డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని తాజాగా ప్రభుత్వం ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి.
సాక్షి, కర్నూలు : డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని తాజాగా ప్రభుత్వం ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ఉపాధ్యాయ నియామక ప్రకటన సెప్టెంబరు, అక్టోబరు మధ్యలో జారీ చేయనున్నట్లు, ఇకపై ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహించాలని భావిస్తున్నట్లు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం ప్రకటించారు. 2008, 2012లలో డీఎస్సీ నిర్వహణ అనంతరం రెండేళ్ల తర్వాత ప్రకటన వెలువడడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.
డీఎస్సీ ద్వారా జిల్లాలో ఖాళీగా ఉన్న 587 పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది. జిల్లాలో స్కూల్ అసిస్టెంట్లు 90, సెంకడరీ గ్రేడ్ టీచర్ల పోస్టులు 401, భాషా పండితలు 84, పీఈటీలు 12 పోస్టలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలు నింపడంతో బ్యాక్‌లాగ్, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, బీసీ కేటగిరీల వారీగా ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇప్పటికే పలువురు యువకులు డీఈటీ, బీఈడీ కోర్సులు పూర్తిచేసి డీఎస్సీ రాత పరీక్ష కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలో డీఎస్సీ ప్రకటన వెలువడనున్నట్లు ప్రకటించడంతో వారంతా కసరత్తు మొదలెట్టారు.
ఖాళీలు నిండితే సజావుగా పాఠాలు..
విద్యా హక్కు చట్టం ప్రకారం రెగ్యులర్ ఉపాధ్యాయులే ఉండాలన్న నిబంధనతో గత ఏడాది పాఠశాలల్లో విద్యావలంటీర్లను నియమించలేదు. దీంతో అటు రెగ్యులర్ ఉపాధ్యాయులు, ఇటు విద్యావలంటీర్లు లేకుండా విద్యా సంవత్సరం ముగిసింది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఉపాధ్యాయులను నియమించాల్సి ఉండగా నేటివరకూ ఆ చర్యలే కానరాలేదు. బదిలీలు, పదోన్నతులు, పదవీవిరమణ తదితర కారణాలతో జిల్లాలోని పలు ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా కొనసాగుతున్నాయి.
అంతేకాకుండా పలు సబ్జెక్టులను బోధించేందుకు కూడా ఉపాధ్యాయులు కొరత వెంటాడుతోంది. జిల్లాలో 4,021 పాఠశాలు ఉంటే వీటి పరిధిలో 23,866 మంది ఉపాధ్యాయులు ఉన్నట్లు యంత్రాంగం చెబుతోంది. కొన్ని చోట్ల ఉపాధ్యాయులు, విద్యార్థుల శాతానికి పొంతన కుదరడం లేదు. రేషనలైజేషన్ ద్వారా ఈ పరిస్థితి చక్కదిద్దేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. డీఎస్సీ ద్వారా ఖాళీల భర్తీ జరిగితే చదువులు సవ్యంగా సాగే అవకాశం లేదు.
ప్రకటన కోసం ఎదురుచూపులు..
గత ఏడాది నవంబరు 9, 10, 11 తేదీల్లో డీఎస్సీని నిర్వహించనున్నట్లు విద్యాశాఖ జులైలో ప్రకటించింది. వివిధ కారణాలతో దానిని వాయిదా వేసింది. దీంతో డీఎస్సీ కోసం కోచింగ్ కేంద్రాల్లో చేరిన నిరుద్యోగులు నిరుత్సాహపడ్డారు. కానీ టెట్ పరీక్ష రాసి ప్రణాళికగా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు. మళ్లీ ఆశలు చిరుగించేలా ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని నిర్ణయించింది.