్నారు.
దీని వల్ల రాష్ట్రంలో ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలతో పాటు పీయూసీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వచ్చే ఐదేళ్లలోపు భర్తీ చేస్తామని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పన కోసం అవసరమున్న ప్రతి నియోజకవర్గానికీ రూ.40 లక్షలు కేటాయించనున్నామన్నారు. ఇవి బడ్జెట్‌లో పేర్కొన్న నిధులకు అదనమని పేర్కొన్నారు. ప్రస్తుతం 60 మంది పిల్లలు ఉన్న మాధ్యమిక పాఠశాలకు మాత్రమే ప్రధానోపాధ్యాయుడు ఉంటున్నారన్నారు.
దీని వల్ల హెడ్‌మాస్టర్ లేని పాఠశాలల్లో నాణ్యతా ప్రమాణాలు తక్కువగా ఉన్న ట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. అందువల్ల విద్యార్థుల సంఖ్యతో సంబంధం లే కుండా ప్రతి మాధ్యమిక పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యాయుడు ఉండేలా నిబంధనలు రూపొందించనున్నామన్నారు. ప్రా థమిక దశలో మాతృభాషలోనే తప్పక విద్యాబోధన జరగాల్సిన పనిలేదని సుప్రీం కోర్టు పేర్కొనడం కన్నడకే కాక ఆ యా ప్రాంతీయ భాషల అభివృద్ధికీ గొడ్డలిపెట్టువంటిదని అభిప్రాయపడ్డారు.
ఈ విషయమై ఇప్పటికే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశార ని, అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ విషయంపై త్వరలో స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. పీయూసీ పాఠ్యపుస్తకాల బ్లాక్‌మార్కెట్ వ్యవహారంపై ఇప్పటికే సమగ్ర దర్యాప్తునకు ఆదేశించామని, నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని వివరించారు.
కాగా, విద్యాశాఖలో చేపట్టిన పలు సంస్కరణలవల్లే ఈ ఏడాది పాఠశాలల ప్రారంభ సమయానికి పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు ఇవ్వడానికి వీలవుతోందన్నారు. న్యాయసంబంధ ఇబ్బందుల వల్లే సైకిళ్లను విద్యార్థులకు ప్రస్తుతానికి అందించలేకపోతున్నామని, త్వరలో వాటిని కూడా విద్యార్థులకు పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు.