
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే విద్యా సంవత్సరం లోపు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని సుప్రీంకోర్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఏపీలో టీచర్ల పోస్టుల భర్తీపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం రెండుసార్లు అఫిడవిట్ దాఖలు చేసింది. 4,600 ఖాళీలు ఉన్నాయని ఒకసారి పేర్కొంది. పోస్టుల కంటే ఉపాధ్యాయులు ఎక్కువ మంది ఉన్నారని మరోసారి తెలిపింది.
ఈ నేపథ్యంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసుకునేందుకు గతంలో త్రిసభ్య కమిటీని సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటు చేసింది. మొత్తం 9,265 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని కమిటీ తేల్చడంతో ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఏపీ ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టుకు తెలిపింది. దీంతో తదుపరి విచారణను జనవరి మూడో వారానికి న్యాయస్థానం వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment